Sunday, October 22, 2017

కార్పొరేట్ విద్యావిధానం పై అమర్నాధ్ వాసిరెడ్డి గారి విశ్లేషణాత్మక వ్యాసం

కార్పొరేట్ విద్యావిధానం పై అమర్నాధ్ వాసిరెడ్డి గారి విశ్లేషణాత్మక వ్యాసం:


ఇంతలా మోసం చేస్తున్న కార్పొరేట్ విద్య సంస్థ ల గురించి మీరు ఫేస్బుక్ పై ఎందుకు పెద్దగా స్పదించడం లేదు ? ఫేస్బుక్ మెసెంజర్ లో ఒక మహిళ ప్రశ్న . నా సమాధానం ఇదిగో ! అందరికోసం ... :
అవి ఐ న్యూస్ ఛానల్ కొత్తగా ప్రారంభించిన రోజులు ! అప్పుడు ఆ ఛానల్ ఒక సంచలనం . ఐఐటీ ఫలితాలు వెలువడ్డాయి . ఎప్పటిలాగే బోగస్ ఫలితాల్ని కార్పొరేట్ సంస్థలు ప్రచురించాయి . ఐ న్యూస్ సీఈఓ నుంచి లైవ్ షో కు రావాలని ఫోన్ వచ్చింది . రాత్రి 8 నుంచి ముప్పై నిముషాల పాటు షో జరగాలి . షో ప్రారంభం అయ్యింది . వారు ఇచ్చిన ఫలితాలు ఏ విధంగా బోగస్ అనేది సాక్షాలతో వివరించడం మొదలు పెట్టి ఆ విద్య విధానం లో జరిగే తప్పిదాల్ని వివరించడం మొదలు పెట్టాను . వారి తరపున చర్చ కు వచ్చిన వ్యక్తి నోరు మెదప లేని పరిస్థితి . అర గంట అనుకొన్న కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు సాగింది . అంటే అంతలా ఆ కార్యక్రమానికి స్పందన వచ్చింది . కార్యక్రమం బ్రేక్ వచ్చినప్పుడల్లా వారి ప్రతినిధి ఒకటే మాట చెబుతూ వచ్చారు . మీరు ఏమి చేసినా మాకు వచ్చే అడ్మిషన్స్ మాకు వస్తాయి . ప్రోగ్రాం అయ్యి బయటకు వెళుతూ కూడా అయన అదే చెప్పారు .
సుమారుగా నాలుగేళ్ళ క్రితం తెలుగు లో అత్యధిక circulation కలిగిన పత్రిక దాదాపు వారం రోజులు పాటు కార్పొరేట్ విద్య లోని మోసాల్ని వివరిస్తూ ఫ్రంట్ పేజీ వ్యాసాల్ని ప్రచురించింది . ఒక పత్రిక, అందునా పేరున్న పత్రిక ఆలా ఒక విషయం పై వివరిస్తే అలంటి బిజినెస్ కుప్ప కూలుతుంది . కానీ కార్పొరేట్ విద్య సంస్థ ల పై తెలుగు తల్లితండ్రుల మోజు కాస్తంతైనా తగ్గ లేదు .
ఇప్పుడు గత వారం రోజులుగా ఇంచు మించు అన్ని పత్రికల్లో , టీవీ చానెల్స్ లో ఇంకా సోషల్ మీడియా లో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ చర్చ లు , క్లిప్పింగ్స్ సర్క్యూలేట్ అవుతున్నాయి కదా ? . ఒక్క తల్లితండ్రి అయినా" ఆమ్మో ఇలాంటి సంస్థలో మన పిల్లల్ని ఉంచొద్దు" అని వెళ్లి టీసీ తీసుకొన్న ఉదంతం ఉందా ? వుండే అవకాశమే లేదు . ఇంటర్ లో అయితే ప్రత్యామ్నాయం లేదు అనుకోవచ్చు కనీసం స్కూల్ విద్య లో వుంది కదా ? ఇప్పుడు చెబుతున్నా.. ఈ చర్చ లు అన్ని వారిపై ఎలాంటి ప్రభావం చూపవు . ఎప్పటి లాగే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ జరిగి పోతాయి . చూస్తూ వుండండి .
ఎందుకలా ? కారణం ఏంటి ?
మనిషి బలహీనతల పై జరిగే వ్యాపారం ఈ బలహీనతలు మనిషి లో ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి . కృషి బ్యాంకు ఎన్నో జీవితాల్ని మసి చేసి పొయ్యింది . కానీ ఏమైంది ? అటు పైన ఇలాంటి ఆర్థిక మోసాలు ఆగాయా? ఆగవు . ఎందుకు ? మన డబ్బు సులభం గా రెండు మూడు ఇంతలు కావాలి . ౩౦ శాతం వడ్డీ రావాలి. మూడేళ్ళలో రెట్టింపు కావాలి అనే ఆశ మనుషుల్లో ఉండడం కారణం . దీని ఆధారం చేసుకొనే తెలివైన వాడు తెలివి లేని మూర్ఖులతో బిజినెస్ పేరుతొ మోసం చేస్తూనే ఉంటాడు . ఇక్కడ కార్పొరేట్ విద్య కూడా తల్లితండ్రుల మూర్ఖపు అత్యాశ పై జరిగే బిజినెస్ .
ఏమిటా వీక్నెస్ ? ఏమిటా అత్యాశ ?:
మన వాడు / అమ్మాయి సృష్టి లో కెల్లా అత్యంత తెలివైన వాడు / ఆమె . బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేయ గలరు . కావాల్సిందల్లా సరైన కోచింగ్ మాత్రమే . ఐఐటీ లోనో నీట్ లోనే సీట్ రావడం ఏంటి బోడి .. అల్ ఇండియా ఫస్ట్ రాంక్ రావాలి .. వస్తుంది .. అంత కెపాసిటీ మన వాడికి/ ఆమెకు వుంది . ..ఇదండీ .. నూటికి తొంబై మంది తల్లితండ్రుల ఆలోచన . సరిగ్గా ఇదే కార్పొరేట్ విద్య సంస్థ ల కు ఇంధనం. ఈ బలహీనతల పైనే వారి వ్యాపారం జరుగుతుంది . పిల్లల శక్తి సామర్త్యలు ఆప్టిట్యూడ్ ఇలాంటి వాటి గురించి ఎన్ని చెప్పిన వీరికి ఒక ముక్క కూడా చెవికి ఎక్కదు . ఎక్కినా మా వాడు డిఫరెంట్ అనుకొంటారు .
ఇప్పుడు ఇన్ని ఆత్మ హత్యలు జరుగుతున్నాయి కదా .. కార్పొరేట్ కారాగారాల్లో తమ పిల్లని బందీ చేసి.. మా వాడి ప్రతిభ అంత ఇంత అంటూ పక్కింటి వారికీ , మిత్రులకు చెబుతూ తెగ సంతోషపడుతూ , పిల్లలు ఎప్పుడైనా నెలకు ఒక సారి ఒక గంట కలిసినప్పుడు బాగా తింటున్నావా ఆరోగ్యంగా వున్నావా అని కాకుండా ఫిజిక్స్ లో ఎన్ని మార్కులు .. ఈ వారం రాంక్ ఎంత .. ఎందుకు తగ్గింది ..ఇంకా దంచి కొట్టు అను వాకబు చేసే తల్లి తండ్రులను ఒక్క సారి కలిసి అడగండి .. ఏంటి మీకు జరుగుతున్న సంఘటనలు చూస్తే మీకు భయం వెయ్యడం లేదా అని .. " ఆబ్బె .. ఎవరో పనికి రాని పిల్లలు .. చదవడం చేతకాని పిల్లలు .. అమ్మ అబ్బా పెంపకం సరిగ్గా లేని పిల్లలు .. మానసిక బలహీనత ఉన్న పిల్లలు ఆలా చేస్తారు . మా వాడికేంటండి? జెమ్. అసలు వాడి గురించి మీకు తెలియదు . "నాన్నా! టాయిలెట్ లో కి కూడా నేను బుక్ తీసుకొని వెళుతాను అంటాడు" అని అంటాడు .. అని మీకు లెక్చర్ ఇస్తాడు .
మా వాడు / అమ్మాయి అంత ఇంత అని వూహించుకోవడమే కాదు .. అది నలుగురికి చెప్పుకొని సమ్మగా ఫీల్ అయ్యే తల్లి తండ్రులు కోకొల్లలు . గజ్జి వచ్చిన వాడు దాని పై గీకు కొంటూ ఫీల్ అయ్యే సమ్మ తనం కంటే ఇలాంటి వారు తమ పిల్లల గొప్పతనం నలుగురికి చెప్పుకొని ఫీల్ అయ్యే సమ్మ తనం ఎక్కువ .
కాబట్టి ఇలాంటి సంఘటనలు వీరిని బాధించవు . ఇది అనవసరంగా జరిగే రాద్ధాంతం అనుకొంటారు. ఒక మంచి ఫలితాన్ని సాదించాలి అంటే కొంత కష్టం పడక తప్పదు అనుకొంటారు . బట్టి చదువుల వల్ల జరిగే నష్టం ఇలాంటి విషయాలు ఎంత చెప్పినా వీరి బుర్రకు ఎక్కదు. ఆ ఇదేవో కాలక్షేపం కబుర్లు . లేదా తమ విద్య సంస్థల కు నష్టం జరుగుతుంది అని పోటీ దారులు చెప్పే మాటలు . ఐఐటీ సీట్ కొట్టాలి .. అమెరికా కు పోవాలే .. డాలర్ లు సంపాదించాలే.. కనీసం ఒక నాలుగు ప్లాట్ లు కొనాలే.. ఇది సగటు తల్లి తండ్రి ఆలోచన . అందరు ఇలా వున్నారు అని కాదు . కానీ మెజారిటీ మాత్రమే ఇలాగె వున్నారు.. వుంటారు .. ఈ బలహీనత ఉన్నంత కాలం వీడు .. వీడు కాక పొతే వీడి అమ్మ మొగుడు .. మోసం చేస్తూనే వుంటారు .. జనాలు మోస పోతూనే వుంటారు .
దీనికి తోడు మరో బలహీనత కూడా తల్లితండ్రులో వుంది . దీన్ని ఉపయోగించుకొనే ఢిల్లీ కోచింగ్ వాడు ఫిట్టింగ్ చేస్తుంటాడు . అదేంటంటే కన్సెషన్ . ఎలాగూ నెగటివ్ పోస్ట్ పెడుతున్నాను కదా .. ఆ వివరాలు కూడా చెబుతాను . మరో నెల రోజుల్లో అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ advertisement లు వస్తాయి . పిల్లకు స్కాలర్షిప్ టెస్ట్ .. వారి ప్రతిభ కు పురస్కారం అని . పిల్లాడు 5 క్లాస్ లో వున్నాడు అంటే ఇక తల్లితండ్రుల్లో చలనం వచ్చేస్తుంది . అసలు చూద్దాం .. మన వాడి స్థాయి ఏంటో ? అయినా పొయ్యింది ఏముంది ? జస్ట్ ఒక సండే రోజు ఒక ఎక్సమ్ రాసి రావడం కదా అంటూ పిల్లలని తీసుకొని ఎగ్జామ్స్ రాయించి వస్తారు . సరిగ్గా అక్కడినుంచే జగన్నాటకం మొదలు అవుతుంది .
ఆ పరీక్ష పేపర్ 5 వ క్లాస్ స్థాయి కాదు కదా డిగ్రీ వారికీ కూడా అందకుండా ఒక ప్లాన్ ప్రకారం సెట్ చేస్తాడు . వారం రోజుల్లో ఇంటికి కాల్ వస్తుంది . "మీ వాడు పెద్దగా రాయలేక పొయ్యాడు . కారణం ఇప్పుడు చదువుతున్న స్కూల్ లో సాధారణ అంశాలనే బోధిస్తున్నారు . ఐఐటీ పరీక్ష లో అసాధారణ అంశాలు ఉంటాయి . ఇలాంటి వి మా దగ్గరే బోధిస్తారు . అన్నట్టు మరో విషయమండీ.. మీ వాడి పెరఫార్మన్స్ మిగతా చాల మంది కన్నా బాగుంది .. కాబట్టి మీరు వెంటనే అడ్మిషన్స్ తీసుకుంటే ఫీజు లో యాభై శాతం డిస్కౌంట్ ఉంటుంది" అని చెబుతారు .
వామ్మో .. మన పిల్లాడు చదువుతున్న స్కూల్ స్టాండర్డ్ ఇంత తక్కువా ? అయినా వారు ఫీజు కన్సెషన్ ఇవ్వరు .. వీరు చూడు.... మన వాడి ప్రతిభ చూసి యాభై శాతం ఇస్తున్నారు అనుకొంటారు . తమ పిల్లాడు చదువుతున్న స్కూల్ ఫీజు ముప్పై లేదా 40 వేలు ఉంటుంది . అందులో కన్సెషన్ లేదని బాధ పడే తల్లితండ్రులు లక్షన్నర లేదా రెండు లక్షల ఫీజు లో 50 తగ్గుతుంది అనగానే యెగిరి గెంతు వేస్తారు . నిజానికి తాము ఇప్పుడు చెల్లిస్తున్న ఫీజు కంటే రెట్టింపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని గ్రహించలేరు .
అయినా నాకు ఇవన్నీ ఎందుకండీ .. మా స్కూల్ విద్యార్థులు తల్లి తండ్రులు ఇలా ఆలోచించరు . వారికి కార్పొరేట్ మోసాలు తెలుసు . పిల్లలకి సంపూర్ణాత్మక విద్య ఆవశ్యకత తెలుసు . అందుకే మా దగ్గరికి వచ్చారు .
కేవలం మా స్కూల్ తల్లితండ్రులే కాదు .. ఇంకా చాలా మందికి ఇలాంటి విషయాల పై అవగాహన వుంది . లేని వారికీ నేను పైన చెప్పిన బలహీనతలు కలిగిన తల్లి తండ్రులకు ఎంత చెప్పినా బూడిద లో పోసిన పన్నీరే . వారి లో నేను చెప్పినా బలహీనతలు ఉన్నంత కాలం మోసపు వ్యాపారాలు జరుగుతుంటాయి . వారి కడుపున పుట్టినందుకు పిల్లలు శిక్షను అనుభవిస్తారు . బాధాకరమైన విషయం ఏమిటంటే యిలాంటి తల్లితండ్రుల సంఖ్య ఇప్పటికి అత్యధికం గా ఉండడం . ఇలాంటి వారి సంఖ్య క్రమేపి తగ్గుతూ ఉండడమే కాస్త హోప్ ని కలిగించే అంశం . నా ఈ పోస్ట్ అలాంటి హోప్ తో పెట్టిందే .
మారాలి .. తల్లితండ్రుల వైఖరి మారాలి ..

No comments:

Post a Comment

Total Pageviews