Tuesday, August 22, 2017

Heralal mastaru vadrevu chinaveerabhadrudu

ఆదివారం కర్నూల్లో హీరాలాల్ మాష్టారికి కర్నూలు జిల్లా రచయితల సంఘం, సాహితీమిత్రులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. మద్దూరు నగర్ లో పింగళి సూరన తోట లో జరిగిన సమావేశానికి ఊహించనంతగా సాహిత్యాభిమానులు తరలివచ్చారు.
మాష్టారి పేరుమీద కుటుంబసభ్యులు ఒక స్మారకపురస్కారాన్ని ఏర్పాటు చేసారు. మొదటి పురస్కారాన్ని పుల్లా రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడికి అందచేసారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజనులో మద్దికెర మండలంలో పెరవలిలో జిల్లా ప్రజాపరిషద్ ఉన్నత పాఠశాలలో రామాంజనేయులు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన పాఠశాల పిల్లల్ని సృజనాత్మక రచన వైపు మరల్చడానికి చేస్తున్న కృషికి లభించిన పురస్కారం అది. రామాంజనేయులు 2016 లో 'సృజన' పేరిట పెరవలి పిల్లల కథలు, 2017 లో 'జాగృతి' పేరిట పెరవలి బాలికల కథలు సంకలనం చేసి వెలువరించాడు. మాష్టారి పేరుమీద ఏర్పాటు చేసిన పురస్కారం ఆ ఉపాధ్యాయుడికి లభించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.
ఆ సభ ఎంతో కల్యాణప్రదంగానూ,ఎంతో స్ఫూర్తిమంతంగానూ సాగింది. మాష్టారి పిల్లలు విద్యారణ్య కామ్లేకర్, వివేకానంద, వైదేహి, సీతామహాలక్ష్మి, భారతి, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో, గౌరవంతో ఆ సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి గన్నమరాజు సాయిబాబా, గ్రంథాలయ ఉద్యమనేత, గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు, నా చిరకాలమిత్రులు చంద్రశేఖర కల్కూర, తెలుగు భాషా వికాస ఉద్యమం రాష్ట్రకార్యదర్శి డా.జె.ఎస్.ఆర్.కె.శర్మ, గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు గంగాధర రెడ్డి, మరెంతమందో మాష్టారి మిత్రులు, అభిమానులు ఆ సభలో పాల్గొన్నారు.
మాష్టారిని తలుచుకుంటూ మొదటి స్మారక ప్రసంగం చేసే అదృష్టం నాకు లభించింది. ఆ ప్రసంగం రికార్డు చేసి వినిపించమని నా మిత్రులు కోరారు కాని, ఆ ప్రసంగమంతా ఆగని కన్నీటిధార మధ్య,పూడుకుపోయిన గొంతుతో సాగింది. మాష్టారి గురించి చాలా చాలా మాట్లాడాలనుకున్నాను. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడిగా, అన్వేషిగా, అద్వైతిగా ఆయన సాగించిన ప్రయాణం గురించి చెప్పాలనుకున్నాను.
కాని నన్ను వేదిక మీదకు పిలుస్తూనే నా సోదరుడు విద్యారణ్య 'ఋషిలాంటి మా నాన్న... ' అంటూనే నా హృదయంలో చెప్పలేని ఉత్తాప తరంగమొకటి ఎగిసిపడింది.
'మా నాన్న..' అనవలసింది నేను కదా.
అవును. ఆయన నాకు తల్లి, తండ్రీ కూడా. ఆయన తన పిల్లలకు పెట్టవలసిన అక్షరాల అన్నం ముద్దలు నాకే తినిపించారు. 75-78 మధ్యకాలంలో ఆయన ఏ పరిస్థితుల్లో కర్నూలు వదిలిపెట్టి తాడికొండ గురుకుల పాఠశాలలో చేరారో తెలిసిన తర్వాత, ఆ రోజుల్లో ఆయన మాకోసం తన ప్రేమసర్వస్వం, జ్ఞాన సర్వస్వం ఎట్లా ధారపోసారో కళ్ళారా చూసిన నాకు, ఆయన గురించి ఇవ్వాళ చెప్పడానికి కన్నీళ్ళు తప్ప మాటలు రావడం లేదు.
ఆయన వల్ల సాహిత్యం గురించి తెలుసుకున్నానని చాలాకాలం అనుకున్నాను. కాని, ఆ రోజుల్లో ఆయన నన్ను తల్లిలాగా కాపాడుకున్నాడని నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నా హైస్కూలు రోజుల్లో నేను తరగతిలో అన్నింటా మొదటిస్థానంలో ఉండేవాణ్ణి. చదువులోనే కాదు, వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, ఏకపాత్ర- ఎప్పటికప్పుడు మా స్కూలుకి ప్రైజులు తెస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నా సహాధ్యాయులు నా పట్ల చాలా అసూయగా ఉండేవారు. ముప్పై మంది ఉండే నా తరగతిలో ఏ ఒకరిద్దరో తప్ప మరెవ్వరూ నాతో మాట్లాడేవారు కారు. అక్కడితో ఆగకుండా ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను కొడుతూనే ఉండేవారు. నేను పొట్టిగా,అర్భకంగా ఉండేవాణ్ణి. వాళ్ళ చేతుల్లో తన్నులు తినడం తప్ప మరేమీ చెయ్యలేకపోయేవాణ్ణి. తమ అసూయ వల్ల తామట్లా చేస్తున్నామని కూడా తెలియని పసితనం వాళ్ళది. అది గ్రహించినట్టున్నారు మాష్టారు. అందుకని, స్కూలు అయిపోవడమేమిటి, నన్ను తనతో తీసుకుపోయేవారు. ఆటస్థలంలో కూడా ఆటలనెపం మీద పిల్లలు ఎక్కడ కొడతారో అని, నన్ను మా స్కూలు వెనక ఉన్న పత్తిచేలమ్మటా, పంటపొలాలమ్మటా తిప్పుతూ సుమిత్రానందన్ పంత్ గురించీ, నిరాలా గురించీ, టాగోర్ గురించీ చెప్తూండేవారు. నా దగ్గర డబ్బులుండేవి కావు. మూడునెలలకొకసారి మా నాన్నగారు పదిరూపాయలు మనియార్డరు చేసేవారు. ఆ రోజుల్లో మాష్టారు మా స్కూల్లో టక్ షాపు ఇంఛార్జి. అందుకని ఆ షాపులో నాకేమి కావాలో తీసుకొమ్మనేవారు. ఇవన్నీ గుర్తొచ్చి నేను మాట్లాడుతున్నంతసేపూ నాకు కళ్ళనీళ్ళాగలేదు...
సాహిత్యంలోనూ, చరిత్రలోనూ మాష్టారు చేసిన కృషి నిజంగా వెలుగు చూడనే లేదు. అసంఖ్యాకమైన ఆయన వ్యాసాలు, రేడియో ప్రసంగాలూ, ప్రవచనాలూ పుస్తకరూపంలో రాకపోవడం తెలుగు సాహిత్యానికి తీరే లోటు కాదు. కాని ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన పరిశోధన మూడునాలుగు పుస్తకాలుగా వెలువడటం ఒకింత ఊరట. 'వ్యాసమణిహారం'. 'శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి చరిత్ర ' (1993), 'పరంజ్యోతి వెలుగులు-పరమాత్మ రూపాలు'(2009) తెలుగు ఆధ్యాత్మిక వాజ్మయంలో అత్యంత అపురూపమైన గ్రంథాలు.
ఉరుకుంద ఈరణ్ణ స్వామి చరిత్ర ని నేను మా మాష్టారు శరభయ్యగారికి పంపిస్తే ఆయన ఎంతో భావోద్వేగభరితంగా ఉత్తరం రాసారు. అప్పట్లో ఆయన బసవేశ్వర వచనాలను సంస్కృతంలోకి అనువదిస్తూ ఉన్నారు. తన జీవితమంతా కాళిదాసకవిత్వపు కౌగిలింతలో గడిపినందువల్ల, బసవన్నకు తాను తన మనసులో తగిన చోటు ఇవ్వలేకపోయానేమో అని ఆయనకి ఒకింత దిగులుండేదేమో. అందుకని, హీరాలాల్ మాష్టారి పుస్తకం చదవగానే, ఒకచేత క్షీరభాండంతో, మరొక చేత బెత్తంతో బసవన్న తనని చేరవచ్చినట్టుందని రాసారు.ఆయన ఇటువంటి మాట తన గురువుగా భావించే విశ్వనాథ గురించి కూడా ఎన్నడూ అనడం నేను వినలేదు. హీరాలాల్ మాష్టారి వాక్కు ఎంత పునీతమైందో ఇంతకన్నా మించిన దృష్టాంతం నాకు అవసరం లేకపోయింది.
నేను మాష్టార్ని తలచుకోగానే నా గుండె బొంగురుపోవడానికి ఆయన నా పట్ల చూపిన ప్రేమ ఒక్కటే కారణం కాదు. ఆయన నాకు అన్నిటికన్నా ముఖ్యంగా స్వాతంత్ర్య విద్య నేర్పారు. ఆ విద్యనే ఆయన జీవితమంతా అనుష్టిస్తూ వచ్చారు కాబట్టి. ఆయన చేసిన ఆధ్యాత్మిక యాత్ర మామూలు అర్థంలో వైరాగ్య యాత్ర కాదు. అది ఎప్పటికప్పుడు తనని తాను స్వతంత్రంగా నిలుపుకోవడానికి కావలసిన ఆధారం కోసం వెతుకులాట. 'నేను ఏ వర్గానికి చెందనివాడను, ఏ ఆశ్రమ వ్యవస్థలోని వాడను కాను, సర్వాంతర్యామి అయిన, సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మకు దాసానుదాసుడను ' అని రాసుకోగలడం కోసం చేసిన అన్వేషణ.
బహుశా, ఆ స్వతంత్రతాస్థితిని చేరుకోగలినప్పుడే, నేను ఆయన శిష్యుణ్ణని చెప్పుకోగలుగుతాను.

No comments:

Post a Comment

Total Pageviews