Friday, October 27, 2017

ప్రదోష కాలం చాలా పవిత్రమైనది.

ప్రదోష సమయం

‘ప్రదోష’ అనే పదానికి అర్ధం అధిక దోషం కల సమయం. కానీ నిజానికి ఇది చాలా శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్ధం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే ‘ప్రదోష’ అనే పదంతో వర్ణించటం వింతగా కనిపిస్తుంది. శబ్దార్ధం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్ధం. కానీ ఈ యుగంలో తప్ప మరియే యితర యుగాల్లోనూ అధిక మోతాదులో పుణ్యం సముపార్జించటానికి అవకాశం లేదు. ప్రదోష కాలంలో ప్రజలు సమావేశమై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అ సమయం వారికి శుభప్రదమౌతుంది. అలాగాక వారు ఇతర కార్యక్రమాల్లో ఆ సమయాన్ని గడిపితే దోషాల్ని లేక అనర్ధాల్ని ఇస్తుంది. ప్రదోష సమయంలో చేసిన పాపాల ఫలితాలు మామూలు వేళల్లో చేసిన పాపాల ఫలితాలకంటే నూరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో ఒనరించిన పుణ్యాల ఫలితాలు కూడా ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి.

నిజాన్ని గ్రహిస్తే ప్రదోష కాలం చాలా పవిత్రమైనది. శుభప్రదమైనది కూడా. ఈ సమయంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో ఇతర దేవతలా సాన్నిధ్యం కొరకు ఆయా దేవుళ్ళ ఆలయాలకు పోనక్కరలేదు. ఆ కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమౌతారు. కాన ఆకాలంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోబాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేష లక్షణమిదే.

ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోర్కెలను నియంత్రించగల్గటం ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. శివునకు కాల సంహారమూర్తియని, కామ సంహారమూర్తియని పేర్లున్నవి. శివునకు చాలా ఇతర నామాలున్నాయి. కంచిలో ఒక మామిడి వృక్షం క్రింద ఉంటాడు గనుక అక్కడ ఆయన్ని ఏకామ్రేశ్వరుడ౦టారు. మద్రాసులోని మైలాపూరులో ఆయన్ని కపాలేశ్వరుడని పిలుస్తారు. అక్కడ ఉన్న ఈశ్వరుడు చేతిలో కపాలాన్ని ధరించి ఉంటాడు. మన్మథుణ్ణి సంహరించాడు. గనుక ఆయనకు కామ సంహారమూర్తి అని పేరు కూడా ఉంది.

ప్రదోషకాలంలో ఉపామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేస్తుంది ఈ క్రింది శ్లోకం.

“శ్లో!! సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే!!

అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు మాత్రమె చెందుతుంది. నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఈయబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా, కానీ యిక్కడ పరమేశ్వరునకు మాత్రమె ఈయబడినది. అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగా యముణ్ణి తన వామపాదంతో తంతాడు. వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”

ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని ఈరూపంలో స్మరించిన ప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. “ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా” విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసి౦హునకు మినహాయింపు ఈయబడింది. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః” -ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.

పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపంమనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి.

No comments:

Post a Comment

Total Pageviews