చేపల్ని చెట్లెక్కిస్తున్నామా?
‘నేను డిగ్రీ చేస్తే చాలనుకున్నా. కానీ అమ్మానాన్నా విన్లే. నేను ఎంబీబీఎస్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. నేను ఇక్కడ పోటీ తట్టుకోలేకపోతున్నానని చెప్పినా విన్లేదు. అందుకే.. ఇక్కడి నుంచి పారిపోయా!’ - అంటోంది సాయి ప్రజ్వల!! గత వారం పదిరోజులుగా తెలంగాణలో ఈ అమ్మాయి ఆచూకీ గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వెళుతూ రాసిన లేఖలో తమ ‘కోచింగ్ కాలేజీ’లో ఉన్న విపరీతమైన ఒత్తిడి గురించి ప్రస్తావించడం ఇందుకో కారణం!! ప్రజ్వల ఎలాగోలా పోలీసుల కంటపడ్డా.. ఇంటికి మాత్రం వెళ్లేది లేదని భీష్మించుకుంది. ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలోనే తలదాచుకుంటోంది. అయినా తల్లిదండ్రులపై ఈ అమ్మాయికి ఇంత కోపం ఎందుకు? మన ఇంటి కంటిపాపలకి కనురెప్పల్లాంటి మనపై ఇంత కినుకేమిటీ?
ఒక్క ప్రజ్వలే కాదు.. వద్దువద్దంటున్న పందెం కోళ్లలా తమని ఐఐటీ, ఎంబీబీఎస్ సీట్ల సాధన బరిలోకి దింపుతున్న టీనేజీ పిల్లలందరిలోనూ ఇలాంటి కోపమే కనిపిస్తోంది. కోపం కాకపోతే.. బాధా, ఆక్రోశం, దుఃఖం ఏదైనా!! వీటికి కారణాలేమిటీ? పిల్లలకి ఓ మంచి కెరీర్ అందివ్వాలనుకునే క్రమంలో మనం తప్పటడుగు వేస్తున్నామా? ఆ తప్పటుడుగు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తెస్తున్న మార్పులేమిటీ? తల్లిదండ్రులుగా మన ఆందోళనల్ని కొన్ని విద్యాసంస్థలు ఎలా వాడుకుంటున్నాయి?
పోటీ తత్వం మంచిది కాదా?పాతికేళ్ల కిందటి మాట. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో ఉన్న పెద్ద కరవు రాష్ట్రం. ఆర్థిక సంస్కరణలూ, దాంతోపాటూ వచ్చిన ఐటీ బూమ్ తెలుగువారి దృక్పథాన్ని మార్చాయి. హైటెక్ సిటీ వచ్చింది. రైతు కొడుకు రైతే కావాలనే పాత పోకడ మారి.. అందరూ ఐటీ, అనుబంధ రంగాలబాట పట్టారు. తొలితరం కంప్యూటర్ చదువుల్లోకి వెళ్లినవాళ్లందరూ అంతవరకూ వూహించలేని మంచి జీతాల్లో కుదురుకున్నారు. తలసరి ఆదాయం పెరిగింది. దేశ ఆర్థికపటంలో తెలుగుప్రాంతం చక్కటి ఆదాయ చిత్రంగా వెలిగింది! అభివృద్ధితోపాటే చదువుల్లోనూ మార్పులొచ్చాయి. ప్రభుత్వం పరోక్షంగా ఐటీ రంగానికి సుశిక్షిత సిబ్బందిని ‘సులువుగా’ అందించే ప్రైవేటు విద్యాసంస్థల్ని ప్రోత్సహించింది. ఐఐటీ సీట్లలో తెలుగు జెండా రెపరెపలాడటం మొదలుపెట్టింది. ఇంతటి మార్పుకి కారణం మన ఉమ్మడి పోటీ మనస్తత్వమే! అలా 2000ల మొదట్లో ఐటీరంగంలో స్థిరపడినవాళ్లూ, లేకపోతే ఆ రంగం అభివృద్ధిని చాలా దగ్గరగా చూసి అందులోకి వెళ్లలేక ఉసూరుమన్నవాళ్ల తరం ఒకటుంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చాలా దగ్గరగా చూశారు గనక.. అది తమ జీవితంలోనూ వచ్చితీరాలని తపిస్తున్న తరం ఇది. కాస్త అటూఇటూగా ఆ తరానికి చెందినవాళ్ల పిల్లలే ఇప్పుడు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. 2000లలో ఎంతోకొంత అభివృద్ధికి ఉపయోగపడ్డ కోచింగ్ చదువులు.. ఈ తల్లిదండ్రుల అత్యాశని సొమ్ముచేసుకోవడం మొదలుపెట్టాయి. పిల్లల మనస్తత్వం, ఇష్టాలని పట్టించుకోకుండా అనారోగ్యకరమైన పోటీని తీసుకొచ్చాయి. చేపల్లాంటి పిల్లల్ని చెట్లెక్కిస్తున్నాయి. సింహాల్లాంటివాళ్లని ఆకాశంలోకి ఎగరమంటున్నాయి.
పోటీ మంచిదే కానీ..
మానవులు.. ప్రవృత్తిపరంగా పోటీజీవులు. మానసికంగా, శారీరకంగా, ఉద్వేగపరంగా పరిస్థితుల్ని తట్టుకోగలవాళ్లే ఇక్కడ మనగలరు. ముఖ్యంగా భారతదేశంలాంటి చోట వనరులు తక్కువ.. జనాభా ఎక్కువ. కాబట్టి ఇక్కడ ప్రతిదానికీ పోటీ తప్పదు. చిన్నపిల్లల్లో ఆ పోటీతత్వాన్ని నూరిపోయకా తప్పదు. ఆ పోటీ మనస్తత్వం మనకి మనం ప్రణాళికాబద్ధం కావడానికి, నిత్యం చురుగ్గా, అప్రమత్తంగా ఉండటానికీ తోడ్పడుతుంది. సమస్యంతా అది అనారోగ్యకరంగా మారడంతోనే. అలా మారకుండా మనం ఏం చేయాలి?
* మనస్తత్వాన్ని బట్టే : మన చుట్టూ రెండురకాల విద్యాసంస్థలు ఉంటాయి. ఒకటి.. పిల్లల్లో పోటీ పెంచి వాళ్లకి చదువు నేర్పించేవి(కాంపిటీటివ్ లెర్నింగ్). రెండోవి.. పరస్పర సహకారంతో విద్య చెప్పించేవి(కో-ఆపరేటివ్ లెర్నింగ్). మీ పిల్లలు పోటీని తట్టుకోలేరు.. స్వభావరీత్యా సున్నిత మనస్కులు అనుకుంటే ఇలాంటి బడుల్లోనే చేర్చండి. మరి ఇలాంటివాళ్లు జీవితంలో విజయం సాధించడం ఎలా అంటారా? సందేహం అక్కర్లేదు. తప్పకుండా వాళ్లదైన రంగంలో అద్భుతాలు చేస్తారు.
* పోటీవేరు పోలికవేరు : తల్లిదండ్రులుగా మనం పోటీతోపాటూ పోల్చుకోవడాన్నే నేర్పిస్తున్నాం. అది మానుకోవాలి. ఇది ఆత్మన్యూనతా, అసూయల్నీ పెంచుతుంది. కాబట్టి.. ఏవిషయంలోనూ ఎదుటివాళ్లతో పోల్చకుండా చూడండి. వాళ్లని వాళ్లే అధిగమించేలా ప్రోత్సహించండి. మీపాప సైన్స్ సబ్జెక్టులో 35 మార్కులతో అందరికంటే చివరి ర్యాంకు సాధించింది అనుకుందాం. రెండోసారీ చివరి ర్యాంకే. కానీ 50 మార్కులు తెచ్చుకుంది. మిగతావారికంటే తనది తక్కువ మార్కు కావొచ్చు.. కానీ తనని తాను అధిగమించింది కదా! దానిపై దృష్టిపెట్టండి. తన ప్రయత్నాన్నీ, ఆ ప్రగతినీ అభినందించండి.
* ఓటమి చవిచూడనివ్వండి! : అవును.. అపజయం మనం తిరిగి ఎలా కోలుకోవాలో నేర్పిస్తాయి. దీన్నే ‘రీసలియంట్’ అంటారు ఆంగ్లంలో. అనుకున్న లక్ష్యం చేరుకోలేనప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో చెప్పండి. ఆ బాధని పట్టుదలగా ఎలా మార్చుకోవాలో వివరించండి. అవే పిల్లల్ని ఆత్మహత్యలదాకా వెళ్లకుండా చూస్తాయి.
* పోటీ తాత్కాలికంగానే : పోటీ మనస్తత్వం ‘తాత్కాలికంగానే’ ఉండాలి. పరీక్షలైతే ఓ నెల. క్రీడలైతే ఓ గంట అంతే! ఆ తర్వాత వాళ్లు మామూలు విద్యార్థుల్లా ఆడుతూపాడుతూ ఉండాలి. విపరీతమైన పోటీ ఉన్న అమెరికా వంటి చోట్ల ఇలాగే చేస్తున్నారు. మనదగ్గర అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఎనిమిదో తరగతి నుంచే.. దాదాపు ప్రతిరోజూ మనం ర్యాంకుల కోసమే తపిస్తున్నాం. పిల్లలు కనీస ఆనందాలు కూడా కోల్పోయి.. విపరీతమైన ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నాం.
* అందుకే: కనీసం ఆటస్థలం, వార్షికోత్సవం, ఫేర్వెల్ పార్టీలు.. ఇవేవీ లేని విద్యాసంస్థల్లో మీవాళ్లని చేర్చకండి. ఒకప్పుడు మనకి కోచింగ్ కాలేజీల అవసరం ఉండొచ్చు. ఇప్పుడు వాటి వెర్రితలల వల్లే.. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులు ఆత్మహత్యల దాకా వెళుతున్నారని తెలుసుకోండి. భవిష్యత్తుకి తగ్గట్టు తీరు మార్చుకుంటేనే వాటి మనుగడ సాధ్యమనే పరిస్థితి.. తల్లిదండ్రులుగా మీరే కల్పించండి!
* విదేశాల్లో ‘హయాటస్’ సంస్కృతి పెరుగుతోంది. అంటే చదువుల ప్రయాణంలో కొంతకాలం విరామం తీసుకోవడం. అది మనం కూడా చేయొచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత ఓ ఏడాది, పోనీ కనీసం ఓ సెమిస్టర్ కాలం వాళ్లని చదువులకి దూరంగా ఉంచండి. వాళ్లకి పూర్తిగా కొత్తగా ఉన్న ఏ గ్రామంలోనో, ఇంకేదైనా ప్రాంతంలోనో ఉంచండి. జీవితమంటే చదువొక్కటే కాదని తెలుస్తుంది. అమ్మో ఒక్క ఏడాదా అంటారా? వాళ్లకి వందేళ్ల సరిపడా జీవిత పాఠాలని ఈ ఒక్క ఏడాది నేర్పిస్తుంది!
21వ శతాబ్దపు బాల్యవివాహాలివి!
అవును.. నేటి ఐఐటీ కోచింగులన్నవి పిల్లల అభిరుచీ, ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా చేసే బాల్య వివాహాల్లాంటివే! పుట్టే ప్రతివాళ్లకీ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఆసక్తి ఉండకపోవచ్చు. వాళ్లకి సంబంధించిన రంగాలు ఇంకేవో కావొచ్చు. ఆరో తరగతికి వచ్చేటప్పటికే అది బయటపడుతుంది. తొమ్మిది, పదో తరగతిల్లో ఏ తల్లిదండ్రికైనా ఓ స్పష్టత వస్తుంది. దాన్నిబట్టే మనం వాళ్లకి తగ్గ రంగాలని ఎన్నుకోవాలి. కానీ ఐఐటీ కోచింగ్‌ల పేరుతో మనం ఆరోతరగతి నుంచే ఒక్క లెక్కలు, సైన్స్ తప్ప ఇంకేవీ నేర్పించడం లేదు. అలా ఉంటే వాళ్ల అభిరుచేమిటో ఎలా తెలుస్తుంది? తాము సహజసిద్ధంగా రాణించగల రంగాలకు దూరమై వాళ్లు అసమర్థులుగా మారుతున్నారు. కుంగిపోతున్నారు. ఈ విషయాల్లో ప్రభుత్వాలూ జోక్యం చేసుకోవాలి. సివిల్స్లాగే ఐఐటీ ప్రవేశపరీక్షల్లోనూ సంస్కరణలు తీసుకురావాలి. ప్రయివేటు కళాశాలల సమయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదులోపే ఉండేలా చూడాలి. నెలలో నాలుగురోజుల సెలవులూ, పండగల విరామం కచ్చితంగా ఉండేలా ఆదేశాలు జారీచేయాలి. మరో విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అతిశక్తిమంతమైన డేటా స్టోరేజీ కంప్యూటర్ల కారణంగా రానున్న కొన్నేళ్లలో ఇప్పుడుంటున్న ఉద్యోగాల్లో దాదాపు 60 శాతం ఉండకపోవచ్చు. ఉద్యోగుల జ్ఞాపకశక్తికి ప్రాధాన్యం తగ్గి క్రిటికల్ థింకింగ్, సాఫ్ట్‌స్కిల్స్ వంటివాటికే ప్రాధాన్యం పెరగొచ్చు. ఐఐటీ, ఐఐఎం అనే అర్హతలకన్నా నైపుణ్యాల విలువ పెరగొచ్చు. ఆ భవిష్యత్తు ఉద్యోగాలకి ఇదిగో ఇప్పుడు మనం ఇస్తున్న శిక్షణలు ఏమాత్రం కొరగావు. కాబట్టి.. ఇప్పుడే పిల్లల్ని ఆ నైపుణ్యాలపై మళ్లించే చదువులు కావాలి. అవి ఎక్కడుంటాయో అంటారా? వెతకగలిగితే మన మాతృభాషా సాహిత్యంలోనూ, క్రీడల ద్వారానూ లభిస్తాయి. వాటికేం లక్షల ఖర్చుపెట్టి కోచింగ్‌లు అక్కర్లేదు. తల్లిదండ్రులుగా మీరు కాస్త శ్రద్ధపెడితే చాలు!
- వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త
No comments:
Post a Comment