Saturday, November 11, 2017

కార్తిక పురాణం – 22వ అధ్యాయం

                                                      కార్తిక పురాణం – 22వ అధ్యాయం



Image result for కార్తిక పురాణం – 22వ అధ్యాయం
అత్రిమహాముని ఇట్లు పల్కేను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణ్వాలయమునకు బోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిరుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతను హరిణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును జేసి హరిమూర్తిని బంగారముతో చేయింది ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తిక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ జేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహ ధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపించుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోను, వజ్రముల వంటి కత్తులతోను, ఐరావతము వంటి ఏనుగుల తోను, ఆకాశమునకు ఎగురు గుర్రములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్య జయ కాంక్షతో భయంకరమయిన సంకుల యుద్ధము జేసిరి. ఆయుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణి గూలి, బాణ శరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై రథ, గజ, సాది, పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు, రక్షించుడు అని ప్రార్థించుచుండిరి.
Image result for కార్తిక పురాణం – 22వ అధ్యాయం

కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట జూచి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్దమును చాలించి మిగిలిన సేనలతో తనపురమును జేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను. హరి అనుకూలముగా ఉండిన యెడల శత్రువు మిత్రమగును. అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును. ధర్మమే అధర్మమగును. కార్తికవ్రతమును జేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన యెడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణువు తేజోవంతుడు ఇది సత్యము. అందును కార్తిక వ్రతమునందు కోరిక యుండుట మరీ దుర్లభము గదా! కలియుగమందు హరిభక్తులై కార్తికవ్రాత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తిక వ్రతమును జేయుచు హరిభక్తి గలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి గలిగి కార్తిక వ్రాత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛ గలిగెనేని హరిభక్తి చేయవలెను.అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. Image result for కార్తిక పురాణం – 22వ అధ్యాయం
అగస్త్య మునీంద్రా! హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును. పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు సగరాదులు హరినాశ్రయించి పరమపదమొందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతము గలవారై తానూ స్వతంత్రుడైనను అన్య తంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలయును. హరిభక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును, సమస్ర చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తీ గలవానికి కార్తిక వ్రతము సులభమని తలచెదను. కార్తిక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావిచెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్రా! కాబట్టి కార్తిక వ్రతము ఇష్టార్ధములనిచ్చును. సర్వ వ్రతోత్తమోత్తమము. ఇది సర్వ శాస్త్ర సారము. సర్వవేద సమ్మతము. కార్తిక మహాత్మ్య బోధకమైన యీ అధ్యాయమును నిత్యమూ వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణి జేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన యెడల పితృ దేవతలకు కల్పాంతము వరకు తృప్తి గలుగును.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే ద్వావింశాధ్యాయ స్సమాప్తః!!

No comments:

Post a Comment

Total Pageviews