Tuesday, January 9, 2018

భగవద్గీత ప్రయోజనం

భగవద్గీత ప్రయోజనం
ఆధ్యాత్మిక వాజ్ఞ్మయానికి ఆదిమసోపానాలు ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత. ఈ మూడింటికీ ప్రస్థానత్రయమనే ప్రసిద్ధ వ్యవహారమేర్పడింది. ఉపనిషత్తులు అతివిస్తారంగాను, బ్రహ్మసూత్రాలు అతిసంక్షిప్తంగాను ఉండగా, భగవద్గీత అన్యూనానతిరక్తంగా తన స్వరూపాన్ని సంతరించుకున్నది. భగవంతుని ముఖకమలం నుంచి వెలువడింది కాబట్టి పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడింది. భగవద్గీత ఏ కొందరినో ఉద్దేశించి ఉపదేశింపబడింది కాదు. మానవ జాతి మంచిగా మనుగడసాగిస్తూనే జన్మపరంపరలను తరించడానికి భగవంతుడందించిన మహాప్రసాదం. అంతే కాదు విన్నంతమాత్రానే జీవులందరికీ భవబంధాల నుంచి విముక్తి ప్రసాదించగల పవిత్రశబ్ధరాశి. ఈనాటి మానవుడు అజ్ఞానంతో అహంకారంతో గమ్యం తెలియని జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంద్రియాలు చూపుతున్న మార్గాలవెంట పరుగెడుతున్నాడు. అతడికి శాంతి కనుచూపుమేరలో కనబడటం లేదు. నిత్యం అశాంతితో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అంతులేని ఆశలతో సతమతమౌతూ ఆనందాన్నిఅనుభవించ లేకపోతున్నడు. ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్న సమాజానికి మార్గనిర్దేశనం భగవద్గీత. ప్రతిదినం సమాజంలో ఉన్న ప్రతివారు ఎదుర్కొనే ఎన్నో మౌలిక సమస్యలకు చక్కని పరిష్కారం భగవద్గీత. ఓర్పుతో నేర్పుతో మంచి నిర్ణయాలు తీసికొని జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఆనందమయం చేసుకోండి. శాంతిమయం చేసుకోండి. అహంకారాన్ని ఆవేశాన్ని దగ్గరకు రానీయకండి.
శుభం భూయాత్

No comments:

Post a Comment

Total Pageviews