Thursday, August 3, 2017

అందరికీ శ్రీ హేవిళంబి నామ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

వరలక్ష్మి వ్రతం
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
తాత్పర్యం
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
వరలక్ష్మి వ్రతంరోజున మహిళలు తెల్లవారే నిద్రలేచి ఇళ్ళు , వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలంకరించాలి. గడపలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరుచుకోవాలి.ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు , మామిడి తోరణాలతో అలంకరించాలి.మండపానికి పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి.
మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్నిగానీ, విగ్రహాన్నీగానీ వుంచాలి. బంగారు, వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరుచుకోవాలి. కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పరుచుకోవచ్చు.లేదా బంగారు లేక వెండి ముఖాన్నికూడా కలశంపై పెట్టుకోవచ్చు.
మల్లెలు, మొల్లలు, సంపెంగలు , మొగలి పువ్వులతో కలశాన్ని,మండపాన్ని అలంకరించాలి. పలురకాల పువ్వులు,పండ్లు, పసుపు కుంకుమలు-అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.
వరలక్ష్మి వ్రతంనాడు తొమ్మిది రకాల పిండివంటలు చేసి,ఆ దేవికి నైవెద్యం పెట్టాలని పెద్దలు చెపుతారు. తొమ్మిది రకాలు చేయలేని వారు, తమకు చేతనైనన్ని చేసుకోవచ్చు.
తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.
వరలక్ష్మీ వ్రత కథ
సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.
శ్రావణ శుక్రవారపు పాట
జయమంగళం నిత్య శుభమంగళమ్
౧. కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాది గణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౨. ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు, ఏ వ్రతము పుత్రపౌత్రాభివృద్ధినొసగు
అనుచునూ పార్వతి ఆ హరునియడుగగా పరమేశు డీరీతి పలుక సాగె
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౩. కుండినంబనియెడు పట్నంబులోపల-చారుమతి యనియేటి కాంతకలదు
అత్తమామల సేవ పతిభక్తితో చేసి-పతిభక్తి గలిగున్న భాగ్యశాలి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౪. వనిత స్వప్నమందు వరలక్ష్మీ రాబోయి-చారుమతిలెమ్మనుచు చేత చరిచె
చరచినంతనే లేచి తల్లి మీరెవరని-నామస్కరించెనా నళినాక్షికీ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౫. వరలక్ష్మినీ నేను వరములూ యిచ్చేను-మేల్కొనవె చారుమతి మేలుగాను
కొలిచినప్పుడె మెచ్చి కోరిన రాజ్యముల్-వరములనిచ్చినను వరలక్ష్మినే
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౬. ఏ విధిని పూజను చేయవలెననుచూను-చారుమతియడిగెను శ్రావ్యముగను
ఏమి మాసంబున ఏమి పక్షంబున-ఏ వారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౭. శ్రావణమాసమున శుక్లపక్షమునందు-శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి-భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౮. చారుమతి లేచి యా శయ్యపై గూర్చుండి-బంధువుల పిలిపించి బాగుగాను
స్వప్నమున శ్రీవరలక్ష్మీ చకచక వచ్చి-కొల్వమని పలికెనూ కాంతలారా
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౯. ఏ విధంబున పూజ చేయవలెనన్నదో-బంధువులు అడిగిరి ప్రేమతోనూ
ఏమి మాసంబున ఏమి పక్షంబున- ఏవారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౦. శ్రావణామసమున శుక్లపక్షమునందు-శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి-భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౧. అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను-భక్తితో పట్నము నలంకరించి
వన్నెతోరణులు సన్నజాజులు-మదిచెన్నుగా నగరు శృంగారించిరి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౨. వరలక్ష్మీనోమనుచు వనితలు అందరు-వరుసతో పట్టుపుట్టములు గట్టి
పూర్ణంపు కుడుములు పాయసాన్నములూ-ఆవశ్యముగ నైవేద్యములు బెడుదురు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౩. కండ్రిమండ్రిగనునుండి బలుదండిగా యెంచి-యొండిన కుడుములు ఘనపడలునూ
దండిగా మల్లెలు ఖర్జూర ఫలములూ-విధిగ నైవేద్యములు నిడుదురూ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౪. నిండు బిందెలతోను నిర్మలా ఉదకులు-పుండరీకాక్షులకు వారుపోసి
తొమ్మిదిపోగుల తోరమొప్పగపోసి-తల్లికి కడు సంభ్రమముతోడను
౧౫. వేదవిదుడయినట్టి విప్రుని పిలిపించి, గంధమక్షతలిచ్చి కాళ్ళుకడిగి
తొమ్మిది పిండివంటలు తోమొప్పగబెట్టి, బ్రాహ్మణునకు పాయసముబెట్టుదూరు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!






No comments:

Post a Comment

Total Pageviews