Sunday, June 28, 2015

మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారిపై శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు

పెరిగిన ఒక మహా హిమాలయంల కాలసముద్రగర్భంలో కరిగి కలసిపోయిన వైనాన్ని చూసి మరో మహిమాలయం కన్నీరు కారుస్తున్నట్లు వుంది ఇది చదువుతుంటే...గ్లోబల్ వార్మింగి కి కాదు మంచు శిఖరాలు కరుగుతున్నది. విశ్వ వీక్షణలో అనాదిగా సాక్షీభూతంగా నిలిచి  పెరిగిపోతున్న దానవత్వం, తరిగి పోతున్న మానవత్వం చూసి చూసి హిమాలయాలు కరిగిపోతున్నాయి.       నిజానికి  కాలసముద్రగర్భంలో కరిగి కలసిపోయిన ఒక మహా నది వైనాన్ని గూర్చి ఒక మహా సాహితీ శిఖరం కన్నీరు కారుస్తున్నట్లు వుంది. ఇది చదువుతుంటే... కనీసం శతక సాహిత్యం కూడా నేర్పకుండా అమ్మభాషను బలిపెట్టి, ఆంగ్ల భాషను బ్రతుకు తెరువుకి భాషని ముడిపెట్టి, నాటి పెద్దబాల శిక్షను పక్కకు నెట్టి, కే. జీ ల నుంచి పీ.జీ ల దాకా చదువుల పేరిట ముక్కుపచ్చలారని చిన్నారుల వీపులపై నేటి బాలలకి పెద్దశిక్షలు వేస్తూ తెలుగు బిడ్డలను విదేశాల వీధుల్లో బానిసలుగా, ఆడ్డా కూలీలుగా నిలబెట్టిన మన సమకాలిక తెలుగుప్రపంచానికి ఇటువంటి చేతనా జీవుల ఉనికి ఎందుకు పడుతుంది. శ్రద్ధాంజలి కూడా ఘటించకుండా...కనీసం కన్నీరైనా కార్చకుండా దొంగనిద్ర నటిస్తోంది. అందుకే ఈ దుస్థితి వల్లే ఇటీవల కాలంలో మొన్నటికి మొన్న దాశరధి గారు, శివానంద మూర్తిగారు, నిన్న శ్రీ రామచంద్రుడు గారి వంటి ఎందఱో మహానుభావుల అంతిమ యాత్రలు మహా నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. నేటి తెలుగు బాలబాలికలకు అలనాటి సాహితీ వాసనలు వీలైనప్పుడు మనం రుచి చూపించడమే ఆ మహానుభావులకి  మనం ఇవ్వగలిగిన ఘనమైన నిజమైన నివాళి!  "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు" అన్న కవి గారి పలుకులు నిజం చేస్తూ మిగిలిన వారిని ఇప్పటికైనా గౌరవించు కోవడం మొదలుపెడదాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.   

మహామహోపాధ్యాయ పుల్ల్లెల శ్రీరామచంద్రుడుగారు నిర్యాణం చెందటం భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ పెద్దలోటు.
గ్రీకులోనో,లాటిన్లోనో లేదా కనీసం డాంటే, షేక్స్పియర్,గొథేవంటి సాహిత్యవేత్తలమీదనో కృషి చేసినపండితుడెవరైనా యూరోప్ లో ఇప్పుడు మరణించిఉంటే పత్రికలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్యవేత్తలు ప్రపంచమే కూలిపోయినంతగా శోకించిఉండేవారు. కొన్నాళ్ళ పాటు ఆయన గురించీ,ఆయన కృషిగురించీ, ఆయన మాట్లాడినవిషయాలగురించే మరింత మరింతగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కాని సమకాలిక తెలుగుప్రపంచానికి శ్రీరామచంద్రుడుగారు మాట్లాడినవిషయాలపట్ల, కృషిచేసిన రంగాల పట్ల, అందించిన కానుకలపట్ల సహజంగానే గొప్ప ఆసక్తి అంటూ ఏదీలేదుకాబట్టి ఆయన నిష్క్రమణ కూడా దాన్నెక్కువగా చలింపచేసినట్టు కనిపించదు.
కాని నా వరకూ నేను శ్రీరామచంద్రుడుగారికి ఎంతో ఋణపడిఉంటాను. సంస్కృత, ప్రాకృత వాజ్మయాలకు చెందిన అపురూపమైన సారస్వతాన్ని ఆయన తేటతెలుగులో ఎంతో శ్రద్ధతో, అవగాహనతో, అనితరసాధ్యమైన పరిశ్రమతో ఒక పరంపరగా వెలువరిస్తూ వచ్చారు. ఆయన రచనలే లేకపోయిఉంటే ప్రాచీన భారతీయ సాహిత్యంలోకి నేను ప్రవేశించి ఉండగలిగేవాణ్ణి కానని చెప్పగలను.
శ్రీరామచంద్రుడుగారు శతాధిక గ్రంథకర్త. ఆయన వ్యాఖ్యానసహితంగా తీసుకువచ్చిన అనువాదాలు ప్రధానంగా మూడు రంగాలకి సంబంధించినవి. మొదటిది, ఇతిహాసాలు, రామాయణానికీ, మహాభారతానికీ చేసిన అనువాదాలు. రెండవది, దర్శన గ్రంథాలు, బ్రహ్మసూత్రభాష్యం, సర్వదర్శన సంగ్రహం వంటి ఎన్నో అపురూపమైన భారతీయ దర్శన గ్రంథాలకు చేసిన అనువాదాలూ, వ్యాఖ్యానాలూను. మూడవదీ, ఎంతో విశిష్టమైందీ, ఆలంకారవాజ్మయానికి చేసిన అనువాదాలు, నాట్యశాస్త్రం, ధన్యాలోకం,అలంకారశాస్త్రచరిత్ర, కుంతకుడి వక్రోక్తి జీవితము, ప్రాకృతభాషా చరిత్ర వంటి అద్భుతమైన గ్రంథాలు. వీటిలో ఏ ఒక్కదానిమీద కృషి చేసి అనువాదం వెలువరించినా ఏ భాష అయినా ఆ మహనీయుడికి తరతరాలుగా ఋణపడిఉంటుంది. అట్లాంటిది ఇన్ని పుస్తకాల్ని అనువదించి అందించిన మహనీయుడికి తెలుగుభాష ఎంత ఋణపడిఉండాలో కదా.
అన్నిటికన్నా ముందు శ్రీరామచంద్రుడిగారిని వాల్మీకి రామాయణం అనువాదానికి ప్రస్తుతించాలి. ఏడు కాండలకీ ఆయన చేసిన అనువాదాన్ని, బాలానందిని పేరిట ఆయన వ్యాఖ్యానాన్ని ఆర్ష విజ్ఞాన ట్రస్టు వారు 1993 లో ప్రచురించారు. ఆ ప్రచురణ తెలుగులో రామాయణ సాహిత్యంలో ఒక మైలురాయి.
అందులో ఆయన రామాయణ శ్లోకం,ప్రతిపదార్థం, తాత్పర్యంతో పాటు అక్కడక్కడ ఎంతో ఔచిత్యంతో కూడిన వ్యాఖ్యానం చేసారు. నేను ఆ పుస్తకం ఆధారంగా వాల్మీకిని కూడబలుక్కుని చదువుకోగలిగాను. ఆయన ఇచ్చిన ప్రతిపదార్థం అన్వయక్రమంతో ఇచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఒక విద్యార్థిలాగా ఆ అన్వయతాత్పర్యాల్ని బట్టి వాల్మీకిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ అనువాదం కూడా ఎంతో సరళంగా, శుభ్రపదజాలంతో కూడుకున్న తెలుగు. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:
రజ: ప్రశాంతం సహిమోద్యవాయు
ర్నిదాఘదోషప్రసరా: ప్రశాంతా:
స్థితా హి యాత్రా వసుధాధిపానాం
ప్రవాసినో యాంతి నరా: స్వదేశాన్ (కిష్కింధాకాండ, 28:15)
(ఇపుడు పరాగము శాంతించినది, వాయువు చల్లగా ఉన్నది.గ్రీష్మఋతువుకు సంబంధించిన తాపాదిదోషములు తగ్గినవి. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది. దేశాంతరములకు వెళ్ళినవారు స్వదేశములకు తిరీగివచ్చుచున్నారు.)
బాలేంద్రగోపాంతరచిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన
గాత్రానుపృక్తేన శుకప్రభేణ నారీవ లాక్షోక్షితకంబలేన (28:24)
(చిన్న ఇంద్రగోపకీటకములచేత మధ్యమధ్య చిత్రవర్ణముగా నున్న కొత్త పచ్చికబీడులతో భూమి లత్తుక చుక్కలు చల్లిన చిలుకవర్ణముగల కంబళముశరీరముపై కప్పుకున్న స్త్రీవలె ప్రకాశించుచున్నది.)
షట్పాదతంత్రీ మధురాభిధానం ప్లవంగమోదీరితకంఠతాలం
ఆవిష్కృతం మేఘమృదంగనాదైర్వనేషు సంగీతమివ ప్రవృత్తం (28:36)
(వనములలో సంగీతము ప్రారంభమైనట్లున్నది.దీనిలో తుమ్మెదల ధ్వనులే మధురమైన వీణాధ్వనులు,మండూకముల కంఠధ్వనులే కంఠతాళములు, మేఘధ్వనులే మృదంగధ్వనులు.)
ఈ అనువాదం ఇంత సరళసుందరంగా ఉందికాబట్టే, కేవలం ఈ అనువాదాన్నే ఇప్పుడు మళ్ళా రెండుసంపుటాలుగా ప్రచురించారు. రామాయణానికి మూలవిధేయంగా వచ్చిన అనువాదాల్లో ఇదే సర్వోన్నతమైందని చెప్పడానికి నాకు సంకోచం లేదు.
రామాయణం తర్వాత, ఆయన పుస్తకాల్లో నేను పూర్తి స్థాయి విద్యార్థిగా పఠించింది ధ్వన్యాలోకం. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, దానికి అభినవగుప్తుడు రాసిన వ్యాఖ్య లోచనం రెండిటినీ కలిపి వాటికి తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఆయన వెలువరించిన అనువాదం ఒక్కటిచాలు, ఆయనకు నాబోటివాళ్ళు జన్మజన్మలకీ ఋణపడిఉండటానికి.
అయిదారేళ్ళకిందట నేనొక పత్రికలో నేను తిరుప్పావై మీద ఒక వ్యాసం రాసినప్పుడు అందులో ఆలంకారిక పరిభాష తప్పుగా పలికానని ఒక ప్రసిద్ధ రచయిత, తెలుగు ఉపన్యాసకుడు నన్ను భరించలేనంతగా అవహేళన చేసాడు. నన్ను నేను సరిచేసుకుందామనే ఉద్దేశ్యంతో ఎవరైనా ధ్వన్యాలోకం పాఠం చెప్పేవాళ్ళున్నారా అని రాళ్ళబండి కవితాప్రసాద్ ని అడిగాను. ఆయన ఎవరి పేరో చెప్పాడుగాని,వాళ్ళు నాకు అందుబాటులో ఉన్నవాళ్ళుకారు. ఒకరోజు ఆ తపన మరీ తీవ్రంగా ఉన్నప్ప్పుడు నా పుస్తకాల అలమారులో ఈ పుస్తకం కనబడింది. 1998 లో వచ్చిన ఈ పుస్తకాన్ని నేను 2000 లోనే కొనుక్కున్నానుగాని చదవలేదు. వెంటనే తెరిచి అధ్యయనానికి పూనుకున్నాను. దీనికి సహాయంగా 'ఆయనే వెలువరించిన 'అలంకార శాస్త్ర చరిత్ర ' (2002)ఎలానూ ఉండనే ఉంది. ఆ తరువాత రోజుల్లో ప్రసిద్ధ పండితుడు నరాల రామారెడ్డిగారు 'గాథాసప్తశతి'లోంచి 300 కవితలు అనువాదం చేసి నాకు పంపిస్తూ ముందుమాట రాయమని అడిగినప్పుడు, నేను ఎంతో సాహసంతో ఆ పనికి పూనుకోవడం వెనక శ్రీరామచంద్రుడిగారి ధ్వన్యాలోకం ఉందని చెప్పితీరాలి.
ఇవి కాక మరొక పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది ' ప్రాకృత భాషా వాజ్మయ చరిత్ర '(2002). ప్రాకృతసాహిత్యం గురించి ఇంగ్లీషులో చాలా పుస్తకాలు ఉన్నాయి. కాని ఇంత సమగ్రంగా ఉన్న పుస్తకం మాత్రం ఇదే, ఇది అనువాదం కాదు. మొత్తం ప్రాకృత వాజ్మయమంతటినీ సంక్షింప్తంగానూ, సమగ్రంగానూ ఒకచోట ప్రస్తావించిన పరిచయం.
ఇందులో కూడా కొన్ని ప్రాకృత గాథలకి రమణీయమైన అనువాదాలు లేకపోలేదు. ఒకటి రెండు చూడండి, మచ్చుకి, మొదటిది గాథాసప్తశతినుంచి, రెండవది వజ్జలగ్గం నుంచి, మూడవది కర్పూరమంజరినుంచి:
అద్దం సణేణ పేమ్మం అవేఇ అ ఇదంసణేణ వి అవేఇ
పిసుణజణజంపి ఏణ వి అవేఇ ఏమే అ వి అవేఇ (పే.202)
(చాలాకాలం పాటు చూడకపోతే ప్రేమ తగ్గిపోతుంది. ఎక్కువగా చూస్తున్నా తగ్గిపోతుంది. చాడీలు చెప్పేవాళ్ళ మూలాన తగ్గిపోతుంది, ఏమిటో,అలాగే తగ్గిపోతుంది.)
లలిఏ మహురక్థర ఏ జవ ఈయణ వల్లహే ససింగారే
సంతే పా ఇయ కవ్వే కో సక్క ఇ స్క్కయం పఢి ఉం.(పే.204)
(లలితమూ, మధురాక్షరయుక్తమూ, యువతులకు ప్రియమూ శృంగారభరితమూ అయిన ప్రాకృత కావ్యం ఉండగా సంస్కృతం ఎవడు చదువుతాడు?)
పరుసా సక్క అబంధా పా ఉ అబంధో వి హో ఈ సు ఉమారో
పురి సమ్హిలాలాణాం జేత్తి అమిహస్తరం తేత్తి అమిమాణం (పే.211)
(సంస్కృతపదబంధాలు పరుషంగా ఉంటాయి. ప్రాకృత బంధాలు సుకుమారంగా ఉంటాయి. ఈ రెండింటికీ ఉన్న తేడా పురుషులకూ, స్త్రీలకూ మధ్యనున్న తేడా వంటిది.)
బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యభాష్యంతో చేసిన అనువాదవ్యాఖ్యానాలు, నాట్యశాస్త్రం మీద అనువాదవ్యాఖ్యానాలు నేనింకా చదవాలి.ఇట్లాంటి గ్రంథాల్ని సంస్కృతంలో ఎలానూ చదవలేం. ఇంగ్లీషు అనువాదాలు ఉంటాయిగాని, అవి చదివితే మనసుకు పట్టవు. తెలుగులో చదివితేనే అవి వంటపడతాయి. ఆ రహస్యం తెలుసు కాబట్టే ఆయన తన జీవితమంతా అందుకు అంకితం చేసారు.
అది కూడా ఎట్లాంటి కృషి! ఆయన పుస్తకాల్ని కంపోజ్ చేసే మిత్రులు సమంత గ్రాఫిక్స్ కృష్ణగారు, పవన్ గారూ నాకొక సంగతి చెప్పారు. ఒకరోజు ప్రూఫుదిద్దిన డిటిపి అర్జంటుగా ఆయనకి ఇవ్వడానికి రాత్రి పదకొండుపన్నెండుమధ్య ఆయనింటికి వెళ్తే అప్పుడు కూడా ఆయన రాసుకుంటూ కనబడ్డారట!
శరీరం పరోపకారం కోసమే అనే సుభాషితానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ ఏముంటుంది?

No comments:

Post a Comment

Total Pageviews