Friday, September 4, 2015

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ! మా ఇంటి చిన్ని కృష్ణుడి సందడి చూసి శ్రీ కృష్ణాష్టమి విశేషాలు చదవండి!!

 మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !
మా ఇంటి చిన్ని కృష్ణుడి సందడి చూసి శ్రీ కృష్ణాష్టమి విశేషాలు చదవండి!! 
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు.  కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణజయంతి, శ్రీ జయంతి అనికూడా పిలువబడుతోంది.  కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే క్షిష్ణాష్టమిగానూ నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణజయంతిగానూ వ్యవయరించాలని ధర్మశాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. తిథీ నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం గానీ బుధవారం గానీ అయితే మరీ ప్రసస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది. అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేయాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. 
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని 
స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు ( పాలు, పెరుగు, వెన్న,మీగడ , అటుకులు, బెల్లం,
కొబ్బరి, శొంటి మొ ;) .సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.

ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది. శ్రీ కృష్ణుని బాల్యచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు.కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలయిన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే, జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు.  గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఈ ఉత్సవం. పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే "పొంనమాను సేవ'' అని అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
 దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!!!






అమ్మ పాలు,పెరుగు,వెన్న, మీగడ ఇవన్ని ఎక్కడ దాచేసిందో ఏమో.... వెతుకుతున్నా 



అమ్మో అమ్మవచ్చేస్తోందేమో? చూద్దాం ఒకసారి.. 

                                     హమ్మయ్య! వెన్నదొరికింది ఒక పట్టు పడతాను.

మీరు చూసేసారు కదా..మా అమ్మకి చెప్పకండే నేను వెన్న తింటున్నానని!!  
మరొకసారి  అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
మణిసాయి - విస్సా ఫౌండేషన్. 

No comments:

Post a Comment

Total Pageviews