Wednesday, September 30, 2015

అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!2

మొన్న నిన్న గణపయ్య శ్లోకాల అర్ధాలు గ్రహించాం! ఇప్పుడు చదువుల తల్లి వంతు. 
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
పూర్వం గణపతి సరస్వతి శ్లోకాలు, సుమతి వేమన మొదలైన పద్యాలు చదవకుండా చదువులు ప్రారంభించేవారు కాదు. సరస్వతి అనుగ్రహం వుంటే చదువులు బాగా వస్తాయని నమ్మే వారు. మరి ఇప్పుడు ఒకటి.... ఒకటి.... రెండు... రెండు... మూడు... మూడు అంటూ పరిక్షా ఫలితాల ప్రకటనల్లో గొంతు చించుకునే ఒకటి రెండు కాలేజీల్లో చేర్పిస్తే చాలు ఎల్ కే జీ నుంచే ఐ ఐ టి కోచింగ్ ట అంటూ వేలంవెర్రిగా అక్షరాలు నేర్పించేందుకు కూడా అక్షరాలా లక్షలు పోసి చదువు 'కొంటున్నాం' ఒక్కసారి ఆలోచిద్దాం!! చదువులమ్మను మనసారా కొన్ని పద్యాలతో అయినా నిత్యం పూజిస్తే చల్లని చదువులతల్లి అనుగ్రహిస్తుంది! మనం నేర్చుకుందాం పిల్లలకి నేర్పిద్దాం!! ర్యాంకులు సాధిద్దాం! 
శారదా, శారదాంబోజ వదనా, వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత్
తాత్పర్యము: ఓ శారదా దేవీ! (శారదాంభోజ వదనా) తెల్లటి కలువలాంటి ముఖంకలదాన! (వదనాంబుజే) ముఖమే పద్మముగా కలదానా; (సర్వదా) అన్నిటినీ అనగా అన్ని విద్యలనీ ఇచ్చేదానా, (సర్వదాస్మాకం సన్నిధి) ఎల్లప్పుడూ మాయొక్క సన్నిధిలో అనగా మాకు తోడుగా ఉండి, (సన్నిధిం క్రియాత్) మంచినిధిని అనగా మంచిని చేయుగాక!
సత్యసాయి విస్సా ఫౌండేషన్!


ఈ రోజు మరో సరస్వతి దేవి మీద పద్యం సర్వ శుక్లా సరస్వతి అని పోతనామాత్యుడు ఈ జగత్తులోని 16 తెల్లని వర్ణాలు కలిగిన వాటితో పోలుస్తూ చెప్పిన ఈ పద్యం మనసారా వల్లిస్తే...సరస్వతి దేవి మన నాలుకపైనే వసిస్తుంది! చదవండి! పిల్లలచేత చదివించండి!!    
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!
తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, పాలసముద్రం, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఆయనకి వాటన్నిటితో పోలిస్తేనే కాని తృప్తి కలగలేదు ఆయనకి! వెయ్యిమాటలు అవసరం లేదు విన్నంతనే ఆవతలవారికి హాయి అనిపించే చల్లని మాట చాలు. ఇటువంటి హాయిని అందించే మాటల మూటల పద్యాలు మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలు...వాటిని అన్నింటినీ మరల ఒకసారి గుర్తుచేసుకుందాం! మరో తరానికి అందిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్!

No comments:

Post a Comment

Total Pageviews