ప్రత్యేకంగా సాయినాథులవారు గురువారాన్ని ఎంచుకోవటంలో
అంతరార్థం ఏమిటి ?
ఆదివారానికి శ్రీ మన్మహాదేవులవారు అధిష్టానము. ఈ రోజున ప్రణవార్చన చాలా విశేషము. అంటే ఓంకార సంపుటీకరణతో చేసే అర్చన, అభిషేక, ఆరాధనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సోమవారం రోజుకి శివుని మాయ, మంగళవారం రోజుకి స్కంద, బుధవారానికి విష్ణు, గురువారంరోజుకు బ్రహ్మ మరియు విఘ్నేశ్వర, శుక్రవారానికి ఇంద్ర, శనివారానికి యమధర్మరాజు అధిష్టాన దేవతలు. నవగ్రహాలు ఆవిర్భవించిన తర్వాత ఆయా గ్రహాలకు ఆధిపత్యం ఇవ్వటం జరిగింది. సద్గురువుల ఆవిర్భావము అయ్యాక గురువారము శ్రీ సాయినాథ, అదే విధంగా వెంకటేశ్వర ఆవిర్భావం అయ్యాక శనివారము శ్రీ వెంకటేశ్వర అర్చన, ఆరాధనలు చేస్తున్నాము. ఏ నూతన కార్యం ప్రారంభించటానికి అయినా, గురువారం చాలా మంచిది. ఆ రోజు ప్రారంభం చేసిన ఏ కార్యమైనా దిగ్విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వారఫలం చేత కేవలం సాయినాథుల వారి అనుగ్రహమే కాకుండా, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మదేవ, శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణనాథుల వారి అనుగ్రహం కూడా కలుగుతుంది.
అన్ని వారాలలో సాయినాథులవారికి గురువారం ప్రత్యేకం. అంటే, కలియుగంలో ఎవరైతే సద్గురువులను ఆశ్రయించి, వారి అనుజ్ఞ తీసుకొని నూతన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారో, వారికందరికీ బ్రహ్మదేవులవారి అనుగ్రహంతో మంచి బుద్ది, బ్రహ్మశక్తి అయిన సరస్వతి అనుగ్రహంతో మంచి ప్రవర్తన, గణనాథులవారి అనుగ్రహంతో మంచి వ్యక్తులతో స్నేహం అనే ఫలితాలు కలుగుతాయి. తద్వారా ప్రారంభించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
శ్రీ సద్గురు సాయినాథులవారు గురువారాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవటానికి అనేక విషయాలు కారణాలుగా వుంటాయి. వాటిలో పైన చెప్పినది కూడా ఒక కారణం. సద్గురువుల అనుగ్రహం వలన కలిపురుషుని ప్రభావం అధికంగా వుండే ఈ కలియుగంలో కూడా మన్యుష్యులందరికీ మంచి బుద్ది, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తులతో స్నేహం అనే మూడు ముఖ్యమైన మంచి గుణములు చేకూరు గాక ! అదే విధంగా ఈ లోకంలో వుండే గురువులందరూ, సద్గురువులలాగా భక్తులందరికీ శుభ ఫలితములు చేకూర్చెదరు గాక !
No comments:
Post a Comment