Thursday, October 5, 2017

*0* (సున్న) విలువ

*0* (సున్న) విలువ
రచయిత: మద్దూరు లక్ష్మీ నరసింహా రావు, హైదరాబాదు, భారత దేశం
(తెలుగు కళాసమితి వారి సారస్వత మాస పత్రిక *జ్యోతి* లోని ప్రచురణ కి నకలు)
*0*కి విలువెంత అని పంతుల్ని అడిగితే 
*సున్నా*కి విలువేంటి? శూన్యమంటాడు!
*0* లేకుండా *పంతులూ* లేడు!
ఏ *పండితుడూ* లేడు!
*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!
*సున్న* ప్రక్కన *0*చేరి *సున్నం* అయ్యె!
*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!
*ఆంధ్రా*లో *అన్నబియ్యం* కూడా కిలో *రెండు* అయ్యె!
*పది* మధ్యలో దూరి *పంది*గా మారె!
*నది* మధ్యలో దూకి *నంది*గా మారె!
ప్రతి *కొంప*లోనూ అది తిష్ట వేసింది!
*0* లేనట్టి *సంసారమే* లేదు!
*కాంగి* లోనూ దూరె! *దేశం* లోనూ దూరె!
అది రాజకీయం కూడా నడుపుచుండె!
*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ!
*గుండుసున్నా* అని ఎగతాళి చేయకు
*గూండా*గా మారి రుబాబు చేయు!
*ఆరంభము*న *0*! *అంత*మందున *0*!
*జననం*లో *0*! *మరణం*లో *0*!
*శూన్యం*లో *0*! *అనంతము*లో *0*!
*ఇందూ*, *అందూ* అను సందేహమేల!
*అండ*, *పిండ*, *బ్రహ్మాండము*లలో *0*!
*సత్యం*, *శివం*, *సుందరం*
అన్నింటిలోనూ అది అలరారుతోంది!
*0* తోటే ఉంది *అందం*! *ఆనందం*!
*జీవితం*లో చివరకి మిగిలేది *0*!
*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!
*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!
నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!
తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ*లోనూ *0*!
తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు*లోనూ *0*!
ఇంత మహిమ గల *0* -
మరి *గుడి*లోను లేదని, *బడి*లోను లేదని
దిగులెందుకన్నా!
*గుడి*లోన జేరి *గుండి*గా మారడం,
*బడి*లోన జేరి *బండి*గా మారడం
దాని *అభిమతం* కానే కాదన్నా!
కనుక గుడి *గంట*లో చేరి, బడి *గంట*లో చేరి
మోత మోగిస్తోందన్నా! ఆ మోత *నాదం*లోనూ *0*!
*కాలం*తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి *గంట*, ప్రతి *దినం*, ప్రతి *వారం*,
ప్రతి *పక్షం*, ప్రతి *మాసం*, ప్రతి *సంవత్సరం*,
అన్నిటా ఉండి *కాలచక్రము*నే అది తిప్పుతోంది!
*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ
*పంచాంగం* అంతా *సున్నా*ల మయమే!
*దేహం*తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
*కంటి*లోనూ *0*! *పంటి*లోనూ *0*!
*కంఠం*లో *0*! *కండరం*లో *0*!
*చర్మం*లో *0*! *రక్తం*లో *0*!
*దాహం*లో *0*! *మోహం*లో *0*!
*రాగం*లో *0*! *అనురాగం*లో *0*!
*సరసం*లో *0*! *విరసం* లో *0*!
*కామం*లో *0*! *క్రోధం* లో *0*!
*నరనరం*లో అది *జీర్ణించుకు*ని పోయె!
*రోగం*లో *0*! దానికి చేసే *వైద్యం*లో *0*!
*అంగాంగము*న *0* అంటిపెట్టుకుని ఉండ
*దేహం* తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది *గంతు*లేస్తోంది!
ఆంగ్లేయ భాషలో అది ఓ రూపమును దాల్చె!
*సున్నాలు* ఉంటే *గుడ్*, సున్నాలు లేకుంటే *బాడ్*
అని ఇంగ్లీషు బాబులకు కూడా తెలుసు!
*సున్నాలు* లేకుంటే వారికి *ఫుడ్* లేదు!
అసలు *గాడ్* బొడ్డున *0* గడ్డకట్టుకొనుండె!
*సున్నా*కి విలువ లేదనకు బాబూ!
బాబు మధ్యన దూరి *బాంబు*గా మారు!
పిచ్చి *పంతులు* సున్నాకి విలువ లేదంటే...
రెచ్చిపోయిన *0* విశ్వరూపము దాల్చె!
కవిత రూపమున నా నోట పలికించె!

No comments:

Post a Comment

Total Pageviews