Thursday, August 24, 2017

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.
మొన్న,నిన్న కలిపి 14 రకాల పత్రులు గురించి తెలుసుకున్నాం మరి మిగిలిన 7 రకాల పత్రుల గురించి తెలుసుకుందామా!!
15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.
16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.
17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.
18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.
19) ఆశ్వత్థపత్రం: దీనినే రావి అనికూడా అంటారు. . తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.
20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.
21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది.

No comments:

Post a Comment

Total Pageviews