విశ్వవ్యాప్త బంధు మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు .......
ముందుగా మంగళ వాద్యములతో ప్రారంభిద్దాం!! ఈ లింక్ క్లిక్ చెయ్యండి!
https://www.youtube.com/watch?v=UEweAta6gAM&index=3&list=RD58jfLwIFLMU
భోగి అంటే భోజనం
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం
భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం.
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉన్నది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.
భోగి పండుగ: బలి చక్రవర్తి
అసురేశ్వరుడైన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపిన పర్వదినమే భోగిపండుగ. భోగిమంటలు మానవునిలోని, కల్మషాలను పటాపంచలు చేస్తాయని, సంకటాలు దగ్ధం అవుతాయని చెప్తారు. బలి చక్రవర్తి వామనుడు మూడు అడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. ఆ మూడు అడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను; జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలను; సత్వ, రజ, తమో గుణములను, ఈషణత్రయాన్ని హరింపజేసుకున్నాడు. వామనుని పాదస్పర్శతో బలిచక్రవర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకొని జ్ఞాన వెలుగును దర్శించి ఉత్తరాయణమంతా స్వర్గ ద్వారములు, వైకుంఠ ద్వారములు తెరచి ఉండేటట్లుగా, ఆ సమయంలో మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించేటట్లుగా శ్రీమన్నారాయణుని నుండి మానవాళి కోసం వరం అడిగి, పొందాడు. మనస్సులో మాధవుణ్ణి మనసారా నింపుకుని మానవసేవలో మాధవ సేవా పుణ్యాన్ని పొందమని చెప్తుంది
భోగి మంటలు
భోగి సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ ఇది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరవాత, దాని మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేస్తారు. ఈ రోజున మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలి కాచుకుంటూ పరమానందం చెందుతారు.
సూర్యారాధన సంరంభం
ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి.
రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం.
(" భోగి " ప్రత్యేకత ... శ్రీ గౌతమి గారి సౌజన్యంతో )
No comments:
Post a Comment