Friday, August 14, 2015

1)వానా వానా వల్లప్పా.......-Annu 2).మరపురాని.. నా నేస్తాల జ్ఞాపకాలు..


.వానా వానా వల్లప్పా.......

కొబ్బరాకుల కొసల నుండి నిదానించి జారుతోంది స్వర్గలోకపు తాయిలాలు చినుకుల పొట్లాలలో నింపి తెచ్చిన వెండివాన..తలారా స్నానం చాన్నాళ్ళ తర్వాత చేస్తున్న పచ్చదనం పులకరిస్తోన్న చప్పుడు హాయిగా చుట్టూతా అలుముకొని.. యెంత బావుంది?"వానా వానా వల్లప్ప'లు మాని' రెయిన్ రెయిన్ గో అవే.." అంటూ లంకించుకుంటే ..పాపం అది మాత్రంయేంచేస్తుందిచెప్పండి?..
యెవరున్నారని యెదురుచూపులు దారంతా పరుస్తూ..?..వీధంతా ఒకటే అల్లరితో సందడి చేసే పిల్లగ్యాంగులు, ఐ ప్యాడ్లలో ముఖం దూర్చాక, వాన చేసే సందడి కనీసం కిటికీల్లోంచి సైతం చూడని సీరియళ్ళ కాలంలో రియల్ లైఫ్ బిజీ కాంక్రీటు జంగిళ్ళలో బందీగా మిగిలిన వింతవైనంలో,యే ముఖంపెట్టుకొస్తుంది?యెంతవరకని పెద్ద మనసు చేసుకుంటుంది?

వసారాలో కూర్చుని, అమ్మమ్మో నాయినమ్మో కబుర్లు చెప్తూ ఉంటే, తన వొడిలో చోటు కోసం కొట్టుకుంటూ, తోసుకుంటూ యే బెల్లం ముక్కో అమ్మ చేసిన పకోడీనో చక్కగా కొరుకుతూ.. ఆ పక్కగా కట్టేసిన ఆవులు.. సగం తడుస్తూ నెమరేత సాగిస్తుంటే ఆ పచ్చగడ్డి పచ్చి వాసన...చినుకులు మొదలైన వెంటే తరుముకొచ్చే కమ్మని మట్టివాసన..వెచ్చగా ఒదిగిపోనిచ్చిన.. అమ్మమ్మ వొడివెచ్చదనపు వాసన...యేమి ఆ ఐశ్వర్యం?..పాపం..! ప్రపంచీకరణ తెచ్చిన ఆధునీకరణవేలంవెర్రిలో కొట్టుకుపోతూ.. కనిపించని పేదరికంలో మగ్గుతున్న ఈ నాటిచిన్నారులకు ఈ మధురానుభూతుల విలువతెలిసే వీలేదీ..?ఇంతకన్నా పేదరికం వేరేముందీ ఈ తరం బాల్యానికి?

కాస్త వానకే బురదైపోయి, రోడ్డతా వరదైపోయి, యెక్కడే మ్యాన్ హోల్ నోరు తెరుచుకునుందో తెలియక, లోకంలోని మిలియన్ల జనమూ రోడ్డుమీదే ఉన్నట్టు కొండచిలవలా బద్ధకంగా కదులుతున్న జనసేనల పద్మవ్యూహంలోంచి యెప్పటికి ఇల్లు చేరతామో, అలా కాస్త జల్లు కొట్టగానే ఇలా దాడి చేసేసే వైరల్ ఫీవర్లూ జలుబులూ జ్వరాలూ..యాంటీ బయాటిక్కులూ టానిక్కులూ..తలకి హెల్మెట్టూ, ఒంటికి జాకెట్టూ కాళ్ళకి బూట్లూ, యేదో యుద్ధానికెళ్ళినట్టుగా సిద్ధంగా కనబడుతున్నా..మధ్యతరగతి జీవికి ఒక్కసారి గుండెలోకితొంగిచూసుకుంటే యెన్ని గుబుళ్ళో..అన్నట్టు చంటిదానికెలా ఉందో..?.మనసు ఉసూరుమంటుంది..కారే సీలింగూ, తగ్గని నాన్న దగ్గూ, తమ్ముడి ఫీజులూ..ఇంకోఆఫీసులో భార్య ఓవర్ టైంచేసినా చాలని సంపాదనా.. దున్నపోతుమీదేమో కానీ.. గంటలకొద్దీ తనమీదేకురుస్తున్నా...అసలేమన్నా స్పృహ తెలిస్తేగా..యెన్నెన్ని అలోచనలో..ఇరుకిరుకు ఇళ్ళూ, అనవసర బేషజాలూ, యెవర్నో మెప్పించటానికి అప్పులూ, యెవరికో చూపించటానికి ఫ్లాట్లూ, కార్లూ, వీకెండ్ పార్టీలూ, ఇంకెవరినో తృప్తి పరచడానికి..మేకప్పులూ..నెలాఖరుకి మాత్రం పొట్టతిప్పల తప్పని అగచాట్లు..నగరజీవి వానాకాలపు.. కులాసాల విలాసాలు..

"యేవిరా చిన్నా...? ఆ నిరుడనే చిన్ననాడు కురిసిన హిమసమూహాల వానలు?వానొస్తే బడిమానేసి కాగితం పడవలు చేసి బురదలో ఒట్టికాళ్ళతో తిరిగిన సరదాలు?.ఆ పడవలెంత దూరంవెళాయో చూసుకుంటూ మురిసిపోయే అందమైన అచ్చమైన, స్వచ్చమైన చిన్నతనాలు?..ఫ్రెండ్స్ ని వేపచెట్టుకిందవరకూ తీసుకెళ్ళి దబదబా చెట్టు ఊపేసి మొత్తంగా తడిపేసే సరదాలు?జుట్టుపాడౌతుందనో అమ్మతంతుందనో అస్సలు తట్టని బుజ్జి బుజ్జి బ్రతుకులు..?వాన తగ్గాక పరిగెత్తుకుంటూ వచ్చి..ఆ పిల్లకాలువల్లో యెగిరిదూకుతూ ఆడుకున్న ఆ మరలిరాని రోజులు..?
యెదిరింటి అబ్బాయినీ, పక్కింటి పరికిణీ అమ్మాయినీ కిటికీలోంచి చూస్తూ మెరిసిన ఆ కలల కళ్ళు? బైకుల్లేకపోయినా, ఝూమ్మని దూసుకుపోకపోయినా..వానలో ఓ పాటపడేసుకుంటూ మురుసుకున్న అందమైన యవ్వనాలు?..గౌను వెనక రబ్బరు చెప్పులు చిత్రించిన చిత్రాలు..వానజల్లులో నిలువెల్లా తడిసిన ముద్దబంతుల అందచందాలు, చూరు వారంటా ముణగదీసుకున్న కోడిపిల్లల తడిసిన తోకలు, చూరునీళ్ళకై అమ్మ లైనుగా పేర్చిన బిందెలూ, తపేళాలు...

వానంటే..రేపటి పచ్చని పైర్లు..కంచం నిండా పట్టెడు మెతుకులు..కళకళలాడే యెద్దుమాపురాలు..చిక్కని పాలూ వెన్నలు..సంక్రాంతి సంబరాలూ, బురదనీ మరకల్నీ ప్రేమించే మనుషులు..పులకరించేరైతన్నలు..హుషారైపోయే పొలంపనులు..మట్టిని మనిషినీ ప్రేమించడం నేర్పే వాన చినుకులు...అందుకే పాడాలి వానా వానా వల్లప్పా...బతికితే అలా బతకాలి.. స్వచ్చంగా, స్వేచ్చగా...అచ్చం..వానలా...
.-Annu.


నా స్పందన!  

ఒక్కసారిగా బాల్యంలోకి లాగేసిన మీ కవన వానజల్లుల్లో చదివిన హృదయ వనాలు తడిసి ముద్దైపోయాయి   ముద్దు ముద్దు జ్ఞాపకాల పవనాలు ఉక్కిరి బిక్కిరి చేసాయి! వానవెలిసాక ప్రకృతి కొత్తగా సంతరించుకున్న పచ్చదనం! అమ్మ అమ్మమ్మల వడి వెచ్చదనం!! మన తెలుగింటి అచ్చదనం!! అమ్మో ఇలా రాసుకుంటూ పొతే అంతేముంది!! చాలా లా  లా   లా  లా  లా  చక్కని అనుభూతిని అక్షరాల్లో సాక్షాత్కరించారు! పది కాలాలు దాచుకుని చదువుకోవాలని మా vissafoundation.blogspot.com లో దాచాను! మీ అనుమతి లేకుండా మన్నించండి! ఇంకా ఇటువంటివి రాస్తూ వుండండి!! నేటి తరానికి తరలిద్దాం!!     

మనసుపొరల్లో యేనాటికీ నిక్షిపమై..యెన్నో పాఠాలు మీ స్నేహపు గాఢతతో..అంతరాల్లేని చెలిమితో.. నేర్పి..జీవితమనే ప్రయాణంలోచెరగరాని ముద్రవేసిన నా చిన్ననాటి నేస్తాలందరికీ..ఇదే నా HAPPY FRIENDSHIP DAY..!!
స్నేహపు ఇసుకల్లో..
చిన్ననాటి చెలిమిల్లో..
యెన్నెన్ని పిచ్చుకగూళ్ళు..
అందాల మేడలు..
వాటిచుట్టూ..నగిషీల గోడలు..
మనసులో మాత్రం..
గాఢమైన..గోడలు లేని ప్రేమలు..
బేషజాలెరుగని చిట్టి చిట్టి బంధాలు..
పుల్లైసులూ.. మరమరాల ఉండలూ..
పప్పుండలూ..నువ్వు జీళ్ళూ..
బల్లిగుడ్లూ..జామపళ్ళూ
కాకెంగిళ్ళ సరదాలు..
పంచలేదన్న అలకలూ..చిరుకోపాలూ

ఉప్పులకుప్పా వయ్యారిభామా..
దొంగా పోలీస్..అమ్మానాన్నా ఆటలూ..
వీరీ వీరి గుమ్మడిపళ్ళ..ఆటల్లో
బుడత తమ్ముళ్ళే అరటిపళ్ళూ..
గుజ్జన గూళ్ళూ.
బొమ్మల పెళ్ళిళ్ళ పేరంటాలూ..
యెర్రటియెండలో గోళీకాయలూ..
వసారాల్లో ఆడిన అష్టాచెమ్మా..
చెమ్మ చెక్క చేరడేసిమొగ్గా..
యేడు పెంకులూ..
వీపు విమానం మోతలూ..
రబ్బరు బాళ్ళ..
చెక్కబ్యాట్ల క్రికెట్టు .ఆటల..
కొత్తకొత్తసరదాలూ..
డెకరేషన్ల అవసరంలేని గవర్నమెంటుస్కూళ్ళూ..
మేకప్పుల..హంగుల అలవాట్లెరగని మేష్టరుగార్లూ..
కల్లాకపటం తెలియని..
అమాయకత్వం మూర్తీభవించిన..
పిల్లల గుంపులూ..
నేల బల్లలూ..
నిర్మలత్వం అవతారమెత్తిన నవ్వులజల్లులూ..
లింగబేధాల ఊసేతెలియని ..
మానవత్వపు మంత్రాలు..
నా చిన్ననాటి స్నేహాలు..
కాలాల సమయాల దూరాలు చెరపలేని..
మరపురాని.. నా నేస్తాల జ్ఞాపకాలు..




No comments:

Post a Comment

Total Pageviews