Wednesday, August 23, 2017

త్వరలోనే వినాయక చవితి వచ్చేస్తోంది... మరి వినాయక చవితి విశేషాలు తెలుసుకుందామా.....గణపతి నవరాత్రులలో మనం 21 రకాలపత్రాలతో పూజిస్తాము. మనం పూజించే ఆ పత్రికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి చెప్పుకుందాం!!
21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు

1) మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.
2) బృహతీ పత్రం. భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గను, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.
3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి(షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండూ ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.
5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటూ మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దేని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దెని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.
6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది.
7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది.
ఈరోజుకి ఈ 7 పత్రాలు తెలుసుకున్నాం కదా.. మిగతావి రేపు తెలుసుకుందాము.

No comments:

Post a Comment

Total Pageviews