Sunday, March 6, 2016

మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ *మహా శివరాత్రి* శుభాకాంక్షలు.
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.!!

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు.
శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే I
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ II
" మాట, అర్థం ..ఒకదానినొకటి విడచి ఉండవు ఆ విధంగా కలసి ఉండే పార్వతీ పరమేశ్వరులు ఈ జగతికి తల్లిదండ్రులు.  వాక్కు(మాట) అర్థం సమృద్ధిగా సమకూర్చడానికి. ఆ పార్వతీ పరమేశ్వరులకు శిరస్సు వంచి  నమస్కరిస్తున్నాను".
ఈరోజే శివ పార్వతులకుకల్యాణం జరిగినరోజు. అందుకే ప్రతి గుడిలోను  శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, కల్యాణం చూసి లింగోద్భవ కాలం వరకు  జాగారం చేసి అనంతరం పూజ నిర్వహించి శివ పంచాక్ష్యారి మంత్రంతో గాని, భజనలతో గాని శివ పురాణం వింటూ గాని జాగరణ చేస్తారు..
ఆ పరమ శివుని అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా వుండాలని కోరుకొంటూ ....
విస్సా మణిసాయి
- విస్సా ఫౌండేషన్..  

No comments:

Post a Comment

Total Pageviews