Thursday, November 9, 2017

కార్తిక పురాణము - ఇరవై అధ్యాయము

కార్తిక పురాణము - ఇరవై అధ్యాయము 

Image may contain: flower and plant
జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయునదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెనను కోరిక కలదు గాన చెప్పుము. వశిష్టముని పల్కెను. రాజా! వినుము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమయినది దానిని నీకు చెప్పెదను. అత్రిమహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోపకారము కొరకు కార్తిక మహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పుదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మ శ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తికమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునీంద్రా! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము జేసితివి. చెప్పెదను వినుము. కార్తికమాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమయిన దేవుడు లేడు. కార్తికమాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుదురు. ఈవిషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు, సూర్యవంశసంభూతుడు పురంజయుడను ఒకరాజు గలడు. ఆపురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరుాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును, శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించువారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెను. రాజు యీప్రకారముగా అధర్మ పరాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యాపట్టణము చుట్టును చెరకు పానకమునకు తేనెటీగలవలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్త్రాస్త్ర పూరితమును, మహాచక్రయుతమును, మంచి గుర్రములతో గూడినదియునైన సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారమునుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
Image result for కార్తిక పురాణము - ఇరవై అధ్యాయము
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే వింశాధ్యాయస్సమాప్తః

No comments:

Post a Comment

Total Pageviews