Thursday, January 7, 2016

“సామాజిక స్పృహ” ……..అబ్బో ఇదేదో చాలా పెద్ద పదం అనుకుంటున్నారా? ఇదేదో చాలా పెద్ద బాధ్యత అనుకుంటున్నారా? నన్ను నమ్మండి….ఇది చాలా చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే,
1. మన చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయ్యకుండా, మునిసిపాలిటి వాళ్ళు ఏర్పాటు చేసిన garbage bin లో వెయ్యటం.
2. ఏ picnic కో, బీచ్ కో, పార్క్ కో, సినిమా కో వెళ్లినప్పుడు, మనం తిన్న popcorn పొట్లము, chocolate wrapper, juice packet, chips packet ఏదైనా కానీ ఎక్కడ తిన్నామో అక్కడే పడేయ్యకుండా, కాస్త ఒళ్ళు వంచి, చుట్టూ చూసి, డస్ట్ బిన్ ఎక్కడ పెట్టారో కాస్త వెతుక్కుని, అందులో పడేయ్యటం.
3. రోజూ చదివేసిన న్యూస్ పేపర్ గార్బేజ్ లో పడేయ్యకుండా, recycle bin లో వెయ్యటం.
4. పాడైపోయిన electronic పరికరాలు పడేయ్యకుండా, కంపెనీ వాడికే తిరిగి ఇవ్వటం. ఈ మద్య ఇలాంటి సౌకర్యం ఒకటి వచ్చింది కదా.
5. కొత్త electronic పరికరాలు మార్కెట్‌లోకీ వచ్చి రాగానే, వేలం వెర్రిగా వెళ్లిపోయి, బోల్డన్ని డబ్బులు తగలేసి కొనేసి, మన దగ్గర అప్పటికే ఉన్న వస్తువుని మూల పడేసి, కొత్తగా కొన్నదాన్ని నలుగురికీ చూపించడం కోసం వాడటం మొదలు పెట్టడం కాకుండా, కాస్త ఆలోచించి ఈ కొత్త ఫీచర్ మనకు అవసరమా అనేది బేరీజు వేసుకుని కొనుక్కోవటం. మనం మొబైల్ కొన్నప్పుడు సవాలక్ష ఫీచర్స్ చూస్తాం. కానీ వాడుకలో వచ్చేటప్పటికి ఎన్ని వాడతాం చెప్పండి?
6. నా కరెంట్, నా వాటర్ నా ఇష్టం, బిల్లు కట్టేది నేనే కదా అంటూ అవసరం ఉన్నా లేకున్నా పొద్దస్తమాను ఏసీ వేసి ఉంచటం, నిలక్ష్యంగా నీరు వృధా చెయ్యటం. ఇది national waste. చాలా మంది “మాకు చలికాలంలో కూడా ఏసీ లేకుండా నిద్ర పట్టదండీ” అంటూ గొప్పలు పోతారు. అంత show business అవసరమా అండీ?
7. నడిచి వెళ్లే దూరానికి కారులో కాకుండా నడిచి వెళ్ళటం.
8. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం.
9. ఇతరత్ర దేశాల్లో ఉండే వాళ్ళు, hyderabad airport నుంచి బయటకు రాగానే, నేను భారతీయుడిని, ఇది నా దేశం, ఇక నా ఇష్టం అనుకుంటూ, చేతిలో ఉన్న బోర్డింగ్ పాస్ లు అక్కడే చింపి పడేయ్యటం కాకుండా, మనం ఏ దేశం నుంచి వచ్చామో, అక్కడ ఏ రూల్స్ ఐతే పాటిస్తున్నామో, ఆ rules మన దేశంలో కూడ పాటించడటం.మన దేశం లో కూడా ఉన్నాయండీ అవే rules and regulations. కాకపోతే మనం ఎవ్వరమూ పాటించము. అదీ ఎందుకంటే మన భారతీయులు ఉధార స్వభావులు కద. వేరే దేశాల్లో ఉమ్మితే, తుమ్మితే వేసే fines, మన వాళ్ళు మనకు వెయ్యరు. వేసినా మనం కట్టము..అదే వేరే సంగతనుకోండీ.
10. అన్నింటికన్నా అతి ముఖ్యమైన బాధ్యత, మన పిల్లల్ని మంచి పౌరులుగా పెంచడం. చిన్నప్పటి నుంచే సామాజిక బాధ్యతలు అర్థమయ్యేటట్టు నేర్పించటం.
మనలో అందరూ నాయకులు కాలేరు. సంఘ సేవకులు అసలే కాలేరు. కానీ మన పరిధిలో మనం చెయ్యగలిగిన పనులు, మనం బాధ్యతగా చెయ్యగలిగితే అంతే చాలు. మరొకరు పడేసిన చెత్తని మనం శుభ్ర పరచము, మన చెత్తని మరొకరి చేత శుభ్ర పరచకుండా ఉంటే చాలు. అంతేనండి సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అంటే. Isn’t very simple? మీరు నాతో ఏకీభవిస్తారా?

No comments:

Post a Comment

Total Pageviews