ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు | ముద్దుగారే |
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు | ముద్దుగారే |
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు | ముద్దుగారే |
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు | ముద్దుగారే |
No comments:
Post a Comment