Saturday, November 4, 2017

అవినిమయం VADREVU CH VEERABHADRUDU·SUNDAY, 5 NOVEMBER 2017

వునా కాదా అనుకుంటూ ఆ ఇంటిముందు ఆగాను. ఆదివారం తీరికదనమంతా ఆ కాలనీలో కనిపిస్తోంది. పార్కు చేసిన కార్లు తప్ప ఆ ఇళ్ళమధ్య మరెవరూ కనిపించడం లేదు. గేటుకి అటూ ఇటూ తాపడం చేసిన పేర్లు కనిపించాయి. ఒకవైపు ‘శోభ’ అనీ మరో వేపు ‘ప్రకాశం’ అనీ. మరోమారు ఆ ఇంటిని పరికించి చూసాను. డూప్లెక్సు. ముందు పూలమొక్కల్తో, మీదకు పాకిన తీగల్తో ఇంటి ఆవరణ పచ్చగా కనిపిస్తోంది. కాంపౌండు గేటు తీసుకుని లోపలకి అడుగుపెట్టగానే మామిడిపూత పరిమళం వెచ్చగా తాకింది. లోపల అడుగుపెట్టి ఇంటిముందు తలుపు దగ్గర నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను.
లోపలనుంచి మనుషులు వచ్చేలోపటనే కుక్కపిల్ల ఒకటి వూలుబంతిలాగా తలుపు పరదాకిందనుంచి ముందుకొచ్చింది. ఆ వెనకనే ప్రొఫెసరు జ్ఞానప్రకాశం కూడా. నన్ను చూస్తూనే ఆయన ముఖం మీద వెండిగీతలాగా ఒక చిరునవ్వు మెరిసింది. ఆ మెరుపు ఆ రిమ్ లెస్ కళ్ళద్దాలమీదుగా పాకి కళ్ళల్లో మెరుపుగా మారింది.
‘ఓ, నువ్వా’ అంటో తలుపు తీసి ‘రా, లోపలకి రా, ఏమిటి విశేషం’ అన్నాడు.
షార్ట్సూ, టీ షర్టుల్లో ఆయన్ని చూడటం కొత్తగా అనిపించింది. సెలవుదినం తీరికదనమంతా ఆయన తన వంటికి చుట్టబెట్టుకున్నట్టే వున్నాడు. ఆయన నా సమాధానం కోసం చూడకుండానే, నన్ను ఆ ముందుగదిలో ఆపకుండా లోపలకి తీసుకెళ్ళాడు. విశాలమైన డ్రాయింగు రూము. రూము అనేకన్నా హాలు అనడం సరిగ్గా ఉంటుంది. ఆ హాలు మొత్తం కలయచూసేలోపలే
‘మీకో కథ వినిపిద్దామని వచ్చాను సార్’ అన్నాను.
‘ఓ,గ్రేట్, అట్లా అయితే, పైకి పోయి కూచుందాం’ అంటూ ఆయన మెట్లవైపు దారితీసాడు. హాలుకి ఒక మూల ఉన్న మెట్లమీంచి నన్ను పైకి తీసుకువెళ్ళాడు. పైనున్న గదిలోంచి బాల్కనీలో అడుగుపెడుతూ, ‘ఇక్కడ బావుంటుంది, నువ్వు కథ చదవడానికీ, నేను వినడానికీ’ అన్నాడు.
ఆ బాల్కనీ మరీ చిన్నదిగా లేదు. బహుశా, పైన వెయ్యాల్సిన గదుల్లో ఒక గదిమొత్తం బాల్కనీగా మార్చినట్టుంది. అక్కడ నాలుగైదు కేన్ కుర్చీలు, మధ్యలో ఒక గ్లాసు టీపాయీ ఉన్నాయి. ఆ టీపాయిమీద మొబైలు స్మార్టు ఫోను. నల్లగా, ఇమ్మాక్యులేట్ గా. ఆ కుర్చీల పక్కన ఒక చిన్న కార్పెట్ పరిచిఉంది. ఆ కార్పెట్ కీ, గోడకీ మధ్య ఒక సోఫా వాల్చి ఉంది. ఆ సోఫామీదా, కుర్చీల్లోనూ మెత్తని తలగడలున్నాయి. వాటి గలేబులమీద పూలబొమ్మలున్నాయి. బాల్కనీ చుట్టూ అల్యూమినియం రెయిలింగు ఉంది. ఆ బాల్కనీకి పైకప్పు మీంచి వేలాడుతున్న పూలకుండీలున్నాయి. కిందన కూడా ఒక పక్కగా చాలా పూలకుండీలున్నాయి. కొన్నిట్లో చామంతులు ఇంకా తాజాగా కనిపిస్తున్నాయి. ఆ మొక్కలకి పొద్దున్నే నీళ్ళుపోసినట్టున్నారు, అక్కడంతా తడిసిన చామంతి ఆకుల సన్నని సువాసన పొరలాగా పేరుకుని ఉంది. సోఫా పక్కగా కుండీలో ఒక బొన్సాయి మర్రిచెట్టు కూడా ఉంది.
ఆయన నన్ను కూర్చోమని, తాను కూడా కూర్చుంటూ, ‘బ్రేక్ ఫాస్ట్ చేసావా’ అనడిగాడు.
చేసానన్నాను.
‘ఏమి తాగుతావు? కాఫీ? టీ?’
ఏమీ వద్దన్నాను. అసలాయన నాతో మాట్లాడతాడా అనుకున్నాను.చెప్పా చెయ్యకుండా ఆదివారం ఇంటికొచ్చినందుకు విసుగ్గా మొహం పెట్టి ఎప్పుడన్నా యూనివెర్సిటీలో కలుద్దాం, ఈ సారి వచ్చేముందు మెసేజి పెట్టమంటాడేమో అనుకున్నాను. కాని, ఇట్లా నన్ను లోపలకి పిలిచి, మేడమీద కూర్చోబెట్టి మరీ ఇంత మర్యాద చేస్తాడనుకోలేదు. నాకు కొంత బెరుగ్గానూ, మొహమాటంగానూ అనిపించింది.
‘లెట్ అజ్ హావ్ సమ్ కాఫీ’ అన్నాడాయన. అని మళ్ళా కిందకు వెళ్ళాడు.
ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాశం ప్రపంచమంతా తెలిసిన ఇంగ్లీషు పండితుడు. యూనివెర్సిటీలో చదువుకున్నప్పుడే ఆయన గురించి చాలా విన్నాను. కాని, ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన నాకు ఇంగ్లీషంటే చెప్పలేని భయం. అతి కష్టం మీద అది కూడా రోజువారీ అవసరాలకి సరిపోయే మటుకే ఆ భాష పట్టుబడింది. ఎమ్మే చదువుకునేటప్పుడు, చదువుకోసం, ఆ భాష పట్ల ఉండే భయం కొంత పోయిందిగాని,సాహిత్యం చదివేపాటి సామర్థ్యం ఇంకా రానేలేదు. ఎన్నోసార్లు ఇంగ్లీషు నవలలు చదవాలని ప్రయత్నించాను గాని, ఒక పేజీ చదివేటప్పటికి, మొదటి పేరాలో ఏం చదివానో చివరి పేరాకి వచ్చేటప్పటికి మర్చిపోతుంటాను. అందుకని ప్రొఫెసరు జ్ఞానప్రకాశాన్ని కలవాలన్న ఊహే రాలేదు నాకెప్పటికీ. ఇప్పుడు కూడా కలిసి ఉండేవాణ్ణి కాను, రెండు వారాల కిందట, అనుకోని ఆ సంఘటన జరిగి ఉండకపోతే.
‘నిన్ననే నిన్ను తల్చుకున్నానోయ్’ అంటో వచ్చాడు ప్రొఫెసరు. ఆయన చేతుల్లో ట్రే ఉంది. రెండు కప్పుల కాఫీ. ఒక్క ఉదుటన లేచి ఆ ట్రే అందుకోబోయాను.
‘నీ కప్పు తీసుకో’ అన్నాడాయన.
ఆ కప్పుల్లోంచి సన్నని, వెచ్చని ఆవిరి.
ఆయన తన కప్పు టీపాయి మీద పెట్టి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూచుని నన్ను కూడా కూచోమని సైగ చేస్తూ ఫోన్ కేసి చూసాడు.
‘నువ్వు ఫోన్ చేసి రావలసింది’ అంటాడేమో అనుకున్నాను.
‘పోయినవారం నేను ట్రివేండ్రంలో ఒక సెమినార్ అటెండయ్యాను. కీనోట్ అడ్రెస్. అక్కడ నీ గురించి చెప్పాను వాళ్ళకి’ అన్నాడు.
అప్పుడు ఆ కప్పు చేతుల్లోకి తీసుకున్నాడు.
‘దేని మీద సార్ సెమినార్’ అనడిగాను.
‘నెరేటివ్ అండ్ డిస్కోర్స్’ అని నెమ్మదిగా కాఫీ ఒక గుక్క తాగి ‘ఇప్పుడు చెప్పు, నీకు సాహిత్యమంటే ఇష్టమెందుకు కలిగింది?’ అని అడిగాడు.
పెద్దగాలి ఒకటి దుమారంలాగా నా మీద వీచినట్టనిపించింది ఆ ప్రశ్న వినగానే. చేతులు అడ్డుపెట్టుకుంటూ, కాళ్ళు నిలదొక్కుకుంటూ, ఆ దుమారంలోంచి నెమ్మదిగా ఎదట ఏముందో చూడటానికి ప్రయత్నిస్తామే, అట్లానే, ఆయన ప్రశ్నకి జవాబు చెప్పటానికి మాటలు కూడబలుక్కున్నాను.
‘నాకు సాహిత్యమంటే ఇష్టం ఎలా కలిగిందో చెప్పలేనుగాని సార్, చాలా చాలా ఇష్టమని మటుకు చెప్పగలను. సాహిత్యం మీద ఎవరు మాట్లాడినా, ఏమి చెప్పినా వినాలని ఉంటుంది. ఎంతదూరం పోయైనా సరే వినాలని ఉంటుంది’ అన్నాను.
ఒక్క క్షణం ఆగి మళ్ళా చెప్పడం మొదలుపెట్టాను.
‘సాహిత్యం గురించి మాట్లాడుతుంటే నాకు నా లోపలి మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చిన్నప్పణ్ణుంచీ నేను చూసిన పేదరికం,అనుభవించిన, అనుభవిస్తూ ఉన్న ఇబ్బందులు, కష్టాలూ వీటిని మరిపించేదేదో అందులో ఉందనిపిస్తుంది. అలాగని, సాహిత్యం వల్ల వాటిని మర్చిపోతానని కాదు. నా జీవితం గురించి నాకు మరింత బాగా తెలుసుకోడానికి కథలూ, కవిత్వమూ బాగా సాయం చేస్తాయనిపిస్తుంది. అందుకనే ఏ పుస్తకం దొరికినా వదలకుండా చదివాను. మా ఊళ్ళో, ఆ తర్వాత కదిరి హైస్కూల్లో, తర్వాత రోజుల్లో అనంతపురంలో కాలేజీలో చదువుకున్నప్పుడు ఏది దొరికితే అది చదివాను. ఆ తర్వాత యూనివెర్సిటీలో తెలుగు సాహిత్యం చదువుకోవాలనుకున్నానుగానీ, తెలిసినవాళ్ళంతా చెప్తే సోషియాలజీ చదువుకున్నాను. చదివానుగానీ, నాకు నా ఊరూ, నా సమాజం, నా అనుభవం చెప్పినంత బాగా ఆ థీరీలూ, ఆ పుస్తకాలూ చెప్పలేదనిపించింది’
‘ఎమ్మే చేసావా, మరి ఇప్పుడేం చేస్తున్నావు? పి ఎచ్ డి చేస్తున్నావా?’
‘లేదు సార్, మా ఇంట్లో పరిస్థితులు బాలేవు. ఏదో ఒక ఉద్యోగంలో చేరకతప్పలేదు. అందుకని, సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను’ అన్నాను.
‘కానీ, హైదరాబాదు నాకు సరిపడలేదు సార్. ఇక్కడ అంతా నాకు కొత్తగానూ, పరాయిగానూ అనిపిస్తుంది. నా అనుభవాలకీ, నా ఆలోచనలకీ ఇక్కడున్నవాళ్ళు మాట్లాడేదానికీ బాగా గాప్ ఉంది. నేను చిన్నప్పణ్ణుంచీ చూస్తున్న మా ఊళ్ళూ, మా కుటుంబాలూ, మా కష్టాలూ వాటికి పరిష్కారం ఇక్కడున్నవాళ్ళకి తెలుసనుకున్నాను. కాని, ఎవరిని కలిసినా, వాళ్ళకి నేనే విధంగా ఉపయోగపడతానా అనే చూస్తారు తప్ప, మాకు ఏ విధంగా సాయపడగలమా అని ఆలోచించేవాళ్ళు కనిపించడం లేదు’ అన్నాను.
‘అంతా అలాగే ఉన్నారంటావా?’ అనడిగాడు ఆయన కుతూహలంతో కూడిన చిరునవ్వుతో.
‘అంతా, అంటే, అంతా సార్ . చిన్నప్పటి మా స్టూడెంటు యూనియన్ల దగ్గర్నుంచి ఇప్పుడు మా మానేజిమెంటుదాకా దాకా.’
‘నీకెవరూ స్నేహితుల్లేరా?’
‘ఉన్నారు సార్. కాని వాళ్ళతోటీ ఇదే సమస్య. ఒకడుండేవాడు, వాడు కూడా నాలా కథలు రాస్తాడు. వాళ్ళ పల్లెల గురించీ, వాళ్ళ వాళ్ళు పడే బాధల గురించీ రాస్తాడు. మొదట్లో వాణ్ణి చూస్తే నాకు చాలా ఆరాధనగా ఉండేది. ఇప్పుడు సినిమాలకి స్టోరీ సిట్టింగులకి పోతూంటాడు. కొన్నాళ్ళు వాడితో కలిసి ఒక రూంలో ఉన్నాను. ఇప్పుడు వాణ్ణి చూస్తేనే భరించలేను.’
‘ఎందుకని?’
ఏమని చెప్పను? ఇట్లా చెప్పడం మొదలుపెడితే చాలామంది మీదా చాలా చెప్పాలి. బయటి ప్రపంచంలో అడుగుపెట్టాక, నా ప్రపంచం విస్తరించవలసి పోయి, కుంచించుకుపోతూ వచ్చిందని చెప్పాలి. మనిషిగా తారసపడ్డ ప్రతివాణ్ణీ నేనిష్టపడ్డాను, కాని, అది వాడు మనిషి కాడని తెలిసేదాకా మాత్రమే.
‘మీరు వెళ్ళిన సెమినార్ దేని గురించి సార్?’ అనడిగాను. నెరేటివ్, డిస్కోర్సూ అనే రెండు పదాలూ ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి.
‘అదా, కథల గురించీ, సాహిత్యం గురించే. ఇప్పుడు కథ అనే మాట కన్నా నెరేటివ్ అనే మాట ఎక్కువ వాడుతున్నారు. నెరేటివ్ అంటే కథలొక్కటే కాదు, ప్రతి ఒక్కటీ, చివరికి హోటల్లో మనముందు పెట్టే మెనూ కార్డు లో కూడా నెరేటివే అన్నాడొకాయన.’
‘మరి కథకీ, నెరేటివ్ కీ తేడా ఏమిటి సార్?’
‘కథ అంటే, కథ. ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎవరికి జరిగిందో అదంతా కథనే. కానీ, మనం చెప్పే ఏ కథ కూడా వట్టి కథ కాదు. ఆ స్టోరీ లో మనకి తెలీకుండానే మనం మన గురించీ, మన ఇష్టాయిష్టాలగురించీ, ఇంకా చెప్పాలంటే, మన పొలిటికల్ ప్రయారిటీస్ గురించి కూడా చెప్పుకొస్తాం. దాన్నే డిస్కోర్స్ అంటున్నారు. స్టోరీ, డిస్కోర్సూ రెండూ కలిస్తే నెరేటివ్ అవుతుంది. ఇప్పుడు సాహిత్యానికి కథ మీద కన్నా కూడా డిస్కోర్సు మీద ఎక్కువ ఇంటరెస్టు’ అన్నాడు.
మళ్ళా ‘ఇప్పుడు చూడు, ఆ రోజు నువ్వు కథ చదివావు కదా, కానీ వాళ్ళంతా ఎందుకు గొడవ చేసారు? ఆ గొడవనే డిస్కోర్సు అన్నమాట’ అన్నాడాయన నవ్వుతూ.
ఆయన ఆ కథ గురించి ప్రస్తావించగానే నాకొక్కసారిగా చెప్పలేనంత దిగులు కలిగింది. ఆ రోజు, ఒక కథాసంకలనం ఆవిష్కరణ జరిగింది. అందులో నేను రాసిన కథ కూడా ఉంది. అది నేను రాసిన మూడో కథ. దాన్ని కథ అనొచ్చో లేదో నాకు తెలియదు. కాని చాలా కాలంగా నేను చూస్తూ ఉన్నదే. గుండెలో ఉండలాగా చుట్టుకుపోయింది. దాన్ని బయటికి వెళ్ళగక్కడంకోసం ఆ కథ రాసాను. వేసవి కాలం వస్తే మా పల్లెల్లో నీళ్ళు లేక, మా పశువులకి నీళ్ళూ, మేతా లేక, వాటిని అమ్మేసుకుంటుంటారు. అట్లా ఒకసారి మా నాన్ననే ఇంట్లో ఉన్న రెండెద్దులూ అమ్మేసాడు. కాని ఎప్పుడూ లేనిది,ఆ సారి తొలకరి కురిసింది. పొలం దున్నడానికి ఎడ్లు లేవు. మా నాన్న పడ్డ బాధ చెప్పలేను. అదంతా రాసాను. ప్రతి ఒక్క వివరం, విశేషం, ఏదీ వదలకుండా రాసాను. ఎడ్లకి నాడాలు ఎప్పుడు కొట్టించాడో, ఎక్కడ కొట్టించేడో దగ్గర్నుంచి, ఎడ్లు అమ్ముకోడానికి ఎప్పుడు మనసు గట్టిపరుచుకున్నాడో, ఎవరికి అమ్మాడో అదంతా రాసాను. అదంతా రాస్తే కాని నా మనసు తేలికపడలేదు. కేశవరెడ్డి నవల్లో రైతు పొలం అమ్ముకోడం గురించి గ రాసినట్టు నేను నా కథలో రైతు ఎడ్లు అమ్ముకోడం గురించి రాసాను. ఇంతకీ, ఆ రోజు ఆ కథల గురించి మాట్లాడుతూ ఒక విమర్శకుడు, నా కథ గురించి కూడా మాట్లాడేడు. మాట్లాడటం కాదు, చీల్చి చెండాడేడు. నేను రాసిన వస్తువు గొప్పదే గాని, శిల్పం లేదన్నాడు. అదంతా వార్తాపత్రికలో రాసిన రిపోర్టులాగా ఉందన్నాడు. కథలు రాయాలన్న ఉత్సాహం ఉంటే చాలదు, కథలు ఎలా రాయాలో కొంతైనా తెలుసుకోవాలన్నాడు. ఆ సభలో ప్రొఫెసరుగారు కూడా వేదిక మీద ఉన్నాడు. ఆ తర్వాత ఆయనే మాట్లాడాడు. ఆ పుస్తకం గురించి కొంత మాట్లాడేక ఆయన నా కథని చాలా మెచ్చుకుంటూ, అసలు కథలు ఇలానే రాయాలన్న నిబంధనలు ఏమీ లేవని చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారనీ, కథల్లో ఫార్మ్ ని పూర్తిగా నిర్మూలించిన కథకులు కూడా ఉన్నారన్నాడు. నాకు గుర్తులేవుగాని కొంతమంది కథకుల పేర్లు కూడా చెప్పాడు.కాని మీటింగైపోగానే ఆ విమర్శకుడు ప్రొఫెసరుగారితో గొడవపడ్డాడు.
‘కొత్తగా రాస్తున్నవాళ్ళకి మీరు దారి చూపించాల్సిందిపోయి ఇట్లా వెనకేసుకు రావడం బావులేదు’ అన్నాడు.
‘కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళని మీరిట్లా డిస్కరేజ్ చెయ్యడం కూడా బాలేదు’అన్నాడు ప్రొఫెసరు.
ఆ రోజు ప్రొఫెసరు జ్ఞానప్రకాశం నాకు చాలా అత్మీయుడిగా అనిపించాడు. ఆయనలాంటి వాడు నా జీవితంలో ఇంతకుముందే, నా హైస్కూల్లోనో, కాలేజీరోజుల్లోనో, కనీసం నేను హైదరాబాదు వచ్చిన కొత్తలోనో ఎందుకు కనిపించలేదు అనుకున్నాను. ఆ మీటింగైపోయిన మర్నాడే మరో కథ రాసాను. ఎడ్లు అమ్ముకోడం గురించి కాడు. అంతకన్నా దారుణమైన సంగతి. శరీరాలు అమ్ముకోడం గురించి. మా పల్లెలోనే, మా దగ్గర బంధువు, నా వరసకి అక్క అవుతుంది, కమలక్క, ఆమె కథనే రాసాను. రాస్తున్నంతసేపూ, నా ఎదట ప్రొఫెసరుగారు కూర్చున్నట్టూ, ఆయనకి చెప్తున్నట్టూ రాసాను. కథ ముగిసిందని నాకు తట్టేటప్పటికి, నా చెంపల మీంచి ధారాపాతంగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి.ఆ కథ ఆయనకి ఎప్పుడెప్పుడు వినిపిస్తానా అని ఆతృత కలిగింది. ఆ కథలో శిల్పం సరిగానే కుదిరిందా లేదా ఆయన్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాను.
నేను కింద చూసిన కుక్కపిల్ల మేడమెట్లు ఎక్కి తోకాడించుకుంటూ వచ్చి ప్రొఫెసరు పక్క నిలబడింది. ఆయన దాని తల మీద చేయి వేసి లాలనగా నిమురుతూ ‘ఆయన నీకు తెలుసా?’ అనడిగాడు.
‘ఎవరు సార్?’ అన్నాను.
‘అదే ఆ రోజు నీ కథమీద మాట్లాడేడే, ఆయన?’
‘పర్సనల్ గా తెలీదు సార్, కానీ చాలా మీటింగుల్లో చూసాను.’
‘ఆయనకీ, నీకూ ఏదైనా పొలిటికల్ డిఫరెన్సులున్నాయేమో అనుకున్నానులే. ఇప్పుడు సాహిత్య విమర్శ అంటే పొలిటికల్ క్రిటిసిజమే కదా’ అన్నాడు ప్రొఫెసరు.
‘బట్, యు డోన్ట్ నీడ్ టు టేక్ హిమ్ సీరియస్లీ. ఆయన నీ కథ కథ కాదన్నాడు కదా. అదే మరో కథకుడు ప్రయోగాత్మకంగా కథ రాసాడనుకో. అందులో జీవితం లేదంటాడు.ఆ కథకుడికి సమాజం గురించి తెలియదంటాడు. అతడికి వాస్తవం తెలీదు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రయోగాలు చేస్తున్నాడంటాడు. ఎలాగైనా మాట్లాగలడు. ఇన్ కన్సిస్టెంట్ ఫెలో’ అని కూడా అన్నాడు.
నాలో ఏదో ఉద్వేగం పొంగుకొచ్చింది.
‘మీరిందాకా మన యిష్టాయిష్టాలూ, మన పొలిటికల్ ప్రయారిటీస్ అంటే ఎవరి ఇష్టాయిష్టాలూ, ప్రయారిటీస్ సార్? రచయితవా లేక రచయిత మాట్లాడుతున్న సమాజానివా లేకపోతే పాఠకులవా? ఇదేమీ కాకపోతే ఆ విమర్శకుడివా? ఆ మీటింగు తర్వాత నేను చాలా ఆలోచించాను. నాకో సంగతి అర్థమయింది సార్. ఆయనలా మాట్లాడుతున్నాడంటే, తప్పు ఆయనదీ కాదేమో. అసలు ఆయనకి కానీ, ఎవరికి గానీ, ఏం కావాలో తెలీదనుకుంటాను. నా చిన్నప్పుడు నేను సాహిత్యం చదవడం మొదలుపెట్టిన రోజుల్లో సమాజం మారాలని కోరుకునేవాళ్ళూ, మారకూడదనీ, ఇప్పుడున్నట్టు ఉంటేనే బాగుంటుందనీ అనుకునేవాళ్ళూ రెండు రకాల రచయితలుండేవారు. ఇప్పుడట్లాకాదు, ప్రజలూ, రచయితలూ రెండు వర్గాలుగా ఉన్నారు సార్. రచయితలకి ప్రజల గురించి తెలీదు. ప్రజలకి రచయితలగురించి తెలీదు. ప్రజలకి రచయితలగురించి తెలీక పోతే నష్టమే కానీ, రచయితలకి ప్రజలగురించి తెలీక పోతే, అదింకా పెద్ద ప్రమాదం సార్.’
కానీ ప్రొఫెసరు నా మాటలకి తలూపలేదు.
‘ప్రజల గురించి తెలీడమంటే ఏమిటి? వాళ్ళంతా ప్రజల్లోంచి వచ్చినవాళ్ళే కదా. చాలామంది రచయితలు గ్రామాల్లో పుట్టిపెరిగినవాళ్ళే కదా.’
‘కానీ వాళ్ళకి ప్రజలతో సంబంధం తెగిపోయింది సార్. మీ మాటల్లో చెప్పాలంటే స్టోరీకీ, డిస్కోర్సుకీ మధ్య తాడు తెగిపోయింది. అంటే వాళ్ళు ప్రజల గురించి మాట్లాడతారు కాని, వాళ్ళతో మమేకం కాలేరు. ప్రజలు వాళ్ళకి ఒక టాపిక్, ఇంకా చెప్పాలంటే, పెట్టుబడి’ అన్నాను.
‘పెట్టుబడి!’ ప్రొఫెసర్ బిగ్గరగా నవ్వాడు.
అప్పుడేదో మాట్లాడబోయాడుగాని,ఆయనకి మళ్ళా ఆపుకోలేనంత నవ్వొచ్చింది. తెరలు తెరలుగా నవ్వాడు. నెమ్మదిగా సంబాళించుకుని, ‘నీకు తెలుసా, పోయిన వారం సెమినార్ లో ఇదే చెప్పాన్నేను’అన్నాడు.
ప్రశ్నార్థకంగా చూసాను.
‘ఇప్పుడు డిస్కోర్సు అంటే ఏమిటో తెలుసా? ఒకప్పుడు వలసవాదం రోజుల్లో వెస్టర్న్ కంట్రీస్ ప్రపంచమంతా పాలనసాగించే రోజుల్లో, వాళ్ళకి ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలుండేవి. సముద్రాల్తో, ఓడల్తో, వలసదేశాల్తో, బానిసల్తో, తుపాకుల్తో, మందుగుండుతో, స్వాతంత్ర్య పోరాటాలతో, విప్లవకారుల్తో, జైళ్ళతో, చివరికి, రోగాల్తో, దోమల్తో కూడా ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఈ గాలులూ, ఈ వెలుతురూ, ఈ ఆకాశమూ వాళ్ళు ప్రత్యక్షంగా చూసేవారు, అనుభవించేవారు. మంచో చెడో, వీళ్ళేమి అనుభవించేవారో వాళ్ళూ అదే అనుభవించేవారు. మరిఇప్పుడో? '
ఇంతలో ఆయన మొబైలు బీప్ మంటూ చప్పుడు చేసింది. ఆ బీప్ మెసేజి కాదు, రింగ్ టోనే. ప్రొఫెసరు జీవితంలో సాధన చేస్తున్న సున్నితత్వమంతా ఆ బీప్ లో తెలుస్తోంది.
‘ఎక్స్యూజ్ మీ’ అన్నాడాయన. ఫోను మాట్లాడటానికి లేచాడు. ఆ సంభాషణ చాలా సేపే నడిచింది. ఆయన మాట్లాడుతున్నంతసేపూ ఆ కుక్కపిల్ల ఆయన మోకాళ్ళకే మోకాళ్ళకి చుట్టుకుపోతూ ఉంది. ఆయన కాల్ ముగించి, తిరిగి వచ్చి కూర్చుంటూ
‘ఇంటర్నేషనల్ స్టడీ టీమ్ ఒకటొస్తోంది. ప్రిన్స్ టన్ యూనివెర్సిటీనుంచి. సౌత్ ఏసియన్ లిటరేచర్స్ మీద షార్ట్ టెర్మ్ స్టడీ. ఈ సమ్మర్ లో’ అన్నాడు.
అప్పుడు మళ్ళా నాకేసి చూసి, ‘ఏం చెప్తున్నాను? ఆ...ఇది పోస్ట్ కలోనియల్ ప్రపంచం. ఇప్పుడు వాళ్ళకి, అంటే ఆ కలొనియల్ దేశాలకి ఒకప్పటి ఆ అనుభవం లేదు. లేదంటే లేదని కాదు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. కాని దాన్లో కొత్తదనం లేదు, థ్రిల్ లేదు. వాళ్ళ ప్రపంచం ఇంకెంతమాత్రం విస్తరించేది కాదు. ఇప్పుడు వాళ్లదంతా చాలా రుటీన్, మామూలు ప్రపంచం. కానీ, చూడు, వాళ్ళ దగ్గర ఇన్నేళ్ళుగా సాధించిన పరిజ్ఞానముంది. ప్రపంచాన్ని ఆమూలాగ్రంగా చూసిన అనుభవముంది. దేన్నైనా విశ్లేషించగల సామర్థ్యముంది. అందుకని వాళ్ళిప్పుడేం చేస్తున్నారంటే, ఇదిగో మనలాంటి దేశాల సాహిత్యం మీద పడ్డారు. మన స్టొరీస్ మీద వాళ్ళు డిస్కోర్సు మొదలుపెడుతున్నారు. అందుకని నేను మొన్న సెమినార్ లో ఏం చెప్పానంటే, ఒకప్పుడు పాశ్చాత్యదేశాలు కాలనీల బొగ్గుతో, పత్తితో, మనుషుల్తో వ్యాపారం చేసారు. ఇప్పుడు కథల్తో చేస్తున్నారు అని. అంటే, మన కథలు వాళ్ళకి గనుల్లో దొరికిన ఖనిజాల్లాంటివి, వాళ్ళు వాటికి సానపెడతారన్నమాట. డిస్కోర్సు అంటే అదే, సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రేడ్. ట్రేడింగ్ విద్ ఎక్సీపిరియన్స్ అన్నాను. అయితే, దానిమీద కూడా పెద్ద డిస్కోర్సు నడిచిందనుకో’ అన్నాడు ప్రొఫెసరు.
ఆ కుక్కపిల్ల నా కాళ్ళదగ్గరకి వచ్చింది. నాలుక ముందుకు చాపి వగరుస్తూ ఉంది. నెమ్మదిగా నా మీదకు పాకి నా వళ్ళో కూచోడం దాని ఉద్దేశ్యంలా ఉంది.
‘నో, స్వీటీ, నో’ అంటో ప్రొఫెసరు దాన్ని గోముగా వెనక్కి లాగాడు. అప్పుడు ‘అలాగని నువ్వు చెప్పింది పూర్తిగా ఒప్పుకోలేననుకో. ప్రజలతో మమేకం కావడంటే ఏమిటి? వాళ్ళని చూడగలను, కలవగలను,మాట్లాడగలను, అర్థం చేసుకోగలను. అంతకుమించి చెయ్యడానికేముంటుంది? వాళ్ళ జీవితం నేను జీవించలేను కదా. పోనీ, నువ్వు చెప్పు, అంతకుమించి మరేమి చేస్తే వాళ్ళతో మమేకమయినట్టు నీ దృష్టిలో?’ అని కూడా అడిగాడు.
నేను ఆలోచిస్తున్నాను.
ఇంతలో ఆయనే చిన్నగా నవ్వాడు. సాధారణంగా ఏదో ముచ్చట గుర్తొచ్చినప్పుడు మనుషులు నవ్వినట్టుగా, నవ్వి, ‘చూడు, మాకో వైస్ ఛాన్సెలర్ ఉండేవాడు. ఆయన సోషల్ సైన్సెస్ వాళ్ళతో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. మీరు రీసెర్చి చేసేటప్పుడు, మర్చిపోకండి, గ్లోవ్స్ తొడుక్కోండి అని. ఆ మాటలు చెప్పేటప్పుడల్లా ఆయన అదే మొదటిసారి చెప్తున్నట్టుగా చెప్పేవాడు.అట్లా చెప్తూ ఒక్క క్షణం ఆగి వాళ్ళ మొహాల కేసి చూసేవాడు. అప్పుడు గట్టిగా నవ్వి, నాచురల్ సైన్సెస్ వాళ్ళు మాత్రమే కాదు, సోషల్ సైన్సెస్ వాళ్ళు కూడా గ్లోవ్స్ తొడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకేదైనా ఇన్ ఫెక్షను రావచ్చు. లేకపోతే మీనుంచి వాళ్ళకైనా ఇన్ఫెక్షన్ అంటుకోవచ్చు అనేవాడు. ఆ మాటలు వింటూ అంతా నవ్వేసేవాళ్ళుగానీ,నాకా మాటలు బాగా గుర్తుండిపోయాయి. ఆయన ఇన్ఫెక్షన్ అని ఏ అర్థంలో అన్నాడో తెలీదు కాని, ఒక శాస్త్రవేత్త నిస్పాక్షికంగా, తటస్థంగా ఉండాలంటే గ్లోవ్స్ తొడుక్కోక తప్పదనే నాకూ అనిపిస్తోంది’ అన్నాడు.
ఆ తర్వాత కొన్ని క్షణాల పాటు మా మధ్య ఎవరో ఏదో తలుపు మూసేసినట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఫిబ్రవరి ఆదివారం సోమరిగా ఆకాశమంతా పరుచుకుంది. మామిడిపూత పరిమళం చాపకిందనీరులాగా ఇప్పుడు మా కుర్చీలదాకా ప్రవహించింది.
‘నువ్వు ఏదో కథ పట్టుకొచ్చానన్నావు?’
కాని నా మనసు ఇంకా ఆయన చెప్పినమాటలదగ్గరే ఆగిపోయింది.
‘సార్, మీరన్న మాటల గురించే ఆలోచిస్తున్నాను.ఇప్పుడు ప్రపంచం రెండు రకాలుగా విడిపోయిందనిపిస్తోంది సార్. కాని అది మీరు చెప్తున్నట్టు తూర్పుదేశాలూ పడమటి దేశాలూ అనిగానీ, లేదా అందరూ చెప్తునట్టు ఉన్నవాళ్ళూలేనివాళ్ళూ అనిగానీ, లేదా పట్నాలూ, పల్లెలూ అనిగాని కాదు సార్. మీ మాటలు విన్నాక ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ప్రపంచం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ప్రజలు, అంటే, రకరకాల అనుభవాల్తో దుఃఖంతోనో, సంతోషంతోనో, నిస్సత్తువతోనో, పోరాడుతోనో జీవితమధ్యంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు మీరన్నారే ఒకప్పటి వలసదేశాల ప్రజల్లాంటివాళ్ళు. ఆ ప్రజలు ఎండకి ఎండుతారు, వానకి తడుస్తారు. వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళంతా రెండో వర్గం. ఏ మాత్రం చదువుగాని, డబ్బుగాని, అధికారం గాని దొరికినా మనుషులు తమ తోటి మనుషుల అనుభవాన్ని తమకి ముడిసరుగ్గా మార్చుకుంటున్నారు. సిద్ధాంతాలుగానీ, రాజకీయాలుగానీ, ఉద్యమాలుగానీ-వాటిని నడుపుతున్నవాళ్ళకి ప్రజల అనుభవమే రా మెటీరియల్. మీరు పాశ్చాత్యదేశాల లిటరరీ డిస్కోర్స్ గురించి చెప్పింది నాకు మన దేశానికి కూడా సంబంధించిందే అనిపిస్తోంది. అంటే చదువుకున్నవాళ్ళకీ, సాహిత్యానికీ మటుకే అప్లై అవుతుందని కాదు. అన్నింటికీ, మన రాజకీయాలకీ, మన అసెంబ్లీ ప్రసంగాలకీ, మన సమాచార ప్రసారసాధనాలకీ అన్నిటికీ వర్తిస్తుంది’ అన్నాను. ‘ఇంకా చెప్పాలంటే, ఒకప్పటి వలసపాలకులస్థానంలో ఇప్పుడు వీళ్ళొచ్చారు’ అని కూడా అన్నాను..
కానీ నా ఉద్వేగం నాకే భరించలేనట్టుగా అనిపించింది. సాధారణంగా మనుషులు కసి ఉన్నా దాన్ని చూపించుకోలేనంత నిస్సహాయత ఉన్నప్పుడు వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెట్టినట్టే నా మాటల్లో కూడా అవహేళన తొంగిచూసింది.
‘మీరు చెప్తున్నంతసేపూ మా ఎడిటరుగారే కళ్ళముందు కనిపిస్తున్నారు. ఆయన బాగా చదువుకున్నవాడే. చక్కటి తెలుగు, పెర్ ఫెక్ట్ తెలుగు రాస్తాడు. కానీ, ఇప్పుడాయన లోపల ఎక్స్ రే పెట్టి చూసినట్టుగా అంతా కనబడిపోతోంది, సార్, ఆయనలోపలంతా ఒట్టి డొల్ల, ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అనుభవానికి దూరమైపోయాడు. ఆయన మనుషులకే కాదు చివరికి దోమలకి కూడా దూరమైపోయాడు సార్. నాకు తెలిసి గత ఇరవయ్యేళ్ళల్లో ఆయనకి ఒక్కసారి కూడా మలేరియా వచ్చినట్టులేదు’ అని అనకుండా ఉండలేకపోయాను.
కానీ ఆయన నా మాటలకి నవ్వలేదు. ఆ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. కళ్ళద్దాలు తీసి చేత్తో పైకెత్తి చూసుకున్నాడు. వాటి అద్దాలమీద చిన్నపాటి మరక కూడా లేదు. అప్పుడు ‘నిజమే. దీన్నే నేను ఇగ్నొరెన్సు కొలెస్టరాల్ అంటాను. అంటే, మనకి బాగా అలవాటయిన జీవితం నుంచి ఒక్కడుగు కూడా పక్కకి వెయ్యం. మనకే అంతా తెలుసనుకుంటాం.ఇది కూడా ఒకరకమైన ఒబేసిటీనే. దీనికి కూడా ఎక్సర్ సైజ్ ఉండాలి. అందుకే నేనేమంటానంటే..’
ఆయన మాట పూర్తిచేసేలోపల, మెట్లమీంచి అడుగులచప్పుడు వినవచ్చింది.ఆ వెనకనే మా వైపు ఎవరో గదిలో స్ప్రే చేసినట్టుగా చల్లని పెర్ ప్యూమ్ సువాసన తాకింది. బాగా పూతపట్టిన నిమ్మతోటకి నీళ్ళు పట్టినప్పుడు గాల్లో వీచేలాంటి మధురాతిమధురమైన సౌరభం. ఆ సౌరభం వెనకనే సంగీతమయస్వరంతో
‘డాడ్, కార్ కీస్ ఎక్కడున్నాయి’ అంటో ఒక యువతి అక్కడ అడుగుపెట్టింది.
ఆమెకేసి చూసాను. ప్రొఫెసరుగారి కూతురని తెలుస్తోంది. పాలూ, తేనే పోతపోసి తీర్చిదిద్దినట్టుంది ఆమె వదనం. చెవులదాకా కత్తిరించిన జుత్తు నల్లగా, ఒత్తుగా ఉన్నా, చిరుగాలికి రేగుతూనే ఉంది. ఆమె చెవుల్ని కొత్త డిజైన్ లోలాకులు వేలాడుతున్నాయి. జీన్స్, తెల్లని టాప్, పైన గులాబి రంగు చున్నీ.
ఎందుకో చెప్పలేనుగానీ, ఆమెని చూస్తూనే నాకు మా కమలక్క గుర్తొచ్చింది. నాకెందుకో కడుపులో ఒక్కసారిగా తిప్పేసింది. అంతదాకా అక్కడ పరుచుకున్న ఆ చామంతిపూల పరిమళం, నెమ్మదిగా అల్లుకున్న మాఘమాసపు మామిడిపూలగాలి, కిటికీలకు వేలాడుతున్న పలచని పరదాలూ, నిముషం కిందటనే గుప్పున వీచిన నిమ్మపూల గాలీ అన్నీ ఒక్కసారి అదృశ్యమైపోయేయి. భోరున వీచే వేసవి గాడ్పూ, మైళ్ళకు మైళ్ళు పరుచుకుని ఉండే చిట్టీత తుప్పలూ, రేగుకంపలూ, అడుగడుగునా కాళ్ళల్లో గుచ్చుకునే పల్లేరూ గుర్తొచ్చాయి. దిగంతందాకా బొరోమంటూ పల్లెలమీద ఒరిగిపడే ఉక్కులాంటి ఎండాకాలం గుర్తొచ్చింది. బక్కచిక్కిన ఆవులు, ఎడ్లు, కళ్ళముందే కరిగిపోయే చొప్పకట్టలూ, నాచుపట్టిన చెరువులు ఎండాకాలం మొదలుకాకుండానే ఎండిపోయేటప్పుడు ఊళ్ళో ఇళ్ళల్లోకీ గుప్పుమనే దుర్గంధమూ గుర్తొచ్చాయి.
‘డాడ్, అ లిటిల్ మోర్ షాపింగ్ డ్యూ’ అంది ఆ అమ్మాయి.
‘మా అమ్మాయి, అనన్య’ అన్నాడు ప్రొఫెసరు. ‘అట్లాంటాలో చదువుకుంటోంది’ అని, నన్ను కూడా ఆమెకి పరిచయం చేసాడు.
‘మా అమ్మాయి కమలాబాయి’ అని మా పెదనాన్న ఎవరికో పరిచయం చేస్తున్నట్టు ఉంది.
కమలాబాయి. ఎంత అందంగా ఉండేది. మా ఊళ్ళో ఉన్న స్కూల్లోనే మేమిద్దరం అయిదో క్లాసుదాకా చదువుకున్నాం. ఆరవతరగతి చదవాలంటే కదిరి వెళ్ళాలి. అందుకని వాళ్ళ నాన్న ఆమెని చదువుమానిపించేసాడు. పెద్దకుటుంబం. ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు. పైన ఇద్దరు అక్కలు. అన్నదమ్ముల్లేరు. ఆ కుటుంబం ఎట్లా బతికిందో నాకిప్పుడు ఊహకి అంతుచిక్కకుండా ఉంది. అట్లాంటి రోజుల్లో, నాలుగేళ్ళ కిందట, ఉన్నట్టుండి కమలక్క కనిపించకుండా పోయింది. కొన్నాళ్ళ గుసగుసలతర్వాత అందరూ బాహాటంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ మధ్యే వూళ్ళోకి వచ్చిన తులసీబాయి ఆమెని పూనా పట్టుకుపోయిందని. ఆ సంగతి విన్నప్పుడు నాకు వారం రోజులు అన్నం సయించలేదు. నాకు ఎవరిని చూసినా చాలా కోపంగా ఉండేది. ఇంకా భరించలేని విషయం, ఆమె వెళ్ళిపోతున్న సంగతి మా పెదనాన్నకి తెలుసని. కరువు అంటే ఏమిటో, బీదరికం అంటే ఏమిటో నాకు చిన్నప్పణ్ణుంచీ తెలుసనుకున్నానుగానీ, నిజంగా తెలిసింది అప్పుడే.
‘గ్లాడ్ టు మీట్ యూ’ అని అనన్య చేయి చాచింది. ఆమెలో యవ్వనం, ఉత్సాహం, జీవశక్తి అపారంగా పొంగిపొర్లుతున్నాయి. నేను లేచి నించొని ఆమె చేతిలో చేయి కలిపాను. కాని కలపడం కాదు, తాకించాను అనాలి, అది కూడా చాలా మొహమాటంగా. కాని, ఆ అరచేయి తాకినప్పుడు నేనొక సుకుమారమైన లోకాన్ని, నాకెన్నో సముద్రాల దూరంలో ఉన్న ఒక స్వాప్నికలోకాన్ని తూలికాతుల్యంగా తాకినట్టే అనిపించింది.
‘కీస్ అక్కడే కిందనే ఉన్నాయే’ అన్నాడాయన.
‘వ్హేర్?’ అందామె. ఆ కంఠంలో సముద్రపుగాలిలాంటి యవ్వనపు జీర.
‘సరే, పద’ అంటో ఆమె వెనకనే మెట్లవైపు అడుగేసాడు.
వాళ్ళ వెనకనే ఆ కుక్కపిల్ల కూడా కిందకు గెంతింది.
నాకెందుకో ఒక్కసారిగా చెప్పలేనంత నిస్సత్తువ ఆవహించింది. ఎందుకని? నాకు మళ్ళా మళ్ళా కమలక్కనే గుర్తొస్తూ ఉంది. నాలుగేళ్ళ కిందట ఊరు వదిలిపెట్టివెళ్ళిపోయినామె మళ్ళా మళ్ళా ఏడాది కిందట తిరిగి వచ్చింది. ఒక్కర్తే కాదు. ఆమెలాంటి వాళ్ళు మొత్తం ముప్పయి అయిదు మంది. అంతా మా చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళే. బీదవాళ్ళు.తిండికి గతిలేనివాళ్ళు. పెళ్ళికానివాళ్ళు, భర్తలు చనిపోయినవాళ్ళు, భర్తలు వదిలిపెట్టేసినవాళ్ళు. వాళ్ళందరినీ ఏ ఆశాపాశం, ఏ దారిద్ర్యలోభం నడిపించుకుపోయిందో ఆ దారిన. ఇప్పుడెవరో ఒక స్వచ్ఛంద సంస్థ పెద్ద పోరాటం చేసి మరీ వాళ్ళని విడిపించుకొచ్చింది. వాళ్ళని తిరిగి మళ్ళా పల్లెలకి పట్టుకొచ్చింది. వాళ్ళని ఆ కుటుంబాలు అంగీకరిస్తాయా అనుకున్నాను ఆ సంగతి విన్నప్పుడు. కానీ, వాళ్ళంతా మళ్ళా ఆ జీవితంలో సర్దుకున్నారు. కాని ఆ సర్దుకోవడం ఎట్లాంటిది!
ఆరునెలలకిందట మళ్ళా మా పల్లెకి వెళ్ళినప్పుడు వాళ్ళందరీ కథలూ విన్నాను. ప్రతి ఒక్కరితోటీ మాట్లాడేను. కమలాబాయికి మా పెదనాన్న ఇప్పుడు పెళ్ళి చేసాడు. ఎవరితో? ఒక తిక్కలాడితో. బహుశా, ఆమెని ఒక పిచ్చివాడు తప్ప మరెవరూ పెళ్ళిచేసుకోరనా?
అదంతా ఎవరికో చెప్పుకోవాలని ఉంది. ఎవరికి చెప్పుకోను? వాళ్ళమటుకు వాళ్ళకి తమ జీవితాలగురించి ఎవరికీ చెప్పుకోవాలని లేదు. వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని వచ్చే ప్రభుత్వోద్యోగులకి తప్ప వాళ్ళ కథలు వినడానికి కూడా ఎవరికీ ఆసక్తి లేదు. నేనేమి చెయ్యగలను? బహుశా ఒక వార్త రాయగలను. కాని అది ఒక్కరోజుకి మటుకే వార్త. మర్నాటికి మరో కొత్త వార్త కావాలి ప్రపంచానికి. బహుశా, ఒక కథ రాయగలను. కాని అది వార్తలాగా ఉంది తప్ప కథకాలేదంటాడు విమర్శకుడు.
కానీ, ఏదో ఒకటి బయటకి చెప్పుకోవాలి. చెప్పుకోడం కాదు, వెళ్ళగక్కుకోవాలి. ఊరెళ్ళి వచ్చినప్పణ్ణుంచీ ఒక విషయమే నా చెవుల్లో, గుండెల్లో రొదపెడుతూ ఉంది. పూనాలో తాను బతికిన బతుకు గురించి చెప్తూ కమలక్క చెప్పిన మాటల్లో మరీ ముఖ్యంగా ఆ ఒక్క మాట.
రాత్రి తన దగ్గరికి వచ్చేవాళ్ళకి ఆ కంపెనీ ఒక టోకెన్ ఇచ్చేదిట. ఆ వచ్చినవాడు పడుకుని వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ అక్కడ పెట్టి వెళ్తాడట. తెల్లవారాక, ఆమె, ఆమెలాంటి వాళ్ళు ఆ టోకెన్లు తీసుకుపోయి వాళ్ళ యజమానికి లెక్కచెప్పాలిట.
ఇది, ఇదే, ఈ విషయమే నేను వెళ్ళగక్కుకోవాలి. కాని దీన్నిప్పుడు ఎలా చెప్పను? ఎవరికి చెప్పను? నిలవలేక, నాలోపల దాచుకోలేక, మింగలేక కక్కాను. కథ రాసాను. అన్ని వివరాల్తోనూ రాసాను. ఇప్పుడు ప్రొఫెసరు జ్ఞానప్రకాశానికి ఈ కథ చూపించి శిల్పం సరిగ్గా ఉందా లేదా అని అడుగుదామని వచ్చాను.
నాకేమీ తోచలేదు. లేచి బాల్కనీ అంచుదాకా వెళ్ళాను. గేటు బయట, ఆ అమ్మాయి కారు స్టార్ట్ చేస్తూ ఉంది. నాకు డ్రైవింగు రాదు. ఇంటర్మీడియెట్ అయిపోయాక, నాన్న చదివించనంటే మోటారు డ్రైవింగు నేర్చుకుందామనుకున్నాను. కాని కాలేజిలో చేరడంతో ఆ ఆలోచన పక్కకు పోయింది. ఇప్పుడామె అట్లా కార్లో కూచుని స్టీరింగు మీద చేతులు వేసి హాండ్ గేరు తిప్పడం కోసం ముందుకు సుతారంగా వంగడం కనిపిస్తోంది. అదంతా నాకేదో ఇంగ్లీషుసినిమాలో దృశ్యంలాగా కనిపించింది. కాని ఏం లాభం? భాష అర్థం కాకపోతే కథ కూడా అర్థం కాదు.
కారు బయల్దేరగానే, గేటు దగ్గరగా వేసి ప్రొఫెసరు జ్ఞానప్రకాశం వెనక్కి తిరిగాడు. ఆయనవెనకనే ఆ కుక్కపిల్ల కూడా. దాని నల్లని మూతిమీద సూర్యకాంతి పడి నీటిబొట్టులాగా చిందుతోంది.
మరి కొద్ది సేపట్లో ఆయన మేడమీదకి వస్తాడు.
‘ఆ కథ చదువు వింటాను’ అంటాడు.
చదవలేననిపించింది. ఎందుకో, ఆయన పైకి వచ్చేముందు చెవులకి గ్లోవ్సు తొడుక్కుని వస్తాడనిపించింది.
నా ఎదట కుండీలో మర్రిచెట్టు. ఫార్మ్ ప్రకారం చూసినా, కంటెంట్ ప్రకారం చూసినా కూడా అది మర్రిచెట్టే. కాని, ఎకరాలు ఎకరాల మేరకు ఊడలు దిగి, శాఖోపశాఖల్తో చిట్టడవిలాగ పరుచుకుని ఉండే తిమ్మమ్మమర్రిచెట్టుని చూస్తే కలిగే మహోద్వేగమేదో దాన్ని చూస్తే కలగడంలేదెందుకు? మర్రిచెట్టుని మర్రిచెట్టుని చేసేది మరేదో ఉంది. నీకు మర్రిచెట్టుకింద నిలబడే అనుభూతి చిక్కాలంటే నువ్వు మర్రిచెట్టుకిందకు పోయి నిలబడటం తప్ప మరో దారి లేదు.
Comments
Kam Yk తీరిక సమయంలో చదువుతా.
Reply
1
about an hour ago
Manage
Venkateswara Rao Veluri The last paragraph makes it a brilliant life-story. Moving narration! Thoroughly enjoyed it.
Reply
1
about an hour ago
Manage
Sriramoju Haragopal అభినందనలు.
Reply
1
about an hour ago
Manage
Suparna Mahi ....చాలా నచ్చింది సర్... 
చివర్లో కథనమ్ డిస్కోర్స్ గా మారిపోవడమ్ ఇంకా నచ్చింది 

No comments:

Post a Comment

Total Pageviews