గత ఆదివారం మావూరిలో బంధుమిత్రులతో కలసి మహాశివునికి లక్షపత్రిపూజ! ఈ ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి కి దగ్గరలోని
చందిప్ప గ్రామంలో వెయ్యేళ్ళనాటి మహా మహిమాన్విత శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర ఆలయం(మరకత సోమేశ్వరలింగ ఆలయం) లో అభిషేకం చేసుకునే భాగ్యం ఆ మహాశివ సంకల్పం...ఈ ఆలయం ప్రాచుర్యంలోనికి శ్రీ నరేష్ కుమార్ అనే ఒక మహానుభావుడు ఆయన సెల్ నం: 9440016988..ఇంకా ఆలయ వివరాలు ఆయన రూపొందించిన బ్లాగ్ ను ఈ దిగువ ఇచ్చిన బ్లాగ్ అడ్రస్ ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి! http://chandippamarakathashivalingam.blogspot.in ఆ ఆలయం వివరాలు క్లుప్తంగా...
ఈ మహాలయ ప్రాంగణం లో ఉన్న శిలా శాసనం ప్రకారం పశ్చిమ చాళుక్య వంశ రాజులలో సుప్రసిద్ద
చక్రవర్తి శ్రీ త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడు ( క్రీ.శ.1076 నుండి 1126 వరకు ) పరిపాలనను సాగించెను.
ఈ మహా రాజు తన పరిపాలనలో భాగంగా, తన అతి విశాల భూభాగా సామ్రాజ్యమందు నిత్య భూదాన వశాత్, చందిప్ప గ్రామమును వేదపారంగతులైన భూసురులకు (బ్రాహ్మణులకు) అగ్రహారంగా ప్రకటించి, ఈ గ్రామ సీమ యందు గల సమస్త భూమిని ఆ అగ్రహారమునకు, అక్కడి మహాజనులకు, పురజనులకు మరియు అక్కడ వేద విద్యనభ్యసించు, విద్యార్థుల మరియు అధ్యాపకుల భోజన వసతులకు, స్థానపతి జీతభత్యాల కొరకు మరియు అక్కడ ఒక సోమేశ్వరాలయ స్థాపనకు, ఆ దేవుని అంగరంగ భోగములకు, విశేష పూజలకు, ఆలయ నిర్వాహణ, రథోత్సవ, శివరాత్రి మొదలగు దైవ కార్యక్రములకు గాను పశ్చిమ దిశలో "హెబ్బి హొలు" అను పేరు గల పొలములో 153 ఎకరాలు నల్ల రేగడి భూమి ని, మరియు దేవుని నైవేద్యమునకు గాను "హరియ కట్టె" లో తూర్పు దిశగా 2-20 ఎకరాల నీరావరి (వరి) భూమిని మరియు, ఆ మహా దేవుని నిత్య పూజకు, పూదోటకు గాను దేవాలయ దక్షిణ దిశగా ఒక మత్తరు భూమిని, మరియు తూర్పున గల మాతంగి పొలమును దేవలాయానికి ధారదత్తము చేయడమైనది. కావున ఇట్టి దేవ మన్యాన్ని అక్కడి గ్రామ ప్రజలు, గ్రామ ప్రభువు రక్షించాలని ఆదేశం.
ఇంతే గాక దేవుని నిత్య నంద దీపమునకు ఒక నువ్వుల గానుగను మరియు మహా నైవేద్యమునకు ఉత్తర దిక్కునగల 54 ఎకరాల తాటి వనమును దైవ మాన్యముగా అర్పించడం జరిగినది.
స్వస్తి మహా సకల అధ్యయన, అధ్యాపన స్వాధ్యాయ, ధ్యాన, ధారణ, మౌన, అనుష్టాన, జప, హోమ, సమధి, శీల సంపన్నులైన బ్రహ్మనోత్తములైన స్థానాపత జ్యోతిష్కుడు _________ భట్టాచార్యుడుగా నియమించి, శ్రీమచ్ఛాలుక్య విక్రమ కాలపు (1101 A.D.) విక్రమాదిత్యుడు పట్టాభిశక్తులైన 25వ సంవత్సరం లో, విషు నామ సంవత్సరమున కార్తీక మాసము నందున శుక్ల పక్ష పంచమి తిధి బృహస్పతి వారము రోజున అనగా విక్రమ శకం 1101A.D., అక్టోబరు నెల, 23వ తేది గురు వారము నాడు సోమేశ్వర లింగ ప్రథిష్ట గావించి, జక్కణబ్బె నామ ధేయురాలైన శివ భక్త శిరోమణి ధర్మము చేయగా ఆలయ నిర్మాణమునకు మరువోజనుని పుత్రుడు తమ్మోజన సోదరుడు ఆలయ నిర్మాణమును గావించారు.
No comments:
Post a Comment