Friday, November 10, 2017

తెలుగుభాషకు వందనం, శుభాభినందనం

అమృతాన్ని వర్షించు అమ్మయను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే మమ్మీయను మాట నేర్చిరి!
నాన్నాయనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
డ్యాడ్ అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి!
అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన అన్నను,
బ్రోదర్ అంటూ బరువూ భాద్యత లేనివానిగ మార్చిరి!
తమ్ముడూ అను మురిపాల పిలుపునకు కూడా,
ఒకటే పదం అంటూ సెలవిచ్చిరి!
అక్కాయనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, సిస్ టర్ అంటూ మిస్ చేసిరి!
చెల్లీయనగా, కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, ఒకటే పదమంటూ సొద పెట్టిరి!
సంస్కారాన్ని తెలిపే నమస్కారాన్ని,
హెలో, హాయ్ అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి !
యుగానికే ఆది తెలుగు వుగాది, సంస్కృతీ సంబరాలను మరచి, తల్లుల రోజు, తండ్రులరోజు, ప్రేమికుల రోజు,ఆంగ్ల సంవస్తరాది విందుల మత్తులో మునిగితేలిరి?
సుమతి లోపించి, వేమనను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి,
ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించసాగిరి?
వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు, మామకు పెద్దయ్యకు,
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కటే పదమనిరి
అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి,
పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?
సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి
తేట తెనుగు, విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చొనో?
యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!?
తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం

No comments:

Post a Comment

Total Pageviews