Tuesday, March 15, 2016

                        ఔషధాల పెట్టె మన పోపులపెట్టె

పోపుల పెట్టె.. దీన్నే నిపుణులు ఔషధాల పెట్టె అంటున్నారు. నిత్యం వంటకాల్లో వాడే ఈ దినుసులు వంటకాలకు ఘుమఘుమలూ, రుచినివ్వడానికే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఆకలిని పెంచి.. నోటిని శుభ్రం చేసే ఈ దినుసులు అమోఘమైన పోషకాల మిళితం.
మిరియాలు: బెల్లం, మిరియాలూ నూరి చిన్న ఉండలా చేసి దవడన పెట్టుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. మిరియాల పొడిని పాలలో కలిపి తీసుకున్నా దగ్గునుంచీ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లూ అదుపులోకి వస్తాయి. జీర్ణశక్తీ బాగుంటుంది.

యాలకులు: వీటిని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.దంతాలూ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, జీర్ణసమస్యలూ అదుపులోకి వస్తాయి. తలనొప్పి తగ్గాలంటే ఇలాచీ టీ తాగితే మంచిది.

మెంతులు: వీటిలో పీచు అధికం. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీవక్రియలూ, జీర్ణ ప్రక్రియలు మెరుగుపడతాయి. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. బాలింతలు తింటే పాలు వృద్ధి అవుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ దూరమై.. రక్తం శుద్ధి అవుతుంది. హైపర్‌థైరాయిడ్‌ ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది.

ధనియాలు: వంటల్లో వాడటం వల్ల గ్యాస్‌ పెరగకుండా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. జర్వం వచ్చినప్పుడు ధనియాలతో చేసిన రసం, కషాయం వంటివి ఇవ్వడం వల్ల త్వరగా తగ్గుతుంది. వీటిలో ఎ, డి1, బి2 విటమిన్లూ, ఇనుము అధికంగా ఉంటాయి. ధనియాలూ లేదా కొత్తిమీరతో చేసిన రసం తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇక, ధనియాల్లోనూ పీచు సమృద్ధిగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి వీటి సొంతం. థైౖరాయిడ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ధనియాలు తీసుకుంటే మంచిది.

జీలకర్ర: వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో జీలకర్ర కీలకపాత్ర పోషిస్తుంది. జీలకర్రలో ఇనుము లభిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్నిస్తుంది. రక్తవిరేచనాలతో బాధపడేవారు జీలకర్ర రసం తీసుకుంటే మంచిది. భోజనం తరవాత జీలకర్రను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల చక్కగా జీర్ణమవుతుంది.

ఆవాలు: వీటిలో ఇనుము, జింక్‌, క్యాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఆవాల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మితంగా వాడటం మంచిది.

కారం: ఘాటైన మిరపకు వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. కారంలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు నుంచీ త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పసుపు: పసుపును తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలను ఇందులోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎసిడిటీ ఉన్నవారు పసుపును నీళ్లలో కలుపుకుని తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అజీర్తి దూరమవుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాళ్లవాపులూ, కీళ్లనొప్పులూ తగ్గుతాయి
.

ఇంగువ: రోజూ చేసే వంటల్లో ఇంగువ వాడటం వల్ల గ్యాస్‌ సమస్యలు ఇబ్బంది పెట్టవు. కడుపునొప్పి, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, నరాల బలహీనత వంటివి తగ్గుముఖం పడతాయి.
లవంగాలు: గొంతు గరగర బాధిస్తున్నప్పుడు లవంగాలు చప్పరిస్తే మంచిది. ఆస్తమా ఉన్నవారు లవంగాలను నీళ్లలో మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పి ఉన్నవారు లవంగ నూనె వాడితే త్వరగా నొప్పి తగ్గుతుంది.

దాల్చిన చెక్క: వాంతులవుతున్న భావన కలిగితే దాల్చినచెక్క చప్పరించాలి. పంటినొప్పీ, చిగుళ్ల వాపునకు దాల్చినచెక్కపొడి బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలోనూ దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది.

                                      (ఈనాడు పేపర్ లోని ఆర్టికల్ ఆధారంగా)

No comments:

Post a Comment

Total Pageviews