Friday, November 3, 2017

లక్షపత్రిపూజ


ఈ కార్తీక మాసం శుభ సందర్భంలో లక్షబిల్వపత్రి పూజ, మారేడు దళాల గొప్పతనాన్ని తెలుసుకుందాం.
త్రిదళం త్రిగుణాకారం
మారేడు నీవని ఏరేరి తేనా?! మారేడు దళములు నీ పూజకు...అన్నాడు మహా కవీశ్వరుడు వేటూరి. ఎంత అద్భుతమైన శ్లేష?! శ్లేషలో అపురూపమైన భావం, మారేడులో ప్రభువుని ఇమిడ్చి చమత్కరించాడు. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.
బిల్వ పత్ర మహిమ
శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా
దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావే? అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
శారీరక రుగ్మతలను పోగొట్టే మారేడు
లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు. మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము. మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వౄఎద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.
మారేడు ఉపయోగాలు: బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది. మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది. ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది. మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి. ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం. మారేడు చెట్టు ... మామిడి చెట్టులా కళకళలాడుతూ కాకుండా అనేక ముళ్లతో కనిపిస్తుంది. మారేడు కాయాలు మామిడికాయల్లా నోరు ఊరించలేవు. ఇక మారేడు దళాలను మామిడాకుల్లా శుభకార్యాలలో ఉపయోగించరు. అలాంటి మారేడు చెట్టు ఎలా విశిష్టమైనది అవుతుందనే సందేహం కొంతమందిలో కలుగుతూ వుంటుంది. మారేడు దళాలు బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. తులసీ దళాలు లేకుండా శ్రీమహావిష్ణువుకి చేసే పూజ వ్యర్థమైనట్టే, మారేడు దళాలు లేకుండా సదాశివుడికి జరిపే పూజ కూడా వ్యర్థమని చెప్పబడుతోంది. కాలకూట విషాన్ని మింగడం వలన పరమశివుడు తీవ్రమైన వేడికి లోనవుతుంటాడు. మారేడు దళాలు ఎంతో చల్లదనాన్ని కలిగిస్తూ వుంటాయి గనుక, వీటితో శివుడిని అర్చిస్తుంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడుచెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు.
పుణ్య ఫలాలను ఆర్జించడం కోసం కొందరు పెద్ద సంఖ్యలో అన్నదానాలు చేయాలని అనుకుంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా చేయలేకపోతుంటారు. అన్నదానం వలన పొందవలసిన పుణ్య ఫలాలను పొందలేక పోతున్నందుకు బాధపడుతుంటారు. అలాంటి వారు మారేడుచెట్టు నీడలో అన్నదానం చేయవచ్చు. మారేడు చెట్టునీడలో కొందరికి అన్నదానం చేసినా కోటిరెట్ల ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. ఇక మారేడు చెట్టు మూలంలో శివలింగాన్ని వుంచి పూజించడం వలన సకల శుభాలు చేకూరతాయి. శివ సాయుధ్యం సైతం లభిస్తుంది.
_/I\_
శుభం భూయాత్!!!

No comments:

Post a Comment

Total Pageviews