Friday, January 12, 2018

భారత జాతిని మేల్కొలిపిన ఆధ్యాత్మిక నేత..స్వామి వివేకానంద

స్వామి వివేకానంద జయంతోత్సవ శుభాకాంక్షలు.
భారత జాతిని మేల్కొలిపిన ఆధ్యాత్మిక నేత..
ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ భారత జాతికి శాశ్వత మార్గదర్శిగా నిలిచారు.. దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతలో స్పూర్తిని నింపే సందేశాన్ని ఆయన కొద్ది సంవత్సరాల జీవిత కాలంలోనే ఇచ్చారు.. అత్యంత ప్రాచీన సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం ఉన్న భారత దేశం విశ్వగురువు అని ప్రపంచానికి చాటి చెప్పారాయన.. ఆ మహనీయుడే స్వామి వివేకానంద..
ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి 12వ తేదీ స్వామీజీ జన్మదినం.. ఈ శుభ సందర్భంలో వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి..
లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..’
‘ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు,ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..’
‘మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
‘తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం,ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..’
‘విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక,ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..’
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీ వివేకానంద.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి.. కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు,మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం.....
💪💪💪✊✊✊

No comments:

Post a Comment

Total Pageviews