Wednesday, December 23, 2015

తిరుప్పావై 8వ రోజు పాశురము 8వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు

తిరుప్పావై 8వ రోజు పాశురము
8వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు.

మరి ఏంచేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత్ర.

No comments:

Post a Comment

Total Pageviews