ఆవకాయ కధా కమామిషు
పచ్చటి లేత అరటి ఆకులో ఎర్రగా ఆవకాయ అన్నం కలుపుకుని అందులో కొద్దిగా గానుగ నూని రుచికి కలుపుకుని కొద్దిగా వెన్నపూస, మధ్యలో నంజుకి బాగా ముగ్గిన మామిడి పండు ముక్కలు తో...మొదటి కొత్త ఆవకాయ ముద్ద నోట్లో పెట్టుకో .....ఆగండి... ఆగండి...ఒక్కసారి మహత్తరమైన ఆ ఆవకాయ మహా ప్రస్థానాన్ని చూద్దాం!
ఆవకాయ కోసం ముందుగా మంచి పుల్లని మామిడికాయల్ని ఎంచుకోవాలి.
వాటిని నీళ్ళల్లో వేసి కడిగి తడిలేకుండా తుడవాలి.
ఈ మామిడి కాయలను ముక్కలుగా చెయ్యడానికి ప్రత్యేకమైన కత్తిపీట ఉంటుంది.అదే మరకత్తిపీట.
ముక్కలు చేసేటప్పుడు ఎంతో నేర్పుగా చెయ్యాలి లేకపోతే మామిడికాయ చితికిపోతుంది.
మామిడికాయ ముక్కలపైనున్న జీడి, పైపొరలను తీసి బట్టతో శుభ్రంగా తుడవాలి.
ఇక్కడకి ఆవకాయకి మామిడి ముక్కలు సిద్ధం అయ్యాయి.
ఆవగుండ, కారం సమపాళ్ళలో తీసుకొని వాటికంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకొని కొంచెం మెంతులు (ఇష్టానికి తగ్గట్టు ) వేసి బాగా కలపాలి.
అందులోనే కొంచెం గానుగనూనె వేసి కలిపి అందులో మనం శుభ్రం చేసి ఉంచుకున్న మామిడి ముక్కలు వేసి బాగా కలిపి ఇంకొంచెం నూనె వేసికలపాలి.
తిరిగి 3వ రోజున తిరగకలపాలి.
వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని ....వెన్నపూస, పేరిన నెయ్యి, మామిడి పండు ....ఇలా ఎవరికి ఇష్టమైన వాటిని ఆ ఎర్రటి ఆవకాయలో నంచుకొని తింటే ఎవరైనా ఆహా!!! ఏమి రుచి...అనరా ఎవరైనా మైమరచి!!!
No comments:
Post a Comment