Wednesday, January 13, 2016

సంక్రాంతి క్రాంతి

సంక్రాంతి క్రాంతి
పండుగ అంటే? ఓ ఏడాది ఎదురుచూపు!
ఒక అందమైన అనుబంధం! 
ఆనందపు అనుభవాల సుమహారం!
పాత తీపి జ్ఞాపకాల సమాహారం!
సంక్రాంతి అంటే- దాదాపు నెల రోజులనుంచి 
ఊరంతా సంబరంగా జరుపుకునే పెద్దపండుగ 
ఇంటింటా పచ్చని తోరణాలు, ఇంటిముంగిట కల్లాపి జల్లులతో తీర్చిన రంగవల్లులు వీధులలో రంగు రంగు రంగోలీ తివాచీలు, ఆ వాటి పై వీధుల వీధుల విభుడేగే అన్నట్లుగా దేవాలయాన్ని వీడి మన ముంగిట్లోకి పల్లకీ లో ఊరేగి వచ్చీ మరీ ఆశీర్వచనాలు అందించే భక్త సులభుడైన దేవుళ్ళు, హరిదాసులు, బుడబుక్కల వారు, గొబ్బెమ్మల ఆటపాటలు  
పుష్యం చలి మంచం పై నుండి లేవనియ్యదు, దుప్పటి తియ్యనియ్యదు. వీధిలో భోగిమంటల హడావుడి   తూరుపు దిక్కు ఇంకా వెలుగురేకలు విచ్చుకోక ముందే అమ్మ కేకలు లేవండి! లేవండి! అంటూ త్వరగా తలంటి స్నానాల కోసం ఆవిడ హడావిడి. నెత్తిమీద చమురు పెట్టి అత్తకడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటూ దీవెనలతో ఆనక వళ్ళంతా నూనిరాసి కుంకుడు కాయలు కొట్టించి, నలుగు పిండి రాసి, నలిచిన పిండిని కాకిని పిలుస్తూ కాకీ నా నలుపు నువ్వు తీసుకుని నా తెలుపు నాకిచ్చేయ్ అంటూ స్నానాలగది పిట్టగోడపై ఆ నలుగు పిండి ముద్దపెడితే కాకులు తీసుకు వెళ్ళడం. పిల్లల స్నానం చేస్తున్నప్పుడు కంటిలో కుంకుడు పులుసు పడిందని, గట్టిగా రుద్దవద్దు అని ఏడుపులు... మన  వంతు వచ్చేదాకా వినోదమే స్నానాలు అయ్యాక కొత్తబట్టలు భోగి దండలు భోగిమంటల్లో వెయ్యడం,  
సంక్రాంతి మూడు రోజుల పండగ కాదు. ఒక మాసం పాటు హడావిడి చేసే పండగ. డిసెంబర్ నుంచే సన్నాహాలు మొదలైపోయేవి. అటక మీద ఎక్కి దూలాలు, గోడలపై బూజులు దులిపి గోడలకి సున్నాలు తలుపులకి రంగులు గడపలకు పువ్వులు లతలు పెయింట్ చెయ్యడం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం    కొత్త దుస్తుల ఎంపికలు, కుట్టించు కోవడం టైలర్ త్వరగా ఇస్తాడా ఇవ్వడా ఎదురు చూపులు, పెరట్లో పూలు కొయ్యడం. వాటి నాజూకుదనం పరిమళం, కొత్తబట్టలు తోడుక్కోవడం, గుడి మైకులో పాటలు, మధ్యాహ్నం పడమటింట్లో పిల్ల పెద్దలు కలసి ఘుమఘుమల భోజనాలు, మేట్నీసినిమాకి ఉరుకులు      
సాయం కాలాలు సందె గొబ్బెమ్మలుంచి ఆటలు పాటలు.
‘పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట?
రాజ వారి తోటలో మల్లె పూవు పూసిందంట’
‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో
సుబ్బి గొబ్బెమ్మ సిరులనీయవె
చేమంతి పూవంటి చెల్లెలి నీయవే
తామర పూవంటి తమ్ముణ్నీయవే
మొగలి పూవంటి మొగుణ్నీయవే’
ఇలా ఎన్నో గొబ్బెమ్మల పాటలు ఆటలు
గంగిరెద్దుఆటలు, వారు వాయించే సన్నాయిలు, ఇచ్చే దీవెనలు డబడబ బుడబుక్కల సవ్వడులతో   బుడబుక్కల వారి "అంబపలుకు జగదంబ పలుకు" అంటూ భయం గొలిపే విచిత్ర వేషధారణ, అక్షయ పాత్రలతో హరిదాసు కీర్తనలు అందించే దీవెనలు చేతిలో చిడతల చప్పుళ్ళూ – అన్నీ ప్రపంచపు వింతలే. పండగ ప్రతి సవ్వడి ఒక కొత్త స్వరంలా వినిపించేది. భోగిపళ్ళ పేరంటాలు, గలగల రాలి పడుతూ రాగి నాణేలు, బొమ్మలకొలువులు, పన్నీటి సువాసనలు, వెలుగుతూ దీపాలు, ముత్తైదువల ఆశీర్వచన హారతి పాటలు, పిల్లల చిరాకు ఏడుపులు, గుళ్ళో గోదాదేవి కల్యాణాలు, ఇంట్లోకి వినిపిస్తూ మేళతాళాలు, వూరంతా సంక్రాంతి సందడి ఈ కవితలో ఆస్వాదించండి!  
మంచుతెరల చేమంతుల దోబూచులు 
బంతిపూల పూబంతుల విరబూతలు 
హేమంతం చేసెనంట సీమంతం 
పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం ..సిరివంతం! 
సిరుల విరులతో అలరారే కాలం 
ఆబాలగోపాలం ఆలపించు భూపాలం 
శుభ సంక్రాంతి శోభకిదే సంకేతం!
దినకర మకర సంక్రమణ సరంభాని కిదే యిదే స్వాగతం!
ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగదిగో...
హరిలో రంగహరీ...కీర్తనల హరిదాసు నర్తనలు 
ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలూ..
ఇవిగివిగో...బొమ్మల కొలువులు...భోగిపళ్ల బోసి నవ్వులు 
అందాల అనుబంధాలు...ఆనందాలు పెనవేసిన బంధాలు 
ఇలా తెలిగింటి వెలుగులతో వెలిగెనంట భోగిమంట 
మంగళకరమై శుక్రవారపు శోభాయమానంగా అరుదెంచే
మకర సంక్రాంతి కిదే యిదే స్వాగతమంటా..
డబడబ బుడబుక్కల సడులు...డోలు...సన్నాయి తోడ  
డూడూ బసవన్నలాడు సందడులు..  
కోడిపుంజుల రంజైన ఎడ్లపందాల గెలుపుల ఈలలు
గాలిపటాల అలలు అహహా..
అంబరాలు తాకినవి సంక్రాంతి సంబరాలు 
సర్వాంగ సుందరమీ ధనుర్మాస సోయగాలు 
పాడిపంటల వేడిమంటల  భోగి పండుగ 
పిండివంటల పొంగలి పొంగుల పెద్దపండుగ  
పశువుల మేనినునుపుల మా కనుమ పండుగ..కలల పండుగ
ఆ పర్వదిన మాధుర్యం...అపూర్వ సంప్రదాయ సౌరభం 
మూడునాళ్ళూ ముచ్చటగా సంక్రాంతి...తెలుగునేల తియ్యదనాల స్రవంతి
జాలువారాలి నిరంతరం...తరలిరావాలి తరం తరం 
తరం తరం... నిరంతరం....నిరంతరం ..తరంతరం.  
సత్యసాయి విస్సా ఫౌండేషన్.

సంక్రాంతి కోసం దాదాపు ఒక నెల రోజులనుండి సందడి మొదలవుతుంది..ఆవుపేడతో ఇలా భోగి పిడకలు తయారు చేస్తారు. మా చిన్నారి మహాలక్ష్మి తన మిత్రబృందముతో ఆ తయారీలో నిమగ్నమై వుంది.  



పిల్లలందరూ "ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ, పండుగెందుకొచ్చింది పప్పులు(పిండివంటలు) తినడాని కొచ్చింది" అంటూ పాడుకుంటూ
భోగిమంటకు అవసరమైన సామాగ్రిని ప్రతి ఇంటింటికి వెళ్లి సేకరిస్తారు.  

ఆడపిల్లలు ముగ్గులు వెయ్యడానికి అనువుగా మొగపిల్లలు ఇంటి ఆవరణని శుభ్రం చేసి సిద్ధం చేస్తున్నారు. 


చిన్నారుల చేతుల్లో రంగవల్లికలు గా రూపుదిద్దుకోనున్నరంగులు...
నేలతల్లి కి రంగవల్లికలల్లుతున్న చిన్నారులు. 






భోగి మంటలకు సర్వం సిద్ధం!  





స్నానానికి నీళ్ళు కాస్తూ...కుంకుడు కాయలు కొడుతూ, అభ్యంగన స్నానం లో చిన్నారులు  





భోగి దండలు భోగి మంటల్లో వెయ్యటం. 






 గొబ్బెమ్మలతో ముద్దుగుమ్మల ఆట పాట


సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు. పురస్కారాలు 





No comments:

Post a Comment

Total Pageviews