కార్తిక పురాణము - ఇరవై అయిదవ అధ్యాయము
బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది. ఈవిషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జల పానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము "కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!" కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు. బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు. ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాడు వలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను. ఒరాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు. వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును. అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి. రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపజేయుచున్నావు. ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు. గనుక వారిని బాధించెదవు. నీవు ధర్మ కంటకుడఅగుదవు.
దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా! నేను పాపుడను. పాపకర్ముడను. పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును దెలియక పాపమను బురదయందు పది దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను. పాపములను జేసితిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా! నేను దయ గలవాడను గాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేనివారికి ఆలయమైతిని. గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు. గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను. ఇట్లని పలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను. ౧. మత్స్యము ౨. కూర్మము ౩. వరాహము 4. వామనుడు ౫. వికృత ముఖుడు ౬. బ్రాహ్మణుడై క్రూరుడు ౭. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు ౮. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు ౯. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను యిచ్చితిననెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములనూ తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించు వాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిస్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.
ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!
No comments:
Post a Comment