Wednesday, August 19, 2015

ముర్తీభవిత ఆనంద చరితం!



మాస్టర్ సి. వి. వి. నమస్కారం
ప్రజ్ఞాప్రభాకరము
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
( మన దేశంలోని మాస్టర్ సి.వి.వి. సత్యయోగ సాధకులకు ప్రజ్ఞాప్రభాకరము నిత్య పారాయణగ్రంథముగా ఉన్నది. అయితే, ఈతరం యువకులైన యోగ సాధకులు కొందరు సప్రయోజనంగా వాడిన ఈగ్రంథం లోని సరళగ్రాంథికాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నా రన్న కారణంగా, మనసు ఒప్పుకున్నా- వారి కొఱకే, వారి కోరిక మేరకే - దీనిని మరింత సరళతరం చేసి అందించే యత్నం చేస్తున్నాము. ఇది అందరికీ రుచిస్తుం దనీ భావిస్తున్నాము. ఎక్కడైనా, ఎవరికైనా, ఇందులో శైలీభేదం ఎబ్బెట్టుగా గోచరిస్తే క్షంతవ్యులము – వేటూరి ఆనందమూర్తి ).
-1-
ఉపక్రమం
సి.వి.వి. నమస్కారం
శ్రీనిరంతరానంద నిశ్శ్రేయసార్థ
సాధకము సర్వకిల్బిష బాధకము, స
మగ్రవిజ్ఞానదము మహా మహిమ ఘనము
శరణ మగు మాకు సద్గురుచరణయుగము.
( ఎప్పటికీ తరగని మంగళకరమైన ఆనందమయమైన ముక్త లోకాన్ని సా ధించిపెట్టేదీ, అన్ని దుర్వ్యాధుల్నీహరించేదీ, అంతులేనివిజ్ఞానాన్ని అనుగ్రహించేదీ, గొప్ప మహిమతోకూడుకొన్న పూర్ణత్వాన్నికలిగినదీ అయినటువంటి సద్గురువుయొక్క పాదద్వయాన్నిశరణు వేడి ఆశ్రయిస్తున్నాను.)
సత్యస్వరూపమూ, జ్ఞానమయమూ, ఆనందపూర్ణమూ అయిన పరతత్త్వం అందుకు వ్యతిరిక్తమైనచిత్త వృత్తితో, అవివేక జీర్ణారణ్యంలో చిక్కుపడి, చీకాకు పడుతున్న అనద(=అన్యథా శరణం నాస్తి అనుకొన్న అనాథ)ను నన్ను దారికి తెచ్చి కాపాడిన విధానాన్ని మిత్ర సంఘం ముందు నివేదించుకోవడమే ఈ గ్రంథరచనాపరమార్థం . ఇందులో నాకు పురుషోత్తముడైన గంధిమహాత్ముని ఆత్మకథారచనా విధానం దారిచూపే వెలుగు దివిటీవంటిది. గులాబీమొగ్గ రూపుదిద్దుకొనే దశలో దాన్ని ఆవరించి ఉన్న కఱకునూగు తొడిమే ముందు కనపడ్డట్లు, ప్రారంభంలో మీకు ఈ ప్రభాకరునిపేరే మొదట గోచరించినా అందులోదాగిఉన్న ఆ దివ్య తత్త్వపు పువ్వు వికసించి సువాసననూ, సౌకుమార్యాన్నీ, వింతరంగుల సోయగాన్నీవిరజిమ్మే సమయానికి ఆ పువ్వుని మునివేళ్ళతో పట్టుకొనిచూపించే తొడిమనుగానే నేను అడుగున పడి ఉంటాను. అప్పుడది ప్రజ్ఞాచరిత్రమే అవుతుంది కానీ, ప్రభాకర చరిత్రము కాదు. ఒక విధంగా అది ఈ ప్రభాకరచరిత్రమే అయినా ఆ ప్రభాకరుడు తొల్లింటి నేను కాక వేరొకడే !
‘పరుషము నిష్ప్రయోజన మబద్ధ మనార్యము చేర రాదు నా
విరచనలందు, డెందము పవిత్రముగా విలసిల్లి సత్యసుం
దరము పరార్థయుక్త మగు తత్త్వమునే వెలయింపగా వలెన్
గురుచరణారవిందములకున్ బ్రణమిల్లెద నట్టి నేర్మికై.
(పరుషమో, ప్రయోజనం లేనిదో, అబద్ధమో , సభ్య వ్యవహారానికి దూరమైనదో ఏదీ నా విశిష్ట రచనల్లో చోటు చేసుకోకూదదు. మనస్సు పవిత్రం గా ఉండి, ఎల్లప్పుడూ సత్యమూ, సుందరమూ, ఇతరులకు సదా మేలు చేకూర్చేదీ అయిన తత్త్వాన్ని ఆవిష్కరించే నేర్పుకలదిగా ఉండేట్లు అనుగ్రహించు మని సద్గురుచరణ కమలాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను).
(సశేషం )
2
జననాదికo 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ ఆత్మకథలో ఇలా వ్రాశారు. 
“సర్వజిత్తునామ సంవత్సరం మాఘ బహుళ ఏకాదశీ మంగళవారంనాడు ఉదయాది19 గడియలకు జ్యేష్ఠానక్షత్రం నాలుగో పాదంలో జన్మించాను. నా జాతకచక్రం జన్మకాలఘటికావివేచనతో నా బాల్యంలో మా నాన్నగారు వ్రాసింది కలదుగానీ – నేను దానినంతా ఇక్కడ ఉదాహరించాలనుకోవడంలేదు. జోస్యులకు దాన్ని పరిశీలించే అలజడి వద్దని నా కోరిక.
మా వూరు పూర్వం వేదశాస్త్రాదివిద్యావిదులైన విప్రులతో అన్ని వర్ణాలవారితో విలసిల్లింది. నా పసితనం నాటికికూడా వేద శ్రౌత సాహిత్య విశారదులు అనేకులు మా గ్రామంలో వుండేవారు. శ్రీవత్సగోత్రులైన వెలనాటి వైదిక బ్రాహ్మణవంశం మాది. శేషమ్మ మా అమ్మగారి పేరు. సుందరశాస్త్రి మా నాన్నగారి పేరు. ఆ పుణ్యదంపతులకు నలుగురు కొడుకులు, నలువురు కూతుళ్ళు. నేటికీ (1950) సోదరులు నల్గురమూ సుఖంగా వున్నాం. నాకు ఒక అక్కగారూ, ఒక అన్నగారూ. తక్కినవారు నా తర్వాత పుట్టినవారే. మా అమ్మ పరమసాధ్వి.
మా నాన్నగారు కొంతకొంతగా స్మార్త జ్యౌతిష శిల్ప సంస్కృత సాహిత్యాలు నేర్చినవారు. తెలుగులో మంచి సాహిత్యమూ కొంచెం కవితా పరిజ్ఞానమూ కలిగినవారు. వైద్యవిద్యావిశారదులు. పారంపర్యంగా పౌరోహిత్యమే జీవిక అయినా మా నాన్నగారు ప్రధానజీవిక వైద్యంగా వర్ధిల్లారు. మా తల్లిదండ్రులు పరస్పరం ప్రేమమయులు. వివాహం అయిన తర్వాత వారెన్నడూ భిన్నస్థలాల్లో ఎక్కువనాళ్ళు వసించి యెరుగరట!
దంపతులుగనుక ఎల్లప్పుడూ గాఢమైన అనురాగం కలవారుగా ఉంటే, సత్సంకల్పాలు గలవారైతే, రస భావానంద మయులై ఉంటే వారి సంతానం కూడా చిరంజీవిత్వాది సద్గుణాలతో గణన కెక్కి వాసిగాంచగల దని ఇటీవలి నా గట్టి యెఱుక.
మా తల్లిదండ్రుల ప్రగాఢానురాగం వారి సంతానమైన మాకు ఇంతదాకా క్షేమారోగ్యాదికాన్ని ప్రసాదించిందని నా విశ్వాసం. మా తండ్రిగారు ఎనభైమూడేళ్ళు నిరామయ దీర్ఘ జీవితాన్ని గడిపారు. వారి తండ్రిగారుకూడా ఎనభైమూడేళ్ళు జీవించారు. మా తాతగారు అవసానకాలంలో కుమారుని పిలిచి “నాయనా! నువ్వూ నా వలెనే ఎనభైమూడేళ్ళు జీవించగల“ వని దీవించారట! చాలాసార్లు మా నాన్నగారు ఈ ఆశీర్వాదాన్నిగురించి చెప్పుకొంటూ వుండేవారు. వారి ఆశీర్వాదం మా తండ్రిగారియెడ ఫలించింది. మా తల్లిదండ్రులు సంపన్నులు కారుగానీ సంపన్నులకంటే సుఖంగా జీవిక గడిపినవారు. పుత్రపౌత్రాదులతో మావూళ్ళో మాయిల్లు దోసతోటలా వుండేది. మా యింట్లో మా నాన్నగారు నూరింటిదాకా పుట్టినరోజుపండుగల్ని వారి కాలంలో జరిపినట్టు లెక్కించి చెబుతూ వుండేవారు.”  
 (సశేషం)


3
చిన్ననాటి జ్ఞాపకాలు
ఒకనాడు నేను తోటి పిల్లలతో గోచీకూడా లేకుండా వీధిలోచింపిరికాగితా లేరి ఏదో పిచ్చిచదువు చదువుతూ ఉండగా నన్నుచూసి పుణ్యమూర్తి కొట్టరువు సుందరరామయ్య పంతులుగారు – మా ఊళ్ళో అప్పటికి యేభైయేఏళ్ళమునుపే బడిపంతులుగా స్థిరపడి పిల్లలందరికీ ప్రాథమికవిద్య నేర్పుతుండిన సచ్చ్రరిత్రులు వారు –నన్ను చెయ్యిపట్టుకొని ఇంటికి తీసుకొచ్చి, మా అమ్మగారి నడిగి ఒక గోచీగుడ్డను నా మొలతాడుకి తగిలించి, బడికి తీసుకెళ్ళి , రెండుమూడు రోజుల్లోనే నాకు అక్షర జ్ఞానం కలిగించారు. ఆ తరువాత మా తండ్రిగారు నాకు వారిచేతనే అక్షరాభ్యాసం జరిపించారు. నన్ను నేనుగా గుర్తించడానికి అదే నా మొదటి గుర్తు.
బళ్ళో ఏదో చదువు సాగింది. అన్నింటా నేనే మొనగాడను. లెక్కలు మాత్రం గుండు సున్నా! తెలు గంటేనో వెర్రితీపు! బడిలో ఉపాధ్యాయులు నాచేత తెలుగుపద్యాలు చదివించుకొని సంతోషిస్తూ ఉండేవారు. కానీ పద్యాలను రాగయుక్తంగా చదవడ మన్నది అప్పటీకీ ఇప్పటికీ నాకు కొఱుకుడు పడని మెఱికబియ్యమే ! సంగీతం తో కాకపోయినా సందర్భ శుద్ధితో అలా నేను చాలా పద్యాలు చదవగల్గడం ఉపాధ్యాయు లందరికీ ముచ్చట కలిగించేది. మా చుట్టుపట్ల గ్రామా లన్నింటికంటే మా ఊళ్లోనే, మా ఇంట్లోనే సంస్కృత ఆంధ్ర నిఘంటువులు, ధర్మశాస్త్రం మొదలైన గ్రంథాలెన్నన్నో ఉండేవి. ఆ గ్రంథాలకోసం మాయింటికి చాలా మంది వస్తూ ఉండేవారు. నేనూ అర్థమైనంతవరకూ మాయింట్లో ఉన్నపుస్తకాలన్నింటినీ ఒక్కటీ వదిలిపెట్టకుండా చదువుతూ ఉండేవాణ్ణి. మా నాన్నగారు తెలుగుమఱుగులు కొన్నితెలియ చెబుతూ ఉండేవారు. ఈ ముచ్చటల్లోపడి నేను ఇంగ్లీషు చదువు నిరాకరించాను. తెలుగూ సంస్కృతం ఐతే ఉన్నఉళ్ళోనే ఉండి ఏకొన్నిగంటలో చదివితే సరిపోతుంది. అదే ఇంగ్లీషు చదువుకైతే అమ్మానాన్ననూ ఇంటిభోజనాన్నీ విడిచి పెద్ద ఊరు బందరు వెళ్ళవలసివస్తుంది. పైగా ఉదయం పదకొండుగంటలనుంచీ సాయంత్రం ఐదు గంటలదాకా చదువుకోవాలి! ఊళ్ళో స్నేహితుల నందరినీ వదిలి ఒక్కడినే వెళ్ళవలసి వస్తుంది. ఈ భావాలు నా కప్పుడు బాధాకరాలుగా తోచినవి. బలవంతపెట్టి నన్నుమాఅమ్మా నాన్నలుకూడా పంపలేదు. పుత్ర వాత్సల్యం, పరాయి చోట తగిన సుఖభోజన వసతి కల్పించే ధనసంపత్తి లేకపోవడమే అందుకు కారణాలు.
స్వగ్రామం లోనే బ్రహ్మణ్యు లైన మద్దూరి రామావధానులుగారి దగ్గర సంస్కృతమూ, ఇంట్లో తెలుగూ చదువుకునే వాణ్ణి. పుణ్యమూర్తులూ, ప్రాత:స్మరణీయులూ మద్దూరి రామావధానులు గారూ మా నాన్నగారూ ఇద్దరూ చిన్ననాటినుండీ స్నేహితులు. ఒకే ఈడువారు కూడాను. పొద్దున్నే బ్రాహ్మ ముహూర్తాన నిద్రలేచి, వేళ ప్రకారం సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలైన వైదికకర్మలు ముగించుకుని, ఓ గంటసేపు ఉంఛవృత్తి smile emoticon ఆపూటకుసరిపోయె అహారసంభారాన్నిసంపాదించుకొనే పని) జరిపి, తొమ్మిది గంటలలోపే ఇల్లు చేరుకుని మధ్యాహ్నపూజముగించి, పది అవుతుండగా హాయిగా భోజనం చేసి –కాస్సేపు విశ్రాంతి తీసుకుని, విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆయన కాలక్షేపం చెస్తూ ఉందేవారు. పది గంటల కల్లా భోజనం చెయ్యకపోతే ఆయనకు ఒంటికణత నెప్పి వచ్చేసేది. వారి శరీర స్థితి అంత సుకుమార మైనది. అప్పట్లో మా ఊళ్ళో వాళ్ళు వారిని గురించీ, మా నాన్నగారిని గురించీ ఇలా అనుకునే వారు - రామావధానులుగారికి ఒంట్లో బాగులేకపోతే ఊరివారి కందరికీ ఒంట్లొ బాగో లేనట్లే ; మరి, సుందరశాస్త్రిగారింట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే చాలు ఉళ్ళో అందరికీ అనారోగ్యం వచ్చిపడినట్లే – అన్నంతగా తమ అనారోగ్యం గురించో , తమ కుటుంబం వారి అనారోగ్యం గురించో చీకాకు పడే0తగా వారు ఇతరుల అనారోగ్యాలపట్ల చీకాకు పడేవారు కారన్నదే ఆభావన కర్థం .
మా యింటి దగ్గరే ఉన్నసాలె వీథిలోని సాలెవారు తమ గురువైన భావనఋషికి ఉత్సవం జరుపుకుంటున్నారు. నా వయస్సు అప్పటికి ఏ యెనిమిదో తొమ్మిదో ఉండవచ్చు. సాయంసంజవేళ 7,8 గంట లప్పుడు అన్నంతినేసి అక్కడ జరుగుతున్న ఉత్సవాన్నిచూడడాని కని వె ళ్లాను. కాస్సేపటికల్లా, అక్కడే ఒళ్ళు తెలియకుండా కింద పడిపోయాను. ఎదో అయి పోతో0ది నాకు అనేలోగానే పక్కనున్నవాళ్ళు గుర్తించి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు కాబూలును! ఎంతసే పయిందో! మా నాన్నగారు దగ్గర కూచుని శివకవచం పారాయణ చేస్తూఉండగా క్రమంగా మెలకువ వచ్చింది నాకు. ఇంకేబాధా గోచరించ లేదు. అంతే ! అటు తరువాత నేను సాధారణంగా ఏ జాతరలకూ, దేవోత్సవాలకూ వెళ్ళటానికి ఉత్సాహపడకపోవడమే జరుగుతూవచ్చింది. ఆ సందర్భంలో అలా ఒళ్ళు తెలియక పడిపోవడం ఎందుకు జరిగిందో అప్పుడు ఎవరికీ అంతు చిక్కలేదు. కొన్నేళ్ళ తరువాత అది నాకే తెలియ వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. (సశేషం)

No comments:

Post a Comment

Total Pageviews