Sunday, August 2, 2015

స్వర్గీయ అబ్దుల్ కలాం గారికి నివాళితో; అబ్దుల్ కలాం గారి గురించి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి అనుభవాలు జ్ఞాపకాలు.2

ఆంధ్రమహిళా సభ విద్యాసంస్థలన్నిటి తరఫునా అబ్దుల్ కలాం కి నివాళి ఘటిస్తున్నామనీ, అందులో నన్ను కూడా వచ్చి పాలు పంచుకొమ్మనీ ప్రొఫెసర్ లక్ష్మిగారు ఆహ్వానించడం నాకెంతో సంతోషమనిపించింది.
ఇప్పుడు ఆంధ్రమహిళా విద్యాసంస్థలకు ప్రెసిడెంట్ గా ఉన్న లక్ష్మిగారు దుర్గాబాయి దేశ్ ముఖ్ తీర్చిదిద్దిన ఒక ఆదర్శ విద్యార్థి, ఒక ఆదర్శ ఉపాధ్యాయిని, ఒక ఆదర్శ విద్యావేత్త.
ఆంధ్ర మహిళా సభ ప్రాథమిక విద్యావనరుల కేంద్రం తరఫున ఆమె అదిలాబాదులోనూ, నల్లమల అడవుల్లోనూ గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల సంసిద్ధతా కార్యక్రమం అమలు చేసినప్పుడు వారితో కలిసే పని చేసే అవకాశం లభించింది. ఇరవై ఏళ్ళకు పైగా కొనసాగుతున్న విలువైన స్నేహం మాది.
ఆమె ఏం చేసినా విశిష్టంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. నిన్న పొద్దున్న ఆంధ్ర మహిళా సభ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారి సమావేశమందిరంలో జరిగిన నివాళి కూడా అట్లానే నడిచింది. సంస్ఠ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉన్న సుమారు ఇరవై పై చిలుకు యూనిట్లకు చెందిన విద్యార్థినులు, వారి ఉపాధాయులు వచ్చి ఒక్కొక్కరే కలాం ని స్మరించుకున్నారు. కలాం రచనలనుంచీ, బోధనలనుంచీ ఏరి కూర్చిన వాక్యాలతో పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వారితో పాటు కలాంతో కలిసి పనిచేసిన కొందరు శాస్త్రవేత్తలు కూడా తమ విలువైన అనుభవాలు పంచుకోవడం మరొక విశేషం.
ఈ సందర్భంగా కలాం రచన The Family and the Nation కు నేను చేసిన అనువాదాన్ని లక్ష్మిగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకం 'ఉత్త్తమ కుటుంబం, ఉదాత్త దేశం ' వారం రోజులకిందటే పబ్లిషర్ నాకు పంపించాడు. ఆ పుస్తకమట్లా పిల్లల మధ్య, ఒక విద్యాసంస్థలో, ఒక విద్యావేత్త చేతుల మీదుగా కలాం ని స్మరిస్తూ ఆవిష్కరణ కావడం నాకెంతో సంతోషమనిపించింది.
'ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం ' డా. కలాం, ఆచార్య మహాప్రజ్ఞ అనే జైన సాధువుతో కలిసి రాసిన పుస్తకం. ఆచార్య మహాప్రజ్ఞ 95 సంవత్సరాల జైన ముని. శ్వేతాంబర జైనంలో తేరాపంథ్ శాఖకి పదవ ఆచార్యులు. సైన్సునీ, ఆధ్యాత్మికతనీ సమన్వయం చేస్తున్న వ్యక్తిగా, ఆధునిక వివేకానందుడిగా పిలవబడుతున్న అహింసా మూర్తి. దేశమంతటా సుమారు లక్ష కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి పదివేలగ్రామాల్ని స్వయంగా సందర్శించి తన సందేశాన్ని వినిపించిన మహనీయుడు.
తామిద్దరు కలిసి రాసిన ఈ పుస్తకానికి అంకురార్పణ ఎట్లా జరిగిందో 'ఒక పుస్తకం పుట్టింది ' అనే తన తొలిమాటలో కలాం ఇట్లా చెప్పుకొచ్చారు:
'ఆచార్య మహాప్రజ్ఞ జ్ఞానానికి మంచినీటి ఊట. తనను కలుసుకున్న ప్రతి ఒక్కరినీ పరిశుద్ధపరిచే స్వచ్ఛ జలం ఆయన. అక్టోబరు 1999 లో నేనాయన్ను మొదటిసారి కలుసుకున్నాను. మెహ్రౌలీలోని ఆధ్యాత్మసాధనకేంద్రంలో మేం కలుసుకున్నాం. అప్పటికి అర్థరాత్రి కావొస్తున్నది. దేశం కోసం,దేశప్రజల సంక్షేమం కోసం ఆయన తన మహనీయ జైన సాధువులతో కలిసి మూడు సార్లు ప్రార్థించారు. ప్రార్థనలు పూర్తయ్యాక నా వైపు తిరిగి ఆయన నాతో అన్న మాటలు: కలాం, మీరూ, మీ బృందం చేసిన కృషికి భగవంతుడి ఆశీర్వాదాలు లభించాయి. కానీ భగవంతుడు మీతో మరింత బృహత్కార్యం చేయించాలనుకుంటున్నాడు. అందుకనే మనమిప్పుడు ఇక్కడ కలుసుకున్నాం. మన దేశం ఇప్పుడొక అణ్వాయుధ శక్తిగా మారిందని నాకు తెలుసు. కాని మీరూ మీ బృందం చేపట్టవలసిన కర్తవ్యం మీరింతదాకా చేసిన పనికన్నా మరింత పెద్దది. ఆ మాటకొస్తే అసలింతదాకా ఏ మానవుడూ చేయనంత పెద్దపని. అణ్వాయుధాలు ప్రపంచమంతటా వందలాదిగా వేలాదిగా పెరిగిపోతున్నాయి. ఈ అణ్వాయుధాలు నిరర్ధకమయ్యేవిధంగా అప్రధానమయ్యే విధంగా, రాజకీయంగా నిష్ప్రయోజకమయ్యే విధంగా చూసే ఒక శాంతిమయ వ్యవస్థను మీరు, మీరు మాత్రమే, రూపొందించాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నేనిట్లా ఆదేశిస్తున్నప్పుడు నా ఆధ్యాత్మిక శక్తినంతటినీ నా చేతుల్లోకి రీసుకుని మరీ నేను ఆదేశిస్తున్నాను...'
'..నేను ఆచార్య మహాప్రజ్ఞను 2005 ఆగస్టు 2 వ తేదీన మరొకసారి కలిసాను. అప్పుడాయనకు జాతీయమతసామరస్య పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. వేదిక మీద మేం పక్కపక్కన కూచున్నాం. అప్పుడు ఆచార్యులు నాతో ఇలా అన్నారు: 'కలాం, మన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావలసిన సమయం ఆసన్నమైంది. కుటుంబాన్నీ, దేశాన్నీ వికసింపచేయడం ద్వారా శాంతిమయ, సంతోషభరిత, సౌభాగ్యవంత సమాజాన్ని మనం అభివృద్ధిపరచాలి. ఈ ఉద్దేశ్యాల్ని వెల్లడిస్తూ మనమొక పుస్తకం రాయాలి.'
ఆ ఆదేశఫలితంగా రూపుదిద్దుకున్న పుస్తకం అది.
అవివాహితులూ, ప్రాపంచికార్థంలో తమకంటూ ఎటువంటి సొంతకుటుంబాల్లేని ఆ ఇద్దరు సాధువులూ పుస్తకం ముగిస్తూ రాసిన మాటలిట్లా ఉన్నాయి:
'..ఒక ఉదాత్తదేశం, ఒక ఉదాత్తజాతి ఎట్లా రూపొందగలవనే ప్రశ్నని మేం పదే పదే తరచి తరచి చూశాం. చివరికి మేం చేరుకున్న నిర్ణయమేమిటంటే ఉదాత్తదేశ బీజాలు కుటుంబంలోనే ఉన్నాయని, చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగి పెద్దవాడైన వ్యక్తి మాత్రమే జాతి పట్ల తన బాధ్యత గుర్తుపట్టగలుగుతాడు. అతడు మాత్రమే 'నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా నెగ్గుకురావాలి ' అనే సూత్రాన్ని అనుసరించగలుగుతాడు...'
'..చక్కటి కుటుంబాన్ని రూపొందిస్తే అది తిరిగి ఒక ఉదాత్త జాతినీ,ఒక ఉదాత్త దేశాన్నీ ఎట్లా సుసాధ్యం చేయగలదోనన్న ఆసక్తితోనూ, శ్రద్ధతోనూ ఈ పుస్తకాన్ని మీరంతా చదువుతారని మేమాశిస్తున్నాం '

No comments:

Post a Comment

Total Pageviews