మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి. స్కంద పురాణం ప్రకారం నాలుగు రకాల శివ రాత్రులు. ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి, మాస శివరాత్రి. మాఘ మాసంలో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి.
శివపద మణిమాలలో 'శి' అనగా శివుడనియు 'వ' అనగా శక్తి రూపమని చెప్పబడియున్నది. ఈ "శివరాత్రినాడు" విశేషమైన కాలం "లింగోద్భవకాలం" ఈ కాలం రాత్రి 11-30 నుండి ఒక గంట వరకు ఉంటుందట! ఈ సమయంలో నిర్గుణ, నిరాకార పరబ్రహ్మ, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామియైన లింగరూపంలో నుండే మహాశివుని - ఓం నమశ్శివాయః అంటూ శివపంచాక్షరీ స్తోత్రంతో కొలుస్తూ, "పార్థివ లింగానికి" మొదటి జాములో పాలతోను, రెండవజాములో పెరుగుతోను, మూడవ జామునందు నెయ్యితోను, నాల్గవ జామునందు తేనెతోను అభిషేకములొనర్చిన విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.
లింగోద్భవం గురించిన అనేక ఉదాంతాలను మన పురాణాలు ఊటంకిస్తున్నాయి. అందులో ప్రధానమైనది, ఒకసారి బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి చేరుకుంటుంది. వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇరువురికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యముతో "మాఘమాసం చతుర్దశినాడు" వారి ఇరువురకు మధ్య "జ్యోతిర్లింగంగా" రూపుదాల్చుతాడు.
వారు ఇరువురు ఆలింగం యొక్క ఆద్యంతాలను కనుగోనవలెనని విష్ణుమూర్తి వరాహరూపందాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూవెళ్ళగా, బ్రహ్మదేవుడు హంసరూపందాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణువేడుకుంటారు. అప్పుడు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టడంతో, బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యింది.
No comments:
Post a Comment