సాతవాహనుల కాలం నుంచి కాకతీయుల కాలం దాకా తెలంగాణా చరిత్ర మీద రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తున్నాం, మీరు కూడా మాట్లాడాలి' అని ప్రొ.అరుణకుమారిగారూ, మిత్రుడు మల్లెగోడ గంగాప్రసాద్ అడిగారు.నేను చరిత్రకారుణ్ణీ, పరిశోధకుణ్ణీ కాకపోయినా చరిత్ర విద్యార్థిని. ఈ వంకనైనా ఒకసారి ప్రాచీన తెలంగాణా చరిత్రలోకి తొంగిచూద్దామని సరేనన్నాను.
నిన్న మధ్యాహ్నం ప్రసిద్ధ చరిత్రకారుడు డా.కె.శ్రీనివాసులు అధ్యక్షతవహించిన సెషన్లో మరో ఇద్దరు వక్తలతో పాటు నేను కూడా ప్రసంగించాను. 'ప్రాచీన తెలంగాణా జీవన తాత్త్వికత' అన్న అంశం మీద.
సాధారణంగా తెలంగాణా చరిత్ర గురించి మాట్లాడేవాళ్ళు కాకతీయుల కాలం నుంచే మాట్లాడటం మొదలుపెడతారు. క్రీ.శ.4 వ శతాబ్దం నుంచి క్రీ.శ 10 వ శతాబ్ది మధ్యకాలందాకా తెలంగాణా లేదా మధ్యదక్కను ప్రాంత చరిత్రని నిర్మించడానికి ఈ మధ్యకాలందాకా చెప్పుకోదగ్గ ప్రయత్నం జరగలేదు. చివరికి తెలంగాణా ప్రభుత్వ పోర్టల్లో కూడా 'దీన్ని ప్రధానస్రవంతి ఆంధ్ర చరిత్రకారులు అంధయుగంగా పేర్కొన్నారు..కానీ మరింత సవిస్తరంగా పరిశోధన జరగాలి' అని రాసుకున్నారు.
ఈ లోటును పూరించే దిశగా ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రకాంగ్రెస్ వారు వెలువరించిన 'ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర-సంస్కృతి' సంపుటాలు. అందులో ముఖ్యంగా మూడవసంపుటం (2009), నాలుగవ సంపుటం (2012). ఈ సంపుటాల్లో క్రీ.శ.624 నుంచి 1324 దాకా ఏడు శతాబ్దాల కాలపు చరిత్రను విశ్వసనీయంగా నిర్మించే ప్రయత్నం చేసారు. ఇందుకు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారికి తెలుగువాళ్ళు శాశ్వతంగా ఋణపడి ఉంటారు.
అయితే, ఈ సంపుటాల్లో వ్యాసాల్లో తెలంగాణా చరిత్రను ప్రధానంగా శాసనాల ఆధారంగా నిర్మించడానికి ప్రయత్నించారు. సాహిత్య ఆధారాల్ని స్పృశించనే లేదు. ఆ పని డా.కప్పగంతుల కమలగారు చేసారు. Life in Ancient India as depicted in Prakrit Literature (1984) అనే మేలిమి పరిశోధనలో ఆమె నాలుగు ప్రాకృత సాహిత్యకృతులు ఆధారంగా ప్రాచీన దక్కను జీవితాన్ని ఊహించే ప్రయత్నం చేసారు. అవి హాలుడి 'గాథాసప్తశతి', జయవల్లభుడి 'వజ్జాలగ్గం', ప్రవరసేనుడి 'సేతుబంధం', వాక్పతిరాజు రాసిన 'గౌడవహొ'.
చరిత్ర కాంగ్రెస్ వారి సంపుటాల్నీ, కమలగారి పరిశోధననీ కలిపి చదివిన తరువాత నాకు అర్థమయిందేమంటే, క్రీ.శ 4-10 శతాబ్దాల మధ్యకాలంలోనే తెలంగాణా ప్రాంతపు స్వభావం విస్పష్టంగా రూపొందిందని. దాంతోపాటు,ఆ స్వభావం తదనంతరకాలంలో మొత్తం దక్కన్ సామాజిక-రాజకీయ స్వభావాన్నే నిర్ధారితం చేసిందని.
నేను నా ప్రసంగంలో ఆ విషయాన్నే స్థూలంగా వివరించేను. ఆ స్వభావానికి మూడు లక్షణాలున్నాయని ప్రతిపాదించేను.
మొదటిది, ప్రాచీన తెలంగాణా కాకతీయుల కాలందాకా కూడా ఒక political nucleus కోసం వెతుక్కుంటూ ఉన్నదని. అటువంటి ప్రయత్నం వేములవాడ చాళుక్యుల కాలంలో జరగకపోలేదు. కాని, వాళ్ళు రాష్ట్రకూటుల సామంతులుగా కన్నడ సంస్కృతిని, కన్నడ సాహిత్యాన్ని నిర్మిచడం మీదనే దృష్టిపెట్టారు. అందువల్ల క్రీ.శ పదవశతాబ్దందాకా కూడా తెలంగాణా శాతవాహన, కాదంబ,వాతాపి, కల్యాణి చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాలకు సరిహద్దు భూమిగా మాత్రమే ఉంటూ వచ్చింది. అంతేకాక, ఏ ముహూర్తాన రెండవ పులకేశి వేంగిలో తన ప్రతినిధిని నియమించాడో అప్పణ్ణుంచీ సుమారు ఆరు శతాబ్దాల పాటు, చోళ-చాళుక్య యుద్ధాలకు తెలంగాణా అతలాకుతలమవుతూ వచ్చింది. తమకు ఇష్టమున్నా లేకపోయినా ప్రాచీన తెలంగాణా పాలకులు ఈ నిరంతర యుద్ధాల్లోకి లాగబడుతూ వచ్చారు. అందుకనే నేను ఉత్తరభారతదేశంలో పంజాబ్ ఎటువంటి పాత్ర పోషించిందో, దక్షిణ భారతదేశ చరిత్రలో తెలంగాణా అటువంటి పాత్ర పోషించిందని అన్నాను. కాని,సరిగ్గా, ఆ నిర్విరామ యుద్ధ కార్యకలాపమే తెలంగాణాకొక నిర్దిష్ట రాజకీయ-ఆర్థిక స్వభావాన్ని సంతరింపచేసింది.
రెండవది, క్రీ.పూ 3 వ శతాబ్దినుంచి క్రీ.శ మూడవ శతాబ్దిదాకా భారతదేశ రాజకీయాలు అంతర్జాతీయ వాణిజ్యంమీదా,ముఖ్యంగా రోమ్ తో జరిగిన వ్యాపారం మీదా ఆధారపడ్డాయి. ఆ కాలంలో మతపరంగా బౌద్ధం, సామాజికంగా సార్థవాహులూ, వణిజులూ ప్రధాన పాత్ర పోషించారు. క్రీ.పూ. 3 వ శతాబ్దం అంతానికి ఆ 'గ్లోబలైజేషన్ ' శకం ముగిసిపోయాక, భారతదేశం ప్రాంతీయరాజ్యాలుగా విడిపోవడం మొదలుపెట్టాక, భూమి మీద ఆధారపడిన ఆర్థికవ్యవస్థను నిర్మించుకునే దిశగా చరిత్రనడిచింది. అందుకనే గోదావరీ-కృష్ణా మధ్య ప్రాంతం మీద పట్టుకోసం అంత సుదీర్ఘ సంగ్రామం నడిచింది. ఆర్థికవ్యవస్థ స్పష్టంగా భూమిమీదా, వ్యవసాయంమీదా ఆధారపడ్డ వేంగిసామ్రాజ్యంలో బ్రాహ్మణులూ, బ్రహ్మదేయాలూ, వర్ణవ్యవస్థా ప్రాధాన్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. వ్యవసాయాన్నీ విస్తరింపచేయడానికి పెద్ద ఎత్తున బ్రాహ్మణులు అవసరమైన కాలం అది. కాని తెలంగాణాలో అంత స్పష్టంగా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి లేదు. మరో వైపు, బౌద్ధులు నిర్మించిన వర్తక శ్రేణుల ఆర్థికవ్యవస్థని తెలంగాణాలో జైనులు కొనసాగించారు. మరొక వైపు, నిరంతరంగా జరుగుతున్న యుద్ధాల కోసం సైనికులూ, యోద్ధలూ అవసరమైనందువల్ల గిరిజనులూ, ఇతర సంచార జాతులవారూ సామాజికంగా ముఖ్యమయ్యారు.(కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన గుండయ, ప్రోలయ, బేత గిరిజనులేనని ఇప్పుడు భావిస్తున్నారు) అందువల్ల, ప్రాచీన తెలంగాణా చాతుర్వర్ణ వ్యవస్థని కాక, అష్టాదశ ప్రజలతో కూడుకున్న వ్యవస్థను నిర్మించుకుంది. అంటే vocational diversification అన్నమాట. ఈ వివిధ జీవనవృత్తులు 18 నుంచి 27 కి చివరికి కాకతీయుల కాలం నాటికి 72 దాకా విస్తరించడం మనం చూస్తాం. ఒకవైపు రాజకీయంగా ఒక కేంద్రమంటూ లేకపోవడమే కాక, ఆర్థికంగా భిన్న వృత్తులమీద ఆధారపడటంతో తెలంగాణా సమాజం లో social mobility అత్యున్నతంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ఇక మూడవ అంశం, పై రెండింటి ఫలితమే. అంటే, విస్పష్టమైన రాజకీయ కేంద్రమంటూ ఒకటిలేకపోవడం వల్లా, ఆర్థికవ్యవస్థ వృత్తి వైవిధ్యం మీద ఆధారపడినందువల్లా, ప్రాచీన తెలంగాణా జీవన తాత్త్వికత ప్రధానంగా ఇహలోకం మీదనే దృష్టిపెట్టింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే secular అనొచ్చు. అప్పుడు కూడా దేవాలయాలూ, పూజలూ,దానాలూ ఉన్నాయి కాని, అవి ప్రధానంగా మరింత మెరుగైన ఇహలోక జీవితం గురించే తప్ప, ఈ లోకాన్ని నిరసించి పరలోకాన్ని కోరుకోవడం గురించి కాదు. ఇటువంటి విస్తృత, వైవిధ్యవంతమైన జీవనవృత్తులు ఉన్న సమాజంలో ఏ ఒక్కరి దృక్పథమో, లేదా ఏ ఒక్క మతమో ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉండదు. తెలంగాణాలో మతాలు నిర్వహించిన పాత్ర ఆధ్యాత్మికం కాదు, ప్రధానంగా సామాజికం, పర్యవసానంలో రాజకీయం. అంటే, ఉదాహరణకి, సామాజిక క్షేత్రంలో కొత్తగా తలెత్తుతున్న సామాజిక శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఒక మతం ప్రాబల్యం సంపాదించేది. ఆ శక్తులు ఒకసారి రాజకీయాధికారం సముపార్జించుకున్నాక, ఆ మతం సాధారణ ప్రజలకి దూరమయ్యేది. అప్పుడు, మరొక మతం సామాన్యప్రజలకి చేరువకావడానికి ప్రయత్నించేది.
తర్వాతి రోజుల్లో కాకతీయులు రాజకీయంగానూ, తాత్త్వికంగానూ కూడా వేంగీ నమూనాను అనుసరించారు. వారి నమూనాను తర్వాతి రోజుల్లో విజయనగర రాజులు అనుసరించారు. అంటే ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రధానం చెయ్యడం, విస్పష్టమైన వర్ణవ్యవస్థను నిర్మించుకోవడం, సామాజిక చలనశీలతను పరిమితం చెయ్యడం. కాని, సరిగ్గా ఈ కారణాలవల్లనే ముస్లిం సైన్యాలు మధ్యయుగాల తెలంగాణాను ఆక్రమించుకోగలిగాయి.
కాని మరొకవైపు ప్రాచీన తెలంగాణా తన జీవనదృక్పథాన్ని సాహిత్యమార్గంలో తక్కిన ప్రాంతాలకు అందచేసింది. సాహిత్యంలో దేశి ప్రాధాన్యత, జనజీవన చిత్రణ ప్రాచీన తెలంగాణా అందించిన ఉపాదానాలే. చివరికి, విజయనగర దేవాలయ వాస్తులో మొదటిసారిగా కనిపించే రంగమంటపం కూడా తెలంగాణా వాస్తులక్షణమే. దేవుడి సన్నిధిలో కూడా ఇహలోక జీవితాన్ని ఉత్సవం జరుపుకోవడమే రంగమంటపం. తర్వాతి రోజుల్లో కృష్ణదేవరాయలు దేవ-మానవ కల్యాణాన్ని కావ్యంగా రాయడానికి ప్రాతిపదిక సమకూర్చింది ఆ రంగమంటపమే.
మరో మాట కూడా చెప్పి నా ప్రసంగం ముగించాను. ఏ దేశమైనా, ప్రాంతమైనా, సమాజమైనా చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే, మనం తిరిగి తిరిగి అవే తప్పులు చెయ్యకుండా ఉండటానికి. నేను కొలనుపాక వెళ్ళినప్పుడు అక్కడ ముక్కూ చెవులూ తెగ్గొట్టిన జైన తీర్థంకర విగ్రహాలు చూసాను. ప్రాచీన తెలంగాణాను చైతన్యవంతం చేసిన ఆ జైనగురువులమీద అంత ఆగ్రహం ఎవరికొచ్చింది అని ఆరాతీస్తే అది వీరశైవుల పని అని తేలింది. ఒకప్పుడు ప్రజలకి ఎంతో సన్నిహితంగా ఉంటూ, వాళ్ళ గురించి మాట్లాడిన జైనులు నెమ్మదిగా రాజకీయాధికారాన్ని మరిగి ప్రజలకు దూరం కావడం మొదలుపెట్టగానే, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన మరో మతం వీరశైవం జైనుల ప్రజాద్రోహం మీద చూపించిన ఆగ్రహం అది. తెలంగాణా పాలకులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన విషయమిది.
చరిత్ర ఎందుకు చదవాలంటే, ఇందుకు.
No comments:
Post a Comment