Monday, December 14, 2015

"శ్వాస మీద ధ్యాస"

                                                  "శ్వాస మీద ధ్యాస"

మనిషి ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు.

కానీ తనను తాను జయించలేక పోతున్నాడు.

మనిషి ఇతరులను బాగు చేయాలనుకుంటున్నాడు ; కానీ, తనను తాను బాగు చేసుకోలేని వెర్రిబాగులవాడవుతున్నాడు.

... తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ..

మనిషి ప్రక్కింటివాడి కన్నా గొప్పవాడు కావాలనుకుంటున్నాడు ...

వస్తు వాహనాదులతో, అంబర భూషణాదులలో.

కానీ, ఓ వివేకానందుడి కన్నా, ఓ రమణ మహర్షి కన్నా నేనెందుకు గొప్పవాడిని కాకూడదు ? అని ఎవ్వరూ అనుకోవట్లేదు.

మనిషి ధనవంతుడు కాగోరుతున్నాడు ; కానీ జ్ఞానవంతుడు గా కావడానికి ఆలోచనే చేయడం లేదు.

ఇక ఇలాంటి మనిషికి మనం తిలోదకాలిద్దాం ; క్రొత్త మనుష్యలను తయారు చేద్దాం.

క్రొత్త దివ్య జీవితాలకు అంకురార్పణ గావించుదాం

మనిషి ఇప్పుడు తనలోని దోషాలను దూరం చేసుకోవాలి.

ప్రతి మనిషీ ఓ వివేకానందుడుగా, ఓ రమణ మహర్షి గా అయితీరాలి.

వారి కన్నా ఇంకా గొప్ప గా, చాలా గొప్ప గా కావాలి.

జ్ఞానాన్నే పై లోకాలకు తిసుకువెళ్తాం కనుక, ధనాన్నంతా ఇక్కడే వదిలిపెడ్తాం కనుక,

ఇక ప్రతి మనిషీ జ్ఞానవంతుడుగా కావడానికి నిశ్చయించుకోవాలి.

ఇదంతా సాధించాలంటే ఉన్నది ఒక్కటే మార్గం.

అదే ధ్యాన మార్గం - అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి.

ప్రతి మనిషీ, ప్రతి రోజూ తనకు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట శ్వాస మీద ధ్యాస ఉంచాలి.

తల్లిదండ్రుల మీద ధ్యాస ; భార్య లేక భర్త  మీద ధ్యాస ; పిల్లల మీద ధ్యాస ; ఉద్యోగం మీద ధ్యాస ;... వీటన్నింటితో పాటు విధిగా శ్వాస మీద ధ్యాస కూడా ఉంచాలి.

వుంచాలి శ్వాస మీద ధ్యాస - పెంచాలి శ్వాస మీద ధ్యాస.

శ్వాస అంటే హంస ; శ్వాస మీద ధ్యాస అంటే హంసాభ్యాసం చేయడం ; హంస విన్యాసాల్ని గమనించడం ; హంస ధ్వని ని వినడం ; హంసామృతాన్ని గ్రోలడం ; హంసతూలికాతల్పం మీద సుఖనిద్రపోవడం ; హంస గమనం చేయడం.

No comments:

Post a Comment

Total Pageviews