Thursday, April 23, 2015

భధ్రుడు గారి ఒక అనువాద అనుభూతి కవిత


"నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు నీ నవ్వు చాలమ్మా ఎందుకు వేకువలు" ఒక కవి అన్నాడు. మా విశ్వ కవి మిత్రుడు భద్రుడు రాసిన ఒక పదం చాలు. మన మనోపధంలో నిలిచి పోవడానికి ఒక వాక్యమైనా మహా కావ్యం! ప్రపంచ సాహిత్యానికి మహా భాష్యం చెప్పే భావకవి... అనుభవకవి!  అనుభూతి కవి! ఆ భవభూతి కవి!! మిత్రమా వెయ్యేళ్ళు వర్దిల్లుమా!!!  

నిన్న Ramarao Kanneganti ఫేస్ బుక్ లో ఇన్నిస్ ఫ్రీ చెరువు
చెరువుదగ్గరికి వెళ్ళి ఫొటో తీసి 'భద్రుడూ, ఇది మీ శరభవరం ' అని రాసి నన్ను సంతోష సంభ్రమానికి గురిచేసాడు.
ఆ వాక్యం చూసినప్పుడు కలిగిన ఆ పులకింత రోజంతా అట్లానే ఉంది. రాత్రి భోజనాలప్పుడు విజ్జికీ, పిల్లలకీ చెప్పాను కూడా. ఎక్కడి శరభవరం, ఎక్కడి ఇన్నిస్ ఫ్రీ సరోవరం!
సాహిత్యమే కదా ఒక సేతువు కట్టింది.
ఆ వాక్యం మళ్ళా మళ్ళా గుర్తొస్తున్నప్పుడల్లా నాకు మరెన్నో స్థలాలు కాలాలూ మదిలో మెదుల్తూ ఉన్నాయి. చీనాలో ఒకప్పుడు తాంగ్ రాజవంశానికి రాజధానిగా ఉన్న చాంగాన్ ( ఇప్పటి క్సియాన్ ) లో దు-ఫూ, లి బాయ్ లు కవిత్వం చెప్పిన రోజులు, ఉత్తర జపాన్ లో సైగ్యొ కవీంద్రుడు నడిచిన దారుల్లో బషొ కూడా వర్ణించిన శిరాకవా సరిహద్దు, అక్కడి విల్లో చెట్టూ, గొగోల్, డాస్టవస్కీ, టాల్ స్టాయి ల మొదలుగా ప్రతి రష్యన్ మహారచయితా వర్ణించిన సెంట్ పీటర్స్ బర్గ్ వీథులు, బ్యునోస్ ఎయిర్స్ నేషనల్ లైబ్రరీ నేలమాళిగలో బోర్హెస్ తడుములాడిన పుస్తకాల అల్మైరాలు, - ఇలాంటివే ఎన్నో మదిలో మెదిలాయి.
రామారావు కన్నెగంటి వీటన్నిటినీ నా కళ్ళతో చూడాలి,చూసిన ప్రతి తావునుంచీ నాకో సందేశం పంపాలి.
అదీ కాక, వసంతంలో తోలివసంతం నుంచి మలివసంతానికి మలుపు తిరిగే ఈ చైత్రవైశాఖాల సరిహద్దులో నిలబడినప్పుడు నాకు బ్రౌనింగ్ కవి వాక్యాలే పదేపదే గుర్తొస్తూన్నాయి:
O to be in England
Now that April's there
And whoever wakes in England
Sees, some morning unaware
That the lowest boughs and the brushwood sheaf
Round the elm tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England -now!
And after April, when May follows,
And the whitethroat builds and all the swallows!...
ఆ వాక్యాలు నాలో ఈ వాక్యాల్ని కదిలిస్తూన్నాయి.
వైశాఖం ప్రవేశించినప్పుడు
ఉండవలసింది నువ్వా కొండల్లో
ఇక్కడ నగరవీథుల్లో
దట్టంగా పరుచుకున్న చెట్టునీడలు
నీకు తూర్పుకనుమలుగానే గోచరిస్తాయి.
వేసవిరాత్రుల్లో మీ ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు
రాత్రి పదిగంటలెప్పుడవుతుందా అని రోజంతా చూసేవాడివి
అప్పుడు మాసిన కోరారంగు తెరవెనక
వాళ్ళు హారతిపట్టి 'పరబ్రహ్మ పరమేశ్వర 'అనగానే
నీలో ఒక నిండారు జలపాతం.
ఇప్పుడు తురాయి చెట్లగుబుర్లలో
తొలి ఎరుపురేకలట్లా హారతివెలిగించాయి.
ఇప్పుడు నువ్వు ప్రాచీన చీనానగరం చాంగాన్ లోనే ఉన్నావు
వీథుల్లో రాలుతున్న పసుపు పూలమధ్య నడుస్తూ
ప్రాచీన చీనాకవిలా నువ్వు కూడా
కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదనుకుంటావు.
రోజులెంత నిర్దయగా,
నిస్సారంగానైనా గడవనివ్వు,
కాని ప్రతి వైశాఖం నీకోసం
గుప్పెడు శనగల్లాగా
వేసవి సోమరిక్షణాల్ని
పట్టుకొస్తూనే ఉంటుంది.

No comments:

Post a Comment

Total Pageviews