Sunday, September 27, 2015

అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!


ఓం గం గణపతయే నమః 

అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
జ్ఞానం అన్నది మహాసాగరం ...ఎంత నేర్చినా తరగని నిధి. అనాదిగా అపార జ్ఞాన సంపన్నులైన మన మహా ఋషులు, మునులు కూడా మేము జ్ఞానులము అని ఎప్పుడూ చెప్పుకోలేదు. జ్ఞాన సముపార్జనకి ఏవిధమైన అడ్డంకులు ఎవరూ ఎప్పుడూ కల్పించలేదు, కల్పించ లేరు కూడా అయినా మనం నేర్చుకోలేము, నేర్చుకోము సరికదా ఎల్లప్పుడూ జ్ఞానం ఫలానా వారు మాకు ఎవరూ బోధించడం లేదని, అందరికీ చేరనివ్వలేదని కుహనా మేధావుల విమర్శలు ఈ మధ్య తరచూ వినబడుతున్నాయి. మనకి అన్నీ తెలుసనుకుంటాము కానీ మనకు ఏమి తెలియదు. నిజానికి మొట్టమొదటగా చదివే గణపతి శ్లోకాలు 'శుక్లాం బర ధరం' అగజానన పద్మార్కం" మొదలైన శ్లోకాలే సరిగ్గా చదవడం రాదు ...నిజం సరిగ్గా చదవడం రాదు. కావాలంటే ఇప్పుడే ఒకసారి చదివి ఈ శ్లోకాల అర్ధం చదవండి. ప్రతి రోజూ అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! శీర్షికన ఇటువంటి శ్లోకాల అర్ధవివరణ మాకు పునాది వేసిన మా విస్సా ఫౌండేషన్ ద్వారా మీకు అందజేస్తాము.. 
శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!!
శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన (తెల్లని) వస్త్రము ధరించినవాడు
విష్ణుం -- సర్వాంతర్యామి ఐనవాడు
శశి వర్ణం --చంద్రుని రంగు కలిగినవాడు
చతుర్భుజం --నాలుగు భుజములు కలిగినవాడు . పాశము, అంకుశము, మోదకము మరియు అభయ హస్తము కలిగినవాడు అన్నది స్థూలమైన అర్థము. మన ఆశా పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది మోదకము. అప్పుడు ఆయన అభయహస్తము మనకు సిద్ధిస్తుంది.
ప్రసన్న వదనం : ప్రసన్నమైన నగుమోము కలిగినవాడు
సర్వ విఘ్నోపశాంతయే-- ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+ విఘ్న ఉపశాంతయే)
ధ్యాయేత్ --ప్రార్థింతుము.
శుక్లాం బరధరం బరధరం అని చదువుతాము. ఎంత తప్పు!! ఎన్ని నామాలు ఎన్ని సార్లు, ఎన్నిలక్షల కోట్ల బిల్వపత్రార్చన అన్న లెక్కలు, చిత్తం శివుడి మీద దృష్టి చెప్పుల మీద అన్నట్లు కాకుండా చిత్త శుద్ధితో ఏకబిల్వం శివార్పణం అన్నట్లుగా త్రికరణ శుద్ధితో ప్రతి అక్షరం అర్ధం పరమార్ధం తెలుసుకుందాం! అలాగే మరెన్నో విషయాలు, ఆలయ సందర్శన విధులు వంటి ఎన్నో ధర్మ సందేహాలు!! ఈ శీర్షికన ప్రతి రోజూ తెలుసుకుందాం! ధర్మో రక్షతి రక్షితః !!
శుభం భూయాత్!!!మణిసాయి విస్సా ఫౌండేషన్!

ఓం గం గణపతయే నమః ఓం నమ:శివాయ 
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! 

గణేశ శ్లోకం:- అగజానన పద్మార్కం గజాననమహర్నిశం| అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే||
అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )

జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసిస్తాయి. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ. ఆమె జగన్మాత కనుక మనతల్లులకి ఆదర్శం పిల్లలని చూస్తే తల్లుల ముఖం వికసిస్తుంది. మరి మనమో తల్లి తండ్రులను వృద్ధా శ్రమాల్లో చేర్పిస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసిన గణపతి కుమారస్వామికి ముల్లోకాల లోని నదుల్లో ముందుగా స్నానమాచరించి ఎదురుగా వస్తూ కనబడ్డాడు. తల్లి తండ్రులను పూజించాలని ఆ మహా గణపతి మనకి ఆదర్శంగా చేసి చూపించాడు. మనం ఆచరించాలి అప్పుడే మన పూజలు స్వీకరిస్తాడు.
గజ +అననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహర్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఎకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు

ఈ శ్లోకములో అనేకదంతం అని ఏకదంతం అని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను. పెద్దలు ఈ విషయంలో అందరూ సరిగ్గా ఉచ్చరించేలా (పలికేలా) చూడాలి. శుభం భూయాత్!! మణిసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews