Friday, September 4, 2015

ప్రతి ఒక్క గురువుకీ వందనం పాదాభివందనం

అఆలు నేర్పిన ఉపాధ్యాయుడినుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్‌. జీవనయానంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే అక్షరాలు దిద్దిననాటినుంచి వెన్నంటి ఉండి, తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అందుకే పూర్వం తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు ఇచ్చి ఆచార్యదేవోభవ అన్నారు. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.

పురాణేతిహాసాల్లో ఓ విశ్వామిత్రుడు, ఓ ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునుడిని ఎలా తీర్చిదిద్దారో, వారిమధ్య గురుశిష్య సంబంధం ఎలా పరిఢవిల్లిందో తెలుసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆనాటితో పోలిస్తే….ఇప్పుడు గురుశిష్య సంబంధాలు గతితప్పాయి. వారిమధ్య అప్పుడు గౌరవం, మన్నన ఉంటే ఇప్పుడు ఆయావర్గాల మధ్య స్నేహం పెరిగింది. ఆధునికభారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో ఆచరించి చూపిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ క్షణాన తలుచుకోవాల్సిందే. ఆయన చూపినబాటలో ఉపాధ్యాయ, విద్యార్థివర్గం పయనించాల్సిందే.

మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

తన జన్మదినోత్సవానికి బదులు ఈ రోజును టీచర్స్‌డేగా జరుపుకోవాలని కోరారు. అప్పటి నుంచి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. మన దేశంలో టీచర్స్‌ డేకు సెలవు లేదు. ఈ రోజును ‘సెలబ్రేషన్స్‌ డే’గా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేటట్టు చేస్తారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల భయం పోయి వారి పట్ల గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.

పిల్లల అల్లరిని భరించి .
నిరక్షరుల పాలిటి 'అక్షరశ్రీ' నీవు.  
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలిన  'జ్ఞానజ్యోతి'వి నీవు.
మానుషరూపం దాల్చిన 'వాణీతేజమే' నీవు.
అక్షరాలనే ఆశించి ...శ్వాసించి.. శాసించే
 విజ్ఞాన నిధీ!

మీకు వందనం అభివందనం!



No comments:

Post a Comment

Total Pageviews