Friday, April 10, 2015

కన్ ఫ్యూసియస్ (Confucius From The Heart: Ancient Wisdom for Today's World (పాన్ మాక్మిలన్, 2009).

భారతదేశానికి బుద్ధుడెలాగో, గ్రీసుకి సోక్రటీసెలాగో, చైనాకి కన్ ఫ్యూసియస్ ( క్రీ.పూ. 551-479) అలాగ. గత రెండువేల అయిదువందల చీనా చరిత్రమీదా, సంస్కృతిమీదా ఆయన ముద్ర అపారం.ఇరవయ్యవశతాబ్దిలో ఆయన భావజాలం మీద పెద్ద తిరుగుబాటు చెలరేగింది. కమ్యూనిస్టు చైనా ఆయన్ని ప్రజాస్మృతినుంచి పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. కాని ఇరవై ఒకటవ శతాబ్ది చైనా మళ్ళా తన సమస్యలతో నలుగుతున్నప్పుడు మళ్ళా ఓదార్పుకోసం, దిశానిర్దేశం కోసం ఆయనవైపే చూస్తున్నది.
అందుకొక ఉదాహరణ యు-డాన్ అనే యువభావుకురాలు రాసిన Confucius From The Heart: Ancient Wisdom for Today's World (పాన్ మాక్మిలన్, 2009). ఈ రచన ఒక్క చీనాలోనే కోటిప్రతులు అమ్ముడుపోయిందట. ఇప్పుడు ఈ ఇంగ్లీషు అనువాదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణకి నోచుకుంటున్నది.
ఈ రచనలో యు-డాన్ ' అనలెక్ట్స్ ' పేరిట సుప్రసిద్ధమైన కన్ ఫ్యూసియస్ సుభాషితాల్ని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా వివరించడానికి ప్రయత్నించింది. ఒకప్పుడు నేను లారీ బెత్ జోన్స్ అనే యువభావుకురాలు రాసిన 'జీసస్, ద సి.ఇ.ఓ ' అనే రచన చదివి కూడా ఇట్లానే ముగ్ధుణ్ణయ్యాను. ఈ రచనల్లో నన్ను విశేషంగా ఆకర్షించినవి ఈ రచయిత్రులకు తాము ఎవరిగురించి మాట్లాడుతున్నారో వారి గురించి సాధికారికంగా తెలిసిఉండటం, ఆ తెలివిడిలోంచి ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా వ్యాఖ్యానించడం.
తన రచనకు రాసుకున్న ముందుమాటలో యు-డాన్ ఇలా రాసింది:
' నాకేమనిపిస్తుందంటే, ప్రాచీన ఋషులు తమ వాక్యాలతో ప్రజల్ని భయపెట్టలేదనీ, కఠినపదాలతోనూ, వాగాడంబరంతోనూ ప్రజల్ని మభ్యపరచలేదనీ. 'నేనింక మాట్లాడటం వదిలిపెట్టేద్దామనుకుంటున్నాను ' అన్నాడు కన్ ఫ్యూసియస్ ఒకసారి. ఆ మాట వింటూనే జిగోంగ్ ' మీరే మాట్లాడకపోతే, మీ శిష్యులం, మాకు దిక్కేది? మాకెవరు దారి చూపిస్తారు ' అని అడిగాడు. ఆ మాటలకి కన్ ఫ్యూసియస్ స్తిమితంగా, యాథాలాపంగా ఇట్లా జవాబిచ్చాడు: ' ఆ మాట కొస్తే స్వర్గమెప్పుడన్నా ఏదన్నా మాట్లాడుతుందా? అయినా నాలుగు ఋతువులూ వస్తూపోతూనే ఉన్నాయికదా, శతాధికమైనవెన్నో సంభవిస్తూనే ఉన్నాయి కదా. స్వర్గం మాట్లాడవలసిన పని ఉందా?'.
ఆమె ఇంకా ఇలా రాసింది:
'ఇట్లాంటి సరళ సత్యాలు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోవడానికి కారణం అవి ప్రతి ఒక్క హృదయాన్నీ తట్టిలేపే విధంగా ఉండటమే తప్ప వాళ్ళ మూఢవిశ్వాసాన్ని చూరగొనాలని ప్రయత్నించకపోవడమే...'
'కన్ ఫ్యూసియస్ వివేకం మన హృదయస్పందనాన్ని ఒక్కసారి ఆపి సత్యాన్ని సాక్షాత్కరింపచేస్తుంది. ఒక్కసారిగా మనలో అవగాహన పరవళ్ళు తొక్కుతుంది.ఒక జీవితకాలంపాటు నిర్విరామంగా అధ్యయనం చేస్తేగాని దొరకని అవగాహన అది...
'కాబట్టి మనమీరోజు కన్ ఫ్యూసియస్ నుంచి నేర్వవలసింది వూ చక్రవర్తి మాట్లాడిన కన్ ఫ్యూసియస్ అధ్యయనం కాదు. లేదా చీనాలో దావోయిజం, బౌద్ధాలతో పాటు సమానంగా వర్ధిల్లిన కన్ ఫ్యూసియన్ మతాన్నీ కాదు. వాదవివాదాల్తో కూడిన కన్ ఫ్యూసియన్ పాండిత్యం అంతకన్నా కాదు.'
'అదేమిటో మాటల్లో పెట్టలేకపోయినా ప్రతి మనిషీ తన హృదయంలో అనుభూతి చెందే సరళసత్యాల్నే కన్ ఫ్యూసియస్ సుభాషితాలనుంచి మనమేరుకోవలసి ఉంటుంది.'
'నా ఉద్దేశ్యంలో కన్ ఫ్యూసియస్ వివేకం మన చేతుల్ని కాల్చే నిప్పూ కాదు, లేదా గడ్డ కట్టించే మంచూకాదు. అది మన శరీర ఉష్నోగ్రత కన్నా కొద్దిపాటి వెచ్చన. అంతే. ఆ వెచ్చదనంతోనే అది యుగాలుగా వర్ధిల్లుతూవస్తున్నది.'
ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలున్నాయి. దేనికదే ఎంతో విలువైన అధ్యాయమే అయినప్పటికీ. The Way of Ambition అనే అధ్యాయం చాలా విలువైందిగా అనిపించింది. ఎందుకంటే నేటికాలపు మానవుడు చాలా ambitious ఇప్పటి మన సాహిత్యం, రాజకీయాలు, సినిమ్నాలు మన యాంబిషన్ ని తృప్తి పరిస్తేనే ప్రజాదరణకి నోచుకోగలుగుతున్నాయి. చివరికి దేవుడూ, దేవాలయాలూ, భక్తి, ఆధ్యాత్మిక సాహిత్యం కూడా ప్రజల యాంబిషన్ ని తృప్తి పరిస్తేనే వాటికి జనాదరణ. ఇటువంటి సమాజానికి కన్ ఫ్యూసియస్ ఇవ్వగల సలహా ఏమిటి?
అందుకామె కన్ ఫ్యూషియస్ అనలెక్ట్స్ 11 వ అధ్యాయంలోని ఒక చర్చను ఉదాహరిస్తూ కొంత వివరించింది. ఆ చర్చ ఇలా ఉంది.
ఒకప్పుడు కన్ ఫ్యూషియస్ తన నలుగురు శిష్యులు జీ-లు, రాన్ -కియు, గోంగ్షి-చి, జెంగ్-దియాన్ లతో కూచుని ఉన్నాడు. వాళ్ళ సంభాషణ జీవితాశయాలవైపు మళ్ళింది. కన్ ఫ్యూషియస్ తన శిష్యుల్నిలా అడిగాడు: 'మీరు యువకులు, విద్యావంతులు, ఎవరైనా మీ శక్తి సామర్థ్యాల్ని గుర్తించి మీకు తగిన అవకాశమిస్తానంటే మీరేం చేస్తారో వినాలని ఉంది, చెప్పండి ' అన్నాడు.
అప్పుడు మొదటి శిష్యుడు జీ-లు వెంటనే ఇలా అన్నాడు: 'రెండు రాజ్యాలమధ్యనుండే చిన్న రాజ్యాన్నొకటివ్వండి నాకు. ఆ రాజ్యానికి బయటనుంచి దండయాత్రల భయం, లోపల కరువుకాటకాల ప్రమాదముందనుకోండి, అయినా కూడా మూడేళ్ళలో నేనా ప్రజలకి అన్నవస్త్రాల లోటు లేకుండా చేస్తాను. వాళ్ళని ఉత్తేజితుల్ని చేస్తాను, నైతికతత్పరుల్ని చేస్తాను ' అన్నాడు.
ఆ మాటలు వింటూ కన్ ఫ్యూషియస్ చిరునవ్వు నవ్వి రెండవ శిష్యుడి వైపు తిరిగాడు. అతడు, రాన్-కియు ఇలా అన్నాడు: 'నాకు యాభై-అరవై లేదా అరవై-డెబ్భై చదరపు మైళ్ళ విస్తీర్ణముండే మండలాన్నివ్వండి, మూడేళ్ళలో అక్కడి ప్రజలకు అన్నవస్త్రాల లోటు లేకుండా చేస్తాను. ఇక వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాలంటారా, అది ఎవరైనా ఋషీశ్వరుడి చేతుల్లో పని. నేను తీర్చగలిగేది కాదు 'అన్నాడు.
అప్పుడు కన్ ఫ్యూషియస్ మూడవ శిష్యుడి వైపు తిరిగి 'గోంగ్షి, నీ మాటేమిటి? 'అనడిగాడు. గోంగ్షి నెమ్మదిగా 'నేను ముందు తెలుసుకోవాలనుకుంటాను, మరింత నేర్చుకోవాలనుకుంటాను. అప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగబాధ్యత స్వీకరించి నాకప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను ' అన్నాడు.
ముగ్గురూ కన్ ఫ్యూషియస్ శిష్యులే. ఆయన బోధల్ని వంటపట్టించుకున్నవారే. మానవుడు తన సామర్థ్యాల్ని సమాజం కోసం ఎలా వినియోగించాని కన్ ఫ్యూషియస్ బోధించాడో ఆ మెలకువ గ్రహించినవారే. అయినా కన్ ఫ్యూషియస్ ఆ ముగ్గురి మాటల దగ్గరా ఆగలేదు. అంతదాకా మాటాడకుండా ఉన్న నాలుగవ శిష్యుడు జెంగ్ దియాన్ వైపు తిరిగి 'దియాన్, నువ్వేమీ మాట్లాడనే లేదు. నువ్వేమమటావు? 'అనడిగాడు.
దియాన్ అప్పటిదాకా యాభైతంత్రుల సంగీతవాద్యమొకటి వాయిస్తూ ఉన్నాడు. గురువు తనని ప్రశ్నించగానే అతడు తన వాద్యం మీద పలుకుతున్న రాగప్రస్తారం పూర్తిగా సద్దుమణిగేదాకా ఆగాడు. అప్పుడా వాద్యాన్ని నెమ్మదిగా పక్కన పెట్టి వినయపూర్వకంగా లేచినిల్చుని 'నా ఆలోచనలు నా మిత్రులకన్నా భిన్నమైనవి. నేను వాటిని చెప్పవచ్చునా? అనడిగాడు.
'ప్రతి ఒక్కర్నీ చెప్పమనే కదా అడుగుతున్నాను. నీ భావాలేమిటో నువ్వు కూడా చెప్పు ' అన్నాడు కన్ ఫ్యూషియస్.
అప్పుడు దియాన్ ఇలా చెప్పాడు: 'నా కోరికేమిటంటే, ఈ వసంతకాలం ముగిసిపోకుండానే, కొత్త దుస్తులు తీసుకుని, కొందరు మిత్రులతో, పిల్లలతో యీ నదీతీరానికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రకృతి అంతా కొత్తగా ప్రాణం పోసుకుంటూ చెట్లు చిగురిస్తున్న దృశ్యం చూడాలనుకుంటున్నాను. వసంతకాలపు వెచ్చదనానికి ఇప్పుడిప్పుడే మంచుకరుగుతున్న నదీజలాల్లో స్నానం చెయ్యాలనుకుంటున్నాను. స్నాం చేసాక కొత్త దుస్తులు ధరించి వసంతపవనంలో ఓలలాడాలనుకుంటున్నాను. ఆ వసంతగాలి మా అందరిలోపలకీ వీచి మాలో ఒకటైపోవాలనుకుంటున్నాను. నవజీవనశోభతో అలరారే ఈ ఋతువులో నా జీవనక్రతువుని ఉత్సవంగా జరుపుకోవాలనుకుంటున్నాను. ఇక అట్లా గడిపినంతసేపు గడిపాక మేమంతా పాటలు పాడుకుంటూ ఇంటిదారి పట్టాలనుకుంటున్నాను. ఇంతే. ఇంతకుమించి నాకే జీవితాశయమూ లేదు ' అన్నాడు.
ఆ మాటలు వింటూనే కన్ ఫ్యూషియస్ దీర్ఘంగా నిట్టూర్చి 'నా కోరిక కూడా నీ లాంటిదే' అన్నాడు.
ఈ కథ గురించి చాలా సుదీర్ఘంగా తన భావాలు వివరిస్తూ యు-డాన్ చివరకు చెప్పిందేమిటంటే, ఒక మనిషి తన సామాజికబాధ్యత ఎంతబాగా నెరవేర్చాడన్నదాన్ని బట్టి అతడి ఆంతరంగిక ప్రశాంతి ఆధారపడదనీ, అందుకు బదులు, అతడి ఆంతరంగిక ప్రశాంతివల్ల మాత్రమే అతడు తన సామాజికబాధ్యతని మరింత సక్రమంగా నెరవేర్చగలుగుతాడనీ.
దీన్నిబట్టి నిజమైన జీవితాశయం ఏది? అది మనం చేసే పనులకి లభించే సామాజిక ఆమోదం వల్ల నిర్ధారితమయ్యేదికాదు. మన ఆంతరంగిక ప్రశాంతిని నలుగురికీ పంచగగలడమే నిజమైన జీవితాశయమని అనుకోవలసిఉంటుంది.
బహుశా అత్యున్నత భారతీయ ఆధ్యాత్మికవాక్యాలు బోధిస్తున్నది కూడా ఇదేకదా.

No comments:

Post a Comment

Total Pageviews