Friday, May 19, 2017

చమత్కారమైన ఆశీస్సు.

విహ౦గో వాహనం యేషామ్, త్రికంచ ధర పాణయః
పాసల సహితా దేవాః సదా తిష్ఠన్తు తే గృహే ..
...
ఒక బ్రాహ్మణుడు ఒక ధనికుని యింటికి వెళ్ళాడు. ఆ ధనికుడు సంపదతో పాటు చక్కని సంస్కారం కలవాడు. ఆ బ్రాహ్మణుడికి కడుపునిండా భోజనం పెట్టి, చక్కని పట్టు వస్త్రాలను కూడా యిచ్చిఘనంగా సత్కరించాడు.సంతోషం లో నోటినుంచి పైని ఆశీర్వచన శ్లోకం
 తన్నుకొని వచ్చింది. ఏమిటా ఆశీర్వచనం అంటే 
పక్షులు వాహనాలుగా కలవారూ, త్రికములను ధరించిన వారూ, పాసలతో నిండిన వారూ
యగు దేవతలు మీ యింట యెప్పుడూ వుందురుగాక! ఇదేమో తికమకగా వుంది అంటారా?
వివరణ:-వి: =పక్షి, హం = హంస, గో=ఎద్దు ఈ మూడూ వాహనాలుగా గల వారు ఎవరు?
పక్షివాహనుడైన విష్ణువు, హంస వాహనుడు బ్రహ్మదేవుడూ, ఎద్దు వాహనంగా కలవాడు శివుడు ఈ ముగ్గురూ త్రికంచ =త్రికములను ధరించినవారు అంటే 'త్రి' అంటే
త్రిశూలము 'కం' శంఖము, 'చ' చక్రము ధరించివారు త్రిమూర్తులు గదా!
త్రిశూల ధారి శివుడు, శంఖము ధరించిన బ్రహ్మ, చక్రమును ధరించిన విష్ణువు , ఈ
ముగ్గురూ 'పాసములతో' కూడిన దేవతలు. 'పా' అంటే పార్వతి 'స' అంటే సరస్వతి
'ల' అంటే లక్ష్మీదేవి . తో కూడిన దేవతలు ముగ్గురూ మీ యింట ఎల్లప్పుడూ ఉండాలి అని అర్థం.
సరస్వతి,లక్ష్మీ, పార్వతి, లతో కూడినవారు అవటం వలన విద్యలు,ఐశ్వర్యము, సౌభాగ్యములు మీ యింట వుండాలి. శంఖ,చక్ర, శూలములు ధరించినవారు అనటం వలన శత్రుబాధలు,రాక్షసబాధలు మీకు వుండవు.త్రిమూర్తులు మీ యింట వుండాలి అనటం తో సర్వసౌఖ్యాలతో బాటు శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!
అని చమత్కారమైన ఆశీస్సు.
*సర్వేజనాఃసుఖినోభవంతు*

No comments:

Post a Comment

Total Pageviews