Thursday, April 16, 2015

కీ.శే. గుంటూరు శేషేంద్ర శర్మ గారి రచనలు 1

                                                             
ఏకైక సినిమా పాట:
1975 లో విడుదలైన ముత్యాలముగ్గు సినిమాలో ఈ పాట పి.సుశీలమ్మ గారి సుమధుర గానానికి.  శ్రీ. కె.వి.మహదేవన్ సంగీతం రసధుని లో ఎప్పటికీ ఎప్పటికీ 
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ
విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా!
గగనంలో మబ్బుల్లారా!
నది దోచుకుపోతున్న నావను ఆపండీ!
రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ

కవితలు:
ఉత్తరాలు విప్పాను 
పేజీల్లోంచి వెన్నెల రాలింది . 

వాక్యాలు శారికలై చకోరికలై ఎగిరిపోయాయి 

నేనూ ధవళమూ మిగిలేము పేజీల మీద 

ఇవాళ నా హృదయం

ఒక కొత్త భావచ్చ్చాయకు అతిధి అయింది

తారల గ్రామాలలోకి 

చంద్రుడు వెన్నెల మందలను 

తోలుకొచ్చాడు.

---- 
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..
నవ్వుల జల్లులు కురిశాయి నా మీద
పుష్పవాణి పలికింది
బిడ్డా! పువ్వుల్ని తెలియని వారే అందరూ లోకంలో
పూరేకుల రంగులు చూసి పరవశులౌతారా
మూర్చపోతారు పరాగ పరీమళాలకు వశీకృతులై
దేవుడ్ని పూజిస్తారు వాటి గొంతులు కోసి
దండలల్లి ధరించుకుంటారు వాటి గొంతులు కోసి
అజ్ఞానులు – సమగ్ర పుష్పజ్ఞానం కావాలంటే
దర్శన శక్తి కావాలి మానవ నేత్రాలకు
అది సిద్ధిస్తుంది చిత్తాన్ని ఏకాగ్రం చేసి
తపస్సు చేసినప్పుడే –
అట్టి నేత్రాలు పుష్పాన్ని చూస్తే పుష్పపు
లోతుల్లోకి పోతాయి చూపులు
ఆశ్చర్య జనకములు ఆ లోతులు!
పుష్పం ఫలాన్ని కంటుంది
ఫలం గర్భంలో బీజం ఉంటుంది.
బీజంలో వృక్షం ఉంటుంది – ఇలా
ఇదొక అవిచ్చిన్న సృష్టి వలయం
పుష్పం లేకపోతే సృష్టి లేదు –
పుష్పాలన్నీ తల్లులే’
సృష్టిలో అన్ని ప్రాణుల్లో నూటికి యాభై
పుష్పవతులౌతాయి
ఆ ప్రాణుల్లో మనుష్య జాతి ఒకటి –
పుష్పవతులైన మానవీయ జాతి వారందరూ
మాతృదేవతలే
భార్య కూడా భర్తకు మాతృదేవతయే ఇది
కీలక రహస్యం – ఇది కీలక సత్యం
ఈ సత్యాన్ని ఉల్లంఘించిన వాడు
పాప పుణ్యాలనేవి ఉంటే
పాపగ్రస్తుడే అవుతాడు
జాగ్రత్త!
                                  2) వాజులో ఒక రెమ్మనానుకుని
వాజులో ఒక రెమ్మనానుకుని
విలాసంగా వెనక్కి వంగి నిల్చున్న గులాబీ
పంచమ స్వరానికి గొంతెత్తిన
గీతికలా ఉంది.
ఆ తరుణంలో దాని ఒక్కొక్క రేకకూ
వందేసి వ్యాఖ్యానాలు చెప్పవచ్చు
మనసు ఈ మెలికె సంతరించుకున్నవేళ
సంధ్యా మహత్తు సాక్షాత్కరిస్తుంది.
గుంటూరు శేషేంద్ర శర్మ .
3 మొదటి కల 
"చైత్ర మాసపు గాలి వీచిందో లేదో 
చెట్లు పూయాలని నిర్ణయించుకున్నాయి 
పూలు పెదవులు విప్పాయి పుప్పొడి రహస్యాలు వినిపించడానికి -
ఇప్పుడు ప్రతి చెట్టూ ఒక దేవాలయం పక్షులన్నీ ఎగిరే దేవతలు 
కొమ్మ కొమ్మలో పాటల పోటీలు 
గడ్డి పువ్వులో కూడా గాంధర్వ లోకం -
ఇది వసంతం , ఈ సంవస్చారం కన్న మొదటి కల. ..... "
వసంతం అంటే 
కోకిలల పాఠశాల 
పక్షుల సంగీత అకాడెమీ 
ఒక్కో పక్షీ వెయ్యేసి పాటలుగా 
రూపాంతరం చెందే ఋతువు 
పచ్చగా పంచమంలో పాడే 
మామిడి చెట్టు 
నడవడం తప్ప 
చైత్రం కోసం 
చైత్రం కోసం 
ఏమైనా చేస్తానంటుంది 
అందుకే లోకం ఎప్పుడూ 
ఒక కొత్త వసంతం కోసం 
ఎదురు చూస్తుంది. 
-------------
                                                                  నేను ఒక పాటని 

నేను ఒక పాటని 
అడవిలో సరిగమలు అల్లుతూ 
ముత్యాల గుంపులా పరుగులెత్తే
వాగుని 
నీలిమలో మధురిమ చల్లుతూ 
రెక్కల మీద తేలిపోయే 
పక్షిని 
తోటలో వసంతం గుండెలో గ్రీష్మం 
ఎటుపోవాలో తెలీని 
బాటసారిని 
నా వాక్యం ఒక పిల్లనగ్రోవి 
లోపల గాలి తప్ప అర్ధం ఉండదు 
గొంతు మాత్రం
ఎందుకు అంత తీయగా ఉంటుందో ?
-----------

                         ప్రొద్దున్నే స్నానమాడి తామరపువ్వు 


ప్రొద్దున్నే స్నానమాడి తామరపువ్వు 

సరస్సునంతా స్మృతులతో పరిమళభరితం చేసింది. 

దానికి మూర్చపోయి చంద్రుడు అందులో 
పడి కరిగిపోయాడు . 
ఆ మత్తులో సరస్సు రాత్రంతా 
నక్షత్రాల కలలు కంటూ 
ఉండిపోయింది . 
నక్షత్రాలతో తామరమొగ్గలతో 
కలల్ని అలంకరించుకున్న ద్రష్టగా 
సాక్షాత్కరించిన ఆ సరస్సు .

                          -----------------            

      ఒక పువ్వు వికసించిందని పిలుపు వస్తే
ఒక పువ్వు వికసించిందని పిలుపు వస్తే

వెళ్లి దర్శనం చేసుకున్నాను.

సూర్యోదయం లా ఉంది. 
చేతులు జోడిమ్చాను నాకు తెలియకుండానే

ఎవడో తన గొంతు కోకిలలకు జన్మస్థానం అయిన వాడు
గొంతెత్తి పాడుతున్నాడు.

(ఈ కవిత వాల్మీకి రామాయణాన్ని ఉద్దేశించి రాసినది.. కావ్యం ఒక పూవు.అది సూర్యోదయం లా ఉందిఽంటే జ్ఞాన మయం. పాపాలనే,అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతుంది. ఆ కావ్యాన్ని ఆలపించినది ఎవరు?తన గొంతు కోకిలలకు జన్మ స్థలం అయిన వాడు(కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం).. వాల్మీకి రామాయణమే తోలి రామాయణం దానిని అనుసరించి ఎన్నో రామాయణాలు పుట్టాయి.అందుకనే తన గొంతు ఎన్నో కోకిలలకు జన్మ స్థానం అయిన వాడు అన్నారు కవి. ధ్వని ప్రాదానమైన కవిత లలోఇంత అందం ఉంటుందిఽస్వాదించే హృదయం ఉండాలే గానీ
__________

No comments:

Post a Comment

Total Pageviews