శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!
నిన్నమొన్నటి దాకా వన్నె చిన్నెల చెన్నై
నేడు చిన్నబోయిన చెన్నై ...వన్నెతగ్గిన చెన్నై
ప్రకృతి కన్నెర్ర చేసి నీటముంచినా...వెన్నుచూపని చెన్నై
శభాష్ చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!
నీ కష్టం ఇతర నగరాలకి మేలుకొలుపు కావాలి!!
సాగరతీరాన సుందరనగరం
నిరంతరం ఆక్రమించాలన్నఆత్రం జలతరంగాల ఆశయం
నెరవేరి యెడ తెగకుండా కురిసిన వర్షం వేళ!
యేరు ఊరు వాడా ఏకమై జలాశయం అయ్యింది!
బలవంతుడ, ధనవంతుడ నాకేమని చెరువు గురుతులు చెరిపి
ఆకాశానికి నిచ్చెనేసిన భవనాలు... జలానికి చిక్కిన వైనం...
పల్లమెరిగిన నీరు ముంచిన తీరు... నిజమెరిగిన దేముడి తీర్పుకు
బతుకు బేజారై... పాండీ బజారుపాలైన వైనం
ఒకటా రెండా ఇరవై రోజులు సూరీడు ముఖం చాటేసి
చుట్టూనీరు... కన్నీరు మున్నీరు... తాగటానికి లేదు తన్నీరు
నాలుగు గోడలు మధ్య బితుకు బితుకు బతుకు ఎటూ వెళ్ళ వీలు లేదు
కోట్లున్నా...ఆకలి తీర్చే కొట్టు లేదు
సాటి మనుషులతో అవసరం లేని
అవసరాల అన్వేషణలో... ఆవిష్కరణలన్నీమూగబోయినవేళ
మనసున్న మనుషుల ఆసరా...కొండంత ఓదార్పు
ఈ ఆపత్కాలంలో.. చెన్నై చూపిన నేర్పు ఓర్పుతో భావికై ఎదురుచూపు
జాతి కుల మత ఎల్లలు చెరిపి ప్రకృతి నేర్పిన పాఠం! మనకి గుణపాఠం కావాలి!!
మన జీవనంలో మార్పు తీసుకు రావాలి! ప్రకృతితో సహజీవన మార్పు తేవాలి!!
శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!
మణిసాయి విస్సా ఫౌండేషన్.
No comments:
Post a Comment