Saturday, October 21, 2017

సత్యజిత్ రేకు టాగూర్ కవిత





ఈ కార్తిక మాసంలో మంచు కురిసేవేళలో .. 
తుషార బిందువుల చల్లని పన్నీరు చల్లుతూ 
హేమంతం విచ్చేసింది
భూదేవికి సీమంతం చెయ్యడానికి 
వస్తూ వస్తూ చేమంతులను 
బంతి పూబంతులను విరబూయించేసింది!
ఎందుకో ఓ కవి "మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో" అన్నా
కాలం మాత్రం తన మానాన 
తన గమనంలో చిత్రంగా రంగులను మోసుకొస్తుంది! 
మన జీవితాలను 
వర్ణమయం రసమయం చెయ్యడానికి 
అందుకే యండమూరి "స్పందించే హృదయం ఉంటే కొలను గట్లమీద 
నిద్ర గన్నేరు పువ్వు చాలు చూస్తూ ఆనందించడానికి" అన్నారు
బ్రతుకుతెరువు పోరులో 
కాలంతో పాటే పరిగెడుతున్న మనమూ 
కాస్త ఆగి .......
కాలం మనకి అందించే కళల, 
కలల లోకాన్ని ఆస్వాదిద్దాం! 
నన్ను చిత్రంగా బందీ చేసిన చిత్రించిన చిత్రాలు 
ఈ మంచుకురిసే వేళలో మీకోసం 
బెంగాల్ చలన చిత్రసీమలో సుప్రసిద్ధ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన సత్యజిత్ రే చిన్న వయసులో ప్రతి పుట్టినరోజునాడు తల్లి ఆశీస్సులు పొందడానికి వెళ్ళినప్పుడు టాగూర్ ఆయనకు ఒక కవిత రాసిచ్చారట. ఆ కవిత 
నేనీ లోకంలో 
ఎన్నో దేశాలను సందర్శించాను 
గొప్పగా చెప్పుకునే నదులను తిలకించాను 
లోయల్ని చూశాను
రకరకాల పక్షుల్ని చూశాను 
ప్రకృతిలో 
ఎన్నో ఎన్నెన్నో అందాలను చూశాను
కానీ ఒక్క లోటుండిపోయింది 
నా ఇంటి తోటలో
పచ్చికను తడిపి ముద్దాడిన 
మంచుబిందువుల్ని చూడలేకపోయాను 
ఈ కవితనిస్తూ టాగూర్ సత్యజిత్ రేతో ఇలా అన్నారు -
"ఈ కవిత ఎం చెపుతోందో ఇప్పుడీ వయస్సులో నీకు అర్ధం కాకపోవచ్చు. పెరిగి పెద్దవాడైన తర్వాత దీన్ని చదువు. అర్ధమవుతుంది ఇందులోని సారాంశం" అని.
అనేక సంవత్సరాల తర్వాత సత్యజిత్ రే ఆ కవితను చదివారట. అందులోని భావాన్ని గ్రహించిన సత్యజిత్ పథేర్ పాంచాలి సినిమా తీశారు. ఈ మంచు కురిసేవేళ గుర్తొచ్చిన ఆ జ్ఞాపకాన్ని మీ తో పంచుకుంటూ ...మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్!!

No comments:

Post a Comment

Total Pageviews