Saturday, April 18, 2015

కీ.శే.జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) గారి పద్యాలు

 కీ.శే.జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) గారి పద్యాలు

          దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో దేవుడికి నమస్కరిస్తూ, మనం మన అంతులేని కోర్కెల చిట్టాని ఏకరువు పెట్టి, ఎల్లప్పుడూ మన యోగాక్షేమాలని ఆయనే చూడాలని అనుకుంటాం తప్ప, దైవం గురించి పట్టించుకోము కానీ మన కరుణశ్రీ గారి ఈ అంజలి పద్యాలు చదవండి.   

1) అంజలి        

సీ|| పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
                
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాదిదేవ
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు

           
సీ||లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను


సీ||కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి
                      
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!


 ఉదయశ్రీ నుండి .

ఎంత ఉదాత్త రమణీయం అయిన భావన కదూ ! ప్రేమ మీద ,ఈ చక్కని పద్యంతో అందరికీ నవోదయం .


ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర 

మిరుసు లేకుండనే తిరుగుచుండు 

ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు 

నేల రాలక మింట నిలిచియుండు 

ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ 

కడలిరాయడు కాళ్ళు ముడుచుకోనును 
ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల 
గాలిదేవుడు సురటీలు విసరు


ఆ మహాప్రేమ :శాశ్వతమైన ప్రేమ:


                                                  అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ 


                                                   నిండియున్నది బ్రహ్మాండభాండ మెల్ల 
ప్రేయసీ !సృష్టి యంతయు ప్రేమమయము
___/i\___

        2) అద్వైతమూర్తి

ప్రేయసి ప్రియుల మధ్య ప్రణయాన్ని ఎంతో ఉదాత్తంగా, ఉన్నతంగా భావిస్తూ ప్రణయసుందరిని వర్ణిస్తూ, ఆమె కాటుక కన్నులలోని ఆలోచనలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ, ప్రేయసి చిరునవ్వులోని సంకోచాలు ఎందుకో అని ప్రశ్నిస్తూ అలతి అలతి లలిత మైన మన తెలుగు పదాలతో పద్యాలల్లిన సాహితీ కల్పవల్లి కరుణశ్రీ.  

చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆ
లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!

దాంపత్య ప్రేమను వర్ణిస్తూ.... 

మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్
గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్

నువ్వు, నేను అని తేడాలేని ఏకత్వాన్ని సూచించే తత్వమే అద్వైతం. ప్రేయసీ ప్రియులు ఇద్దరు ఒక్కటే అన్న భావంతో అల్లిన ఈ పద్యంలో “నీవే నేనుగ నేనే నీవుగ లతాంగీ” అన్న ప్రియుని పలుకులు అద్వైతాన్ని త్వమేవాహం అంటూ ...అన్వయించుకుంటున్నాయి. 

భావోద్యానమునందు క్రొత్తవలపుంబందిళ్లలో కోరికల్
తీవెల్ సాగెను పూలు పూచెను; రసార్ద్రీభూతచేతమ్ముతో
నీవే నేనుగ నేనే నీవుగ లతాంగీ! యేకమైపోద మీ
ప్రావృ ణ్ణీరద పంక్తి క్రింద పులకింపన్ పూర్వపుణ్యావళుల్!

3) సాంధ్యశ్రీ

‘కంజదళాక్షి ప్రణయ గానమ్ములో పులకించే’ ఒక ప్రియుని వర్ణన ఈ పద్యం.

అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!

అప్పుడే స్నానం చేసి, తన సన్నని వేళ్ళ అంచుల కురుల తడి ఆర్చుకొంటున్న ప్రేయసిని వర్ణిస్తూ ప్రియుడు చెప్పే సందర్భం లోని ఈ క్రింది పద్యం చదవండి 

క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
భ్యంజనమంగళాంగి! జడ లల్లుదునా – మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు
ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా 


ప్రేయసి కోసం యముణ్ణి సైతం ధిక్కరించడం 

సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీరువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలుచేతునా!


4) కళ్యాణ కరుణశ్రీ 
ఎంతో మనోహరంగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కళ్యాణ వేడుకను, దాని పరమార్ధాన్ని అభివర్ణించారు. తంతులు కన్నా హంగు ఆర్భాటాలకు మారుపేరుగా ఉన్న నేటి కళ్యాణవేదికలపై ఇటు వంటి పద్యాలు ఆలపిస్తే ఆనాటి మధురానుభూతులు మరల మనసొంత మౌతాయి
పెండ్లి:బృందారకానంద మందార మకరంద
          బిందునిష్యందాల విందు పెండ్లి :
రంగారు ముంగారు సరసాంత
          రంగాల సత్యనర్తనము పెండ్లి :
సోగాకన్నులరాణి రాగరంజితపాణి
          రాణించు మాణిక్యవీణ పెండ్లి :
చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
          నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి:
ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి :
అక్షయంబైన శ్రీరమరాక్ష పెండ్లి :
వధువు వరుడును “ద్వంద్వ” మై మధువు గ్రోలు
ప్రేమ బృందావనారామసీమ పెండ్లి ::
---------


"పుష్ప విలాపం" విన్న తరువాత భక్తుడు నేలను రాలిన పూలనే ఏరుకుంటూ ఉండటం, అది చూసి పుష్పాలు ఆనందించటం చక్కటి భావన. వడ్డాది వారి నైపుణ్యం

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ !!
ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి  
అప్పుడు...
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై..!!
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ!!
ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారము చేసాము
గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే
యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..!!
'ఊలు దారాల'తో గొంతుకురి బిగించి గుండెలోనుండి
సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జెవితమెల్ల మీకయి త్యహించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా
వోయీ మానవుడా..!!
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ..!!
అని దూషించు పూలకన్నియలను కోయలేక, వట్టిచేతులతో వచ్చిన "నా యీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ రేఖలను ....ప్రసరింపుము ప్రభూ"._'కరుణశ్రీ'


------------



కమనీయం అయిన కవిత్వం ఎలా ఉండాలో కరుణశ్రీ మాటల్లోనే చూద్దామా ?

.. మీరు మళ్ళి టైపు చేసే పని లేకుండా . కవితా వైజయంతి

ఉత్పల మాలిక

దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా

డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి క

న్మూసిన భంగి, కన్నె నగుమోము పయిన్ నునుసిగ్గుమొగ్గ కై
సేసినభంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్
కాసిన భంగి, జానపదకాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై
వ్రాసిన భంగి, పెండ్లి తలఁబ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళావిపంచికల్
మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్
భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడున్
భాసిల తెల్గుకైత నవభంగుల సంగతమై, యొకింతయున్
దోసములేని శబ్దములతో, నటనం బొనరించు పాద వి
న్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి
ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో, మృదుశయ్యతో, అనా
యాస సమాసయుక్తి కలశాంబుధి తీర పురోనిషణ్ణ దే
వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాసవిలాస విభ్రమకరాంచల చంచల హేమకుంభ సం
భాసి సుధాఝురీ మధురిమమ్ములు గ్రమ్ము కొనన్ వలెన్; శర
న్మాస శుచిప్రసన్న యమునాతట సైకత సాంద్రచంద్రికా
రాస కలా కలాప మధుర వ్రజ యౌవత మధ్య మాధవ
శ్రీసుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సారసంపదల్
రాసులు రాసులై పొరలి రావలె; పొంపిరి పోవలెన్ నవో
ల్లాస వసంత రాగ రస లాలిత బాలరసాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్!

ఎంత మనోజ్ఞం గా ఉంది కదూ ? మన భావ లోకంలో ఉహించి చూడవలసినదే
----------
--
"ఆడుకున్నారిచట ఆమ్నాయ బాలికలు 
యుగవీధులందు నాలుగు స్తంభములయాట 
పాడుకున్నారిచట బ్రహ్మర్షి సత్తములు 
గంగాతరంగిణీ గతులలో శృతి గలిపి . 
కాళిదాస కవీంద్రు కవితాకుమారి నా 

శిఖరామ్చాలములందు స్వేచ్చగా తిరిగినది 

కంది కుందెడి యక్షసుమ్దరికి చల్లగా 
అందించినది "మేఘసందేశ "మిచ్చోట .

ఇది నా తపోభూమి ఇది నా మహాభూమి 
బదరీ మహాక్షేత్ర పరమపావన భూమి 
సత్యధర్మముల కాశాజ్యోతి యగుభూమి 
శౌర్య ధైర్యముల స్వేచ్చాగీతి యగు భూమి . 
భావిభారత నిరభ్యంతరానంద సం 
భావనాహ్లాద భర పారవశ్యుడ నేను 
ఆరద్ర మానస పులకితాంత రానందాశ్రు 
వాహినీ భరిత హిమవద్గిరీంద్రుడ నేను "

కరుణశ్రీ
-- 

No comments:

Post a Comment

Total Pageviews