Monday, March 14, 2016

ఒక గ్రామంలో ఊరుచివర ఒక మర్రిచెట్టు క్రింద ఒక సాధువు తపస్సు చేసుకొంటూ ఊరు వారు పెట్టిన భిక్షతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి మంచిసిద్ధులు, మహిమలు ఉన్నాయని ఆ గ్రామంలో వాళ్ళు నమ్మేవారు.
ఒకరోజు అక్కడికి దగ్గరలోని ఒక ఇంటిఅరుగు మీద ఒక కుక్క పడుకొని ఉంటే అది చూసి ఇంటియజమాని ఇంట్లోంచి ఒక కొరకంచు తీసుకొచ్చి దాంతో కుక్కని గట్టిగా కొట్టాడు. ఆకొరకంచు తగిలినదెబ్బకు, దానివల్లకాలిన మంటకు ఆకుక్క చాలాబాధగామొయ్యో మంటూఅరుస్తూ ఆసాధువు ఉండే చెట్టుకేసి పరిగెత్తింది..
అదిగమనించినసాధువుకు కుక్కపరిస్థితికి చాలా జాలికలిగింది. అతను ఆకుక్క పైని కమండలంలోని నీళ్ళుచల్లి యిలాఅన్నాడు. చూడు, నిన్ను ఆ యింటి యజమాని నిష్కారణంగా బాధించాడు. అతనికి ఏం శిక్ష వెయ్యమంటావో చెప్పు అని అడిగాడు.
దానికి ఆ కుక్క యిలా బదులు చెప్పింది. స్వామీ అతన్ని అనుకొని ఏం లాభం, నేను పూర్వజన్మలో చేసుకొన్న పాపం నన్ను బాధిస్తోంది. అలాకాదు అతను ఏ కారణం లేకుండానిన్ను బాధపెట్టాడు.ఏదోఒక శిక్ష చెప్పు అన్నాడు సాధువు.
అప్పుడు కుక్క అంది మహానుభావా అయితే ఆ యింటి యజమాని ఏదైనా ఒక మంచి దేవస్థానంలో ఉద్యోగిగా కుదురుకొనే ఏర్పాటు చెయ్యండి అని. సాధువు అదేమిటి అలా అంటావు శిక్ష అడిగితే నువ్వు అతనికి దేవాలయంలో ఉద్యోగం ఇప్పించామంటున్నావేమిటి అన్నాడు.
ఏంచెప్పమంటారు స్వామీ నేనుగతజన్మ లో ఒక దేవస్థానంలో ఉద్యోగిని. అప్పుడు నేను చెయ్యని తప్పుడుపనులులేవు. దేవుడంటే భీతి ఉండేది కాదు. పాపభయం లేకుండా దేవుడి సొమ్ముని తినేసేవాడిని. ఎందరినో భక్తులను, అర్చకులను అవమానించేవాడిని. వేదపండితులను చులకనగా చూసే వాడిని. ఆశ్రితులను, లంచం ఇచ్చేవారిని గౌరవంతో చూసేవాడిని. వారికి శీఘ్రమే దైవదర్సనం కల్గించేవాడిని. ఇదిగో ఆ పాపాల ఫలితమే ఇప్పుడీ కుక్క జన్మ. వాడు కూడా నాలాగే అవుతాడు అదే వాడికి శిక్ష అంది.

No comments:

Post a Comment

Total Pageviews