Saturday, September 12, 2015

నాకు నచ్చిన కవితలు

నాకవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయ వా|
కుకవిత్వం పునః సాక్షాన్మృతి రాహుర్మనీషిణః||
- భామహుడు, కావ్యాలంకారం. 7వ శతాబ్దం. నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్నెవరూ తిట్టరు, కొట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నువ్వు తప్పకుండా నీ పాఠకులను చంపినవాడి వవుతావు.
 కానీ మంచి కవిత్వాలని మనసారా తరచుగా చదవడానికి వీలుగా నాకు నచ్చిన కవితలు ఎప్పటి కప్పుడు ఈ పేజీలో భద్రపరుస్తూ ఉంటాను. చదవండి చదువుతూ ఉండండి.    
వుండనీ..
వుండనీ....నన్నిలాగే వుండనీ....
ఒక తుషార స్వప్నంలో తడిచిపోయిన గ్నాపకంగా
మనోహర రాగాన్ని మీటుతున్న హ్రుదయ వీణలా
దిగంతాలనుండి కోసుకొచ్చిన ఆనంద పుష్పంలా...
వుండనీ..నన్నిలాగే వుండనీ
కనిపించీ కనిపించని నీ పాద ముద్రల్ని
వినిపించీ వినిపించని నీ గుండె సవ్వడుల్ని
నీ మనొరంజిత సుగంధ సువాసనల్ని
అనుక్షణం ఆస్వాదిస్తూ..నన్నిలా వుండనీ..
వెన్నెల చల్లని మైదానాల్లొ నీ పాద ముద్రల్ని వింటూ
పారుతున్న సెలయేళ్ళల్లొ నీ గుండె సవ్వడులను స్పర్సిస్తూ...
విరబూసిన ఇంద్రధనస్సులో నీ కాంతి కళ్ళను కంటూ...
వుండనీ ..నన్నిలాగే వుండనీ..
ఒక్క లిప్తపాటులోనైనా నిన్ను బంధించానన్న పొగరు..
జీవిత కాలమంతా...'నీ'భావాన్ని
అణువణువునా ప్రతి దర్షనంలో నాలో ఇముడ్చుకుంటున్నానన్నా
గర్వం నాకిలాగే వుండనీ..
స్వర్ణ ..26.10.2015

---------------

//అనుపల్లవి//
రసప్లావిత హర్షాతిరేక మనోజ్ఞమైన మందిరాన...
సురుచుర సుగంధ సుధాభరిత సల్లాప సమయాన
మధుమోహిత మరందాల వానల..
ఆవిరిదారుల ఊగీ తూగి..
శ్వాసలు దాచిన ప్రణయపు దాహములో..
పూల తెమ్మెరల కలహంస అడుగుల మడుగుల తూచి..
మనసున ఎగిసిన వినీలగగనాల పాలపుంతల
మృదుమంజుల కలకూజిత కలస్వనాలలో..
సరసోత్సవ శుభఘడియల మంగళనాదాలలో
అరమోడ్పుల అలకనంద అధరపాన ఆలింగనంలో..
చెరిపేసిన హద్దుల వలపు ఆనందభైరవి..
రాగరంజిత భావతమస్సులో నీవశమే నేనైతే
తలవంచిన రేయి గడువు..తమకమాపని తనువు గెలుపు..
అనుభూతియై మనసు వీణలు మీటదా..
అనుపల్లవై అనురాగము శృతి చేయదా..!!

Laxmi Radhika
 

Smt Lakshmi Radhika కవితలు


నవ్వుల నగుమోము కదా నీవు..చిరునవ్వులతోనే నన్ను దోచేస్తూ..
నీ చిన్నారిమోముకెన్ని కవళికలో..గిలిగింతలకానుకలతో మనసు కట్టేస్తూ..

మరెన్ని కేరింతలో నీ పొన్నారిమోవిలో..రవ్వంతరాగాలూ రాలుగాయి సవ్వడులైపోతూ..
ఎన్ని చిట్టిస్వరాలో నీ గారాలగొంతులో..ఒయ్యరిగమకాలకే దీర్ఘాలు నేర్పిస్తూ..
పాలుగారు పసిడివన్నె బుగ్గలు..తనివి తీరని ముద్దులు నీకిమ్మంటూ..
సన్నజాజిరేకుల్లోని సున్నితత్వమేమో నీవు..నునులేత స్పర్శలోని మాధుర్యాన్ని నాకందిస్తూ..
నిద్దురలోనూ అరవిరిసే పెదవి పగడాలు..నన్ను రెప్పవేయక దోసిలిపట్టమంటూ..
ఏ గంధం పూసుకు పుట్టినందుకో..వ్యాపించిన సువర్ణపరిమళాలు మనసు నట్టింట్లో..
మాటలకందని నీ చిలిపి అల్లర్లు..మళ్ళీమళ్ళీ నన్ను మైమరపుకు గురిచేస్తూ..
smile emoticon



గజ్జెలందియలు ఘల్ఘల్లని మ్రోయంగా..

బొజ్జలో ఈడేడు భువనాలు కదలంగా..
శిరమున నెమలిఫించము తూగి ఆడంగా..
మురళి మ్రోయించుచు బిరబిర రావోయి..
చిన్నికృష్ణా.. మా ఇంటికి..రావోయి..
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..



మిత్రులకూ శ్రేయోభిలాషులకూ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు..ఈ వసంతం మీకు ఆయురారోగ్యాలు..భోగభాగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆశిస్తూ..
smile emoticon
ఆరుఋతువులను ప్రతిబింబించే సమ్మేళనమేగా ఉగాది
తలచినంతనే తీయనిరుచిని మాత్రమే మనసు పట్టుకుంటూ...
కలబోసి కూసాయి కోయిలలన్నీ

మన్మధనామ సంవత్సరమని మరింత హుషారుగా మైమురుస్తూ..
చిగురించాయి ఏకధాటిగా మావిచిగురులన్నీ
చెరుకురసాల మావిళ్ళు రాబోయేవసంతానికి విందులని ఊరిస్తూ.. 
పూసింది చెట్టంతా వేపపూత
చేదువాసన సైతం కమ్మగా పరిసరాల చుట్టూ ప్రసరిస్తూ..
తలలూచుతూ అరవిరిసాయి సుమబాలలు
వసంతరాణికి అసమాన పుప్పొడి నెత్తావులను అద్దేస్తూ..
గోపికలై ఎదురుచూపులు కన్నెలంతా
రసేశ్వరుడు తమను ఏలుకొనే తరుణమొచ్చిందని ఊహిస్తూ..
చిగురుపచ్చకోక కట్టింది ప్రకృతి
నిండుగా ప్రవహించు సరోవరతీరాలలో మెండుగా స్నానించి..
ఒయారమై వచ్చేసింది వసంతం
మన్మధుడే మేనాలో వచ్చి తనను వరిస్తాడని భావిస్తూ..
ఏకరాగం ఆలపించాయి ఋతువులన్నీ
కొత్తాశలు రేకెత్తించే వసంతమంటే తమకెంతో ప్రియమంటూ..
పరవశిస్తోంది తాపసి హృదయం
అలంకృతమైన ఆమని అందాన్ని మౌనంగానే ఆస్వాదిస్తూ..
smile emoticon

---
నేను వ్రాసిన పద్యాలు - 1. 
పూలగరిమ

శోభ గూర్చెడు నట్టి శుభ కార్యములయందు 
పుల్కరింతలు గొల్ప పూవులుండు 
ఆత్మీయులైన వారాగమించిన వేళ 
పూజ సేయగ బూన బూవులుండు 
నాట్యాది కళలందు నాందీ ముఖాదిని 
బూజింప జూపర బూవులుండు 
దిగ్విజయంబొందు ధీరుల స్తుతియించు 
భూపుల సభలలో బూవులుండు 
ప్రణయినీ ప్రణయుల ప్రస్తవంబునయందు 
జెలువ నింప పూల సజ్జలుండు 
పూజలేని పూవు, పూజ్యమించుక గాని 
పూవు, లేదటందు భూమిలోన

కుసుమాస్త్రు చేతిలో కుల్కెడు మల్లియ 
వాసంత కాలాన వాసి కెక్కు 
హిమమును వెదజల్లు హేమంత కాలాన 
చేమంతి పూలు సుశ్రీదనర్చు 
చక చక సాగని చలికారు నందున 
లొద్దుగల్ లేచును నిద్దురలను 
తీరని యెండలు తీక్క్ష్ణమౌ ఋతువున 
దిరిసిన పూవు లుద్దీప్తి నొందు 
కడిమి పూలు వాన కాలాన వర్ధిల్లు 
కమలములకు శరది కాంతి నొసగు 
చూడజూడ ఋతువు జాడలన్నియు గూడ 
తెలుపు పూల గరిమ తెల్లముగను

నిర్మలంబగు భాష, నిశ్చలంబగు మది 
పూల బాసయు నౌను పూల మనసు 
కోమలంబగు బుగ్గ, కోమలి చిరునవ్వు 
పొల్చు గులాబీయు, పొగడయు నగు
తరుణి సౌమ్యపు కరతలమును, నాసిక 
చారు పద్మమగును చంపకమగు 
కన్నియ చూపు, వక్షస్థలాకృతియును 
తిలకమ్ము తమ్మిది తీరుదోచు 
పుష్ప పాలనమున, పూల పొందిక యందు 
పూల దాల్పు గూర్పు పొలుపు నందు 
పూల పోలికలకు, పూవుల స్వేచ్ఛకు 
స్త్రీలు సామ్యమగుచు చెలగుచుంద్రు

ప్రియురాలి స్పర్శకున్ ప్రియంగువు పొంగు 
కౌగిలిన్ వర్ధిల్లు కురవకమ్ము 
పాద తాడన నందుబ్రోది నశోకమున్
కులుకు లాస్యమునను కొండగోగు 
మందారములు పూయు మంచి మాటల వల్ల 
సురపొన్న గీతాల శోభ దాల్చు 
ముఖ సేచనమువల్ల పొంగారు వకుళమ్ము 
ముఖ వాయువున మావి పొందు వృధ్ధి 
స్త్రీల దక్షత దోహద క్రియలలోన 
ప్రమదలన్ జెల్లు నట్టి పుష్పానుభూతి 
తరుణు లందుండు కోమలత్వమును గూడ 
మనకు వివరింప లేదె పూర్వ కవులెల్ల

భవుని హాసము బోలుట, భవ్యమైన 
పుష్ప చయమున హితులకు పూజ సల్పి 
మనుజు లెప్పుడు భక్తి ప్రపత్తు లెల్ల 
తమవి ప్రకటించు కొందురు తనివి తీర.
------
నెల వంక నీవేళ , నిలదీసి యడగనా
నెల వంక నీవేళ ,
నిలదీసి యడగనా !
నా వంక చెలి యేల రాలేదనీ !

మదిలోని వెతలేల పోలేదనీ !

తారలతో తానేల ఆడేననీ !

నాతార నన్నేల మరిచేననీ !


మరువాన్ని మల్లియా ,

మరువడం తగునా !
విరజాజి విరహాన్ని ,
రేపడం ఆగునా !
మదిలోని మంటలూ ,
చల్లార వేలనో !
చల్లనీ వెన్నెలా ,
వేడెక్కెనేలనో!

జాజి పూ నావంక,
జాలిగా చూడగా !
సంపెంగి గుండెల్ని,
పిండేయ సాగే !

నా ముద్ద మందార మేల రాలేదో !
నా కలువ నన్నేల చేర రాలేదో !

గుండెల్లో ప్రేమంత ,
గోదారి వరదాయె!
గువ్వ రాకుంది ఈఝాము ,
తెల్లారి పోయే ! 
గువ్వ రాకుంది ఈఝాము ,
తెల్లారి పోయే !

...................... డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ . 11/10 /2015 .



 కీ.శేదాశరధి కృష్ణ మాచార్యులు వారు   రచించిన ''అమృతాభి షేకము ''లోని..


''నిశి ''వర్ణన.. రాత్రి ఏవిధముగా చీకట్లు అలుముకున్నాయో వర్ణన..!

(సేకరణ ... మరియు వివరణ ....@Kalyani Gauri Kasibatla.)

.

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
తరుణి కపోల పాళిక లు తాకి,విహాయస వీధి ప్రాకి,చం
దురు పయి సోకి, భూమి ధర దుర్గమ వీధుల దూకి ,మెల్లగా
ధర పయి కాలు మోపిన వుదారములై హరినీల కాంతులన్
.
ఇటు ప్రాకి అటుప్రాకి ఇందు బింబాననా
ముఖము పై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవ రేక్షణా
పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
ఇటు వీగి అటు వీగి మృగ నేత్ర బంగారు
చెక్కిలి పై అగర్ చుక్క నునిచి
వెండి కొండ పయిన్ మబ్బు విధము దోచి
చంద్రకేదారమున లేడి చాయ తిరిగి
ఆది శేషుని పై విష్ణువై శయించి
చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు...
కాటుక వంటి చీకటులను కవి ఎంత అందముగా వర్నిచారో కనుగొనుమా..
.
చాలా మంది మిత్రులు భావం కూడా అడుగుతున్నారు.. వారికోసం
భావం ;;- చీకట్లు నల్లని కాంతులతో భూమిమీద అడుగు పెట్టాయి. నిశ అనే స్త్రీ భుజాల మీద ఎక్కి. శిరస్సుమీద నిలబడి,నక్షత్రాలనే స్త్రీల చెక్కిళ్ళను స్పృశించి,ఆకాశం లోకి పాకి,చంద్రుని తాకి.కొండలలోకి దూకి,మెల్లగా భూమి మీద చీకట్లు అడుగుపెట్టాయి
చీకట్లు లోకానికి అందాన్ని చేకూర్చాయి. చంద్ర ముఖి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టాయి
నల్లని వంకుల ముంగురులు కలిగిన స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని తొడిగాయి.
కలువ వంటి కను రెప్పల మీద వాలాయి.లేడి కన్నులవంటి కన్నులు గల స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరు చుక్కను పెట్టాయివెండి కొండ మీద అమ్బ్బు లాగా కనిపించాయి
చంద్రుడనే పొలం లో జింక లాగా తిరిగాయిఆది శేషుని మెడ విష్ణువులా గా పడుకున్నాయి
ఇన్ని విధాలు గా చీకట్లు లోకానికి అందాన్నిచ్చాయి..( కస్తూరి బొట్టు,కనుబొమలు,కనురెప్పలు,అగరు చుక్క. మబ్బు,చంద్రునిలోని మచ్చ.విష్ణువూ అన్నీ నలుపే.. ఇవన్నీ సౌందర్యాపాదకాలే). చంద్రుని లోని మచ్చను జింక గా వర్ణిస్తారు.



ఉగాది సర్వజన హృదయాహ్లాది ! April 3, 2011
ఉగాది-
పాతలో కొత్తది!
కొత్తలో పాతది!
ప్రకృతి పత్రం మీద ఆకు పచ్చని పునాది!
కోకిల-
చిగురు వేదికపై వెద జల్లిన
కుహు కుహుల సంగీతమౌతుంది.
పూబాల-
ugadi-birdగాలి పుప్పొడి నలుగు పెడుతూ
పరిమళం గుట్టు విప్పుతుంది.
ఇదొక అద్భుత దృశ్యావరణం.
ఇదొక మహత్తర దృశ్య పరిమళం!
మొక్కకు కు లేని సుగంధం
మొగ్గకు అంటుకుంటుంది.
వొగరు చిగురు తిన్న గొంతు
అగరు ధూమంగా వ్యాపిస్తుంది.
ఇదొక గొప్ప హరిత విప్లవం-
ఇదొక ఆహ్లాద ఆనంద ప్లావితం!
మోడుల బోడి గుండుపై
ఎర్రెర్రని చిగురు టోపీ పెడుతుంది.
వేప పూవు మీద
పూత రేకుల్ని కొత్తగా వొత్తుతుంది.
మావి మోవిపై పిందెల
మందహాసం చేయిస్తుంది.
ఏ సువర్ణ సుప్రభాతంలో ‘ప్రభవ’మయ్యిందో-
ఏ సుందర సమయంలో ‘విభవ’మయ్యిందో
ఏ శుభ ముహూర్తంలో ‘శుక్ల’మయ్యిందో...
అరుణారుణ తరుణంలో ‘తోరణ’మయ్యిందో..
ఉగాది పద చరణాల తాకిడికి ప్రకృతి ఆకృతి మారిపోతుంది.
ఆంధ్రాలో ‘ఉగాది’, అస్సాంలో ‘సుహనావా’, పంజాబులో ‘వైశాఖి’, మహారాష్టల్రో ‘గుడిపదవా’, సిక్కింలో ‘నోసంగ్‌’, చైనాలో ‘లుచనా చింగ్‌ మింగ్‌’... పేరులూ, ఊరులూ, తీరులు వేరైనా ప్రవిమల సందేశం ఒక్కటే! భాషలూ, వేషాలూ, రోషాలు వేరైనా పవిత్ర భావన ఒక్కటే!
మహాకవి కాళిదాసు తన ‘ఋతు సంహారం’ కావ్యంలో వసంతాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో గమనించండి-
‘ద్రుమా: ప్రఫుల్లాః సరిలంస పద్మం
స్త్రియః సకామః పవనః సుగంధాః
సుఖా: ప్రదోషాః దివ పాశ్చ రమ్యాః
పర్వం ప్రియే చారుతరం వసంతే’.
sr-bellamప్రేయసీ! చెట్లన్నీ విరగ బూసాయి. సరోవరాలు పద్మాలతో కళ కళ లాడుతున్నాయి. సుగంధాల గాలులు వీస్తున్నాయి. పడతులలో శృంగార సెగల పొగలు కమ్ముకుంటున్నాయి. పగళ్ళు మనోహరంగా.. సాయం వేళలు హాయిగా.. వసంతకాలం బహు సుందరంగా ఉంది సుమా! ఈ వసంతాగమనం కవితా ప్రియులకు, రస పిపాసులకు భావావేశం ఉప్పొంగి పోయే శుభ ముహూర్తం. అందుకే వసంతాన్ని ఋతువుల రాణిగా అభివర్ణిస్తారు. మనతో పాటు పశువులూ పక్షులూ కీటకాలూ సమస్త ప్రకృతీ మహోత్సాహంతో జరుపుకునే పచ్చని పండుగ ఇది!


ప్రకృతి సహజంగా కలిగే

పరస్పరాకర్షణ గుణం

కాలానికి కట్టుపడి వుండదు.

అది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.................


// ఆకర్షణ గుణం //

పచ్చని కొమ్మల మీద
ఎర్రగా విచ్చుకున్న పూలు
ఎదురు చూస్తున్నాయి
తమతో ముచ్చటించే చూపులు
ఎప్పుడొస్తాయా అని.
అది గమనించిన నా నయనాలు
ఆ పూలను చేరుకున్నాయి.
నా నేత్రాలు ఆ కుసుమ పత్రాలూ
ఓపికున్నంత సేపు
గుసగుసలు పెట్టుకున్నాయి.
మధ్య మధ్య
ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాయి.
ఈ సరస సన్నివేశానికి
సన్నిహిత సాక్షులుగా ఉన్న
తరు శాఖలు
తమ తలలూపుతూ
మౌన స్వరంతో వాటిని మెచ్చుకున్నాయి.
ఇంతలోనే కమ్ముకున్న సాయంత్రం
క్రమక్రమంగా
ఆ పూలను
చీకటి ముసుగులతో కప్పేసింది.
తాము పొందిన
అపూర్వానుభూతులను
తమలో నింపుకుని
నేత్రాలు తమ నెలవులకు
చేరుకున్నాయి
పచ్చని కొమ్మల మీద విచ్చుకున్న
ఎర్రని పూలతో
తాము ఆడుకున్న ముచ్చట్లను
స్మరించుకుంటూ
చూపులు కళ్ళలో ఒదిగిపోయినాయి
ప్రకృతి సహజంగా కలిగే
పరస్పరాకర్షణ గుణం
కాలానికి కట్టుపడి వుండదు.
అది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
- డా||సి.నారాయణరెడ్డి Navatealngana.Sat 18 Apr 23, 2015



డా. రాళ్లబండి కవితాప్రసాద్ ||కొన్ని కవిత్వ క్షణాలు ||
పదాల మొగ్గలు
పూలు గా వికసిస్తే కవిత్వం.
వాక్యాల తీగలు
కొమ్మల కెగబాకితే కవిత్వం.
ఇప్పుడు కొన్నికవిత్వక్షణాలు!
... ... ...
ఆమె లో ఆడ తనం ధ్వనించినపుడు
ఒక పద్యానికి వళ్ళుజలదరిస్తుంది.
భావం రూపమైన సృష్టి తొలిక్షణాల లోని లాలిత్యం
రూపం భావంగా మారిపోయి కవిత్వమౌతుంది .
... ... ....
సౌందర్యం ఒక మెరుపు తీగ
దాన్ని అక్షరాలు గా మెలికలు తిప్పు
విషాదం గడ్డ కట్టిన కన్నీటి చుక్క !
దాన్నివాక్య ప్రవాహం చెయ్
నిరాశ ఒక అనంత మైన లోయ...
దాన్నికవిత్వశిఖరాలతో నింపెయ్
ఆశ జీవితపు జాతీయ పతాక
దాన్నికాలం కొండ మీద ఎగరెయ్..
..... ...... .......
అక్షరానికి ధ్వని ఉంది,
ధ్వనికి ప్రాణం ఉంది,
ప్రాణానికి జీవితముంది,
ఆ జీవితం నిండా
ఆశా సౌందర్యాలు,
నిరాశా విషాదాలు
వాటికి సమాంతరంగా
నిరంతరం కవిత్వక్షణాలు ...
రచన : డా రాళ్ళ బండి కవితా ప్రసాద్
శీర్షిక:కొన్ని కవిత్వ క్షణాలు
..... ..... .....
1
రగిలే జ్వాల చల్లారిందంటే
అగ్ని ఓడిపోయినట్లు కాదు!
అంతరాంతరాలలోకి
విస్తరిస్తున్నట్లు !
2
మొగ్గల్ని తుంచుకుంటూ
పోయేవాడికి,
పూల సౌందర్యం
ఎలా దర్శన మౌతుంది?!
3
ఎవరు ,ఎవరిని, ఏదారిలో,వెతకాలో...
తెలుసుకోవడం లోనే
అతని కాలం గడచి పోయింది!
అందుకే ఇంకా ప్రయాణం మొదలు కాలేదు!
4
కొండ గాలి,పండ్ల చెట్లను పలకరించినట్లు ,
అతడి ప్రేమ ఆమెను ఇబ్బంది పెడుతోంది !
5
అన్నింటిని అనుభవించిన చెట్టు
గింజ గా మారాలను కుంటుంది .
అన్నింటినిఅనుభ వించాలనుకుంటున్న గింజ
చెట్టుగా మారాలను కుంటుంది.
సృష్టి -ఒక అనుభవ వాంఛ!!




కంటి చెమ్మ ...
ఎప్పుడూ అది కావాలి...ఇది కావాలి.....
అని అడుగుతూ ఉండేదానివే....కదా తల్లీ...
అడిగినదే తడవు గా...సాధ్యమయినంత వరకు...
నీకు అన్నీ ఇచ్చాను రా...బంగారు..
ఇప్పుడు నన్నే అడుగు తుంటే...
నన్ను ...నేనెలా ఇవ్వను రా...పిచ్చి తల్లి...
అప్పగింతల వేళ ...ఆవేదనే అయినా...
ఇది ఆనంద సమయమే ప్రతీ తల్లితండ్రులకు..
దూరమయినా.... దగ్గరితనంలోని మమకారం ..
కూతురి కాపురం కోసమే...కలవరం.రా..అమ్మడు
గుండెల మీద పారాడిన నీ పసితనం ..
గూడుకట్టుకుందమ్మా ఎద లోగిలిలో..
నేను గుఱ్ఱం అయి..నిన్ను స్వారి చేయిస్తాను..
గుజ్జన గుళ్ళు ..అష్టా చెమ్మలు ఆడుకుంటూ..
ఆగూటిలో...నేను నీతోనే ఉంటానురా..నాన్నా..!
యుగ యుగాలకు తండ్రి కూతుళ్ళ అనుభందం
నిత్య నూతనమే...ఆ అనురాగానికి అవధులు లేవు..
అరమరికలు ఎన్నడూ కానరావు..
అదే..నాన్నప్రేమ..కూతురిలో దాగిన కంటి చెమ్మ !!


No comments:

Post a Comment

Total Pageviews