Friday, April 24, 2015

A poem for today:


5) 
A poem for today:
అంతా ఆదమరిచినిద్రపోయే అర్థరాత్రి
బయటకివచ్చిచూడు
మామిడిచెట్ల కొమ్మలమధ్య మాఘమాసపుగాలి
ఊయెల్లో పసిపాపలాగా
కనులరమోడ్చి తనలోతనే
నవ్వుకుంటూ కనిపిస్తుంది.

ఎవరూ సొంతంచేసుకోని ఆ చివరిజాము రాత్రి
చంద్రుడొక్కడూ నాకోసం వేచిఉంటాడు
ఒక అనార్ద్ర లోహశకలంలాంటినన్ను
అయస్కాంతశిలలాగా అతడు తాకగానే
చేతుల్లాగా ప్రాణాలు చాపి
రాత్రంతా ఆకాశాన్ని పట్టుకు వేలాడుతుంటాను.
లోయలో సెలయేటివద్ద
రాత్రి చిరుతపులులు నీళ్ళుతాగేటప్పుడు
ఈ చంద్రుడే కదా ఒక కంటకనిపెట్టి ఉంటాడు
అందుకని నా మనోకాననంలో కూడా
ఒక దివ్వెనట్లా
ఎప్పటికీ వెలిగించిపెట్టుకుంటాను.
రైల్లో ప్రయాణీకురాలు
తెల్లవారుతూనే అన్నిటికన్నాముందు
జుత్తు దువ్వుకుని జడవేసుకున్నట్టు
నేను కూడా వేకువకాగానే
రాత్రంతా చిక్కుముళ్ళు పడ్డ నా తలపుల్నిట్లా
ఒద్దిగ్గా ఒక పక్కకు అల్లుకుంటాను.
6) 
A poem for today:
మాఘమాసపు అడవి ఎదట నేను మళ్ళా
పదేళ్ళ బాలుణ్ణి కావాలని ఉంది.
పాతికేళ్ళ యువకుణ్ణి కూడా.
చెట్లు ఆకులు రాలుస్తుండే దృశ్యం
చూస్తూనే ఒక జీవితకాలం గడిచిపోయింది.
కృష్ణదేవిపేట ఏడొంపులఘాటి
కాకరపాడునుంచి బోయపాడువెళ్ళే డొంకదారి
గుమ్మలక్ష్మిపురం, కెరమెరి,నల్లమలకొండల్లో
ప్రతి ఒక్కచోటా మాఘమాసం
నా చిన్నప్పటి నల్లజీడిచెట్లతమకంతో
నన్ను హత్తుకుంటూనే ఉంది
ప్రేమించాను,పోరాటం చేసాను
ఊడిగంచేసాను, ఉమ్ములు మోసాను
జీవితవాంఛ కొడిగట్టినప్పుడల్లా
ఒత్తి కత్తిరించి నన్ను సరిచేసే
దివ్యమానుషహస్తాలెక్కడని పరితపించాను.
ప్రపంచంతో రాజీపడలేను
అలాగని ఒదులుకోలేను
ఎప్పటికప్పుడు చిక్కుముడి పడుతున్న
నా మనోపాశాన్ని సరిదిద్దే
ఒక కేశపాశం కోసం
కలలుకనకుండా ఉండలేను.
ఇప్పుడిక్కడ నా ఇంటివాకిట
రోజంతా రాలుతున్న మామిడిపువ్వు
గతించిన జీవితం తీపినిచ్చిందో, చేదువిరిగిందో
రేపు తెలుస్తుందని నమ్ముతూ
నిద్రలేని ప్రతిరాత్రినీ ఈదుకొస్తున్నాను.
విస్ఫారితనేత్రాలతో ఒక అడవినో, కడలినో
తొలిసారిచూసినట్టు
ఈ ప్రపంచాన్ని చూడాలని సాధన చేస్తున్నాను.
బహుశా నన్ను నన్నుగా అంగీకరించే
కాలం, దేశం, నేస్తం కనిపించినప్పుడే
నా చిన్నప్పటి మాఘసూర్యకాంతి
మళ్ళా నా చేతికి చిక్కుతుందనుకుంటాను.
7) 
A poem for today:
రాజు మిళిందుడు నాగసేనుణ్ణి అడిగాడు: 'మనసు లక్షణమేమిటి, ప్రజ్ఞ లక్షణమేమిటి?'
'పట్టుకోవడం మనసు స్వభావం, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావం ' అన్నాడు నాగసేనుడు.
'పట్టుకోవడం మనసు స్వభావమెట్లా అయ్యింది, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావమెట్లా అయ్యింది?, 'అని అడిగాడు రాజు. 'ఒక ఉదాహరణ చెప్పు 'అన్నాడు:
'రాజా మీరెప్పుడైనా గోధుమపంట కోతలు కొయ్యడం చూసారా?'
'చూసాను.'
'ఆ పంటపొలాలు ఎట్లా కోత కోస్తారు?
'ఎడమచేత్తో నాలుగైదు వెన్నులు పట్టుకుంటారు, కుడిచేత్తో కొడవలి తీసుకుంటారు, దాంతో పంటకోస్తారు.'
'సరిగ్గా అలానే ప్రభూ, మనసుతో పట్టుకోవాలి, ప్రజ్ఞతో తెంచుకోవాలి 'అన్నాడు నాగసేనుడు.
-మిళిందపన్హ 2.1.8 (32-33)
పట్టుకున్నంతకాలం పట్టుకునే ఉండిపోయాను
తెంచుకోవాలనుకున్నప్పుడు పరపరా తెంపేసాను
రెండింటిలోనూ శాంతిలేదు,
దట్టంగా అల్లుకున్న పొగ తప్ప.
నువ్వు పట్టుకున్నప్పుడల్లా
ఒక సీతాకోకచిలుక నీ వేళ్ళ మధ్య
గిలగిలకొట్టుకుంటూనే ఉంది
ఒక తూనీగ విలవిల్లాడుతూనే ఉంది.
నువ్వు వదిలిపెట్టేసినప్పుడల్లా
ఒక కుక్కపిల్ల ముణగదీసుకుని
చలిలో వణుకుతూనే ఉంది.
పంజరం తలుపులు తెరిచినా
పావురం బయటికి పోలేకుంది.
నువ్వెవరినైనా ప్రేమించడమంటే
నీకు నిష్కారణంగా దయకలగడం
కాని ప్రేమ కొనసాగాలంటే
నువ్వు నిర్దయకూడా నేర్చుకోవాలి.
8) 
An Afternoon in Agra…
A poem by Vadrevu Chinaveerabhadrudu
(Translated by Sri Nauduri Murty)
That was an afternoon in Agra
As the late sagittal sun
Prevailed up to the welkin.
Like the tang of tart of a fruit,
There was a mild bite in it.
That ageless dream… Taj Mahal … looked as if
Somebody had set it over this earth only yesterday.
The marmoreal Minars were
Splendid in the hoary afternoon sun.
Another generation of admirers
Lie in front of her spellbound.
In the lawn in front of me there was a flower
And a Bumble Bee was hovering over its antheral centre.
The bee for the flower
And the flower for the bee…
My eyes were feasting on
The essay of their meetings and partings.
Endlessly … people were flocking around
The delectable monument with cameras in hand.
There was an invincible flower
In front of me this afternoon.
That might wither by the end of the day.
But here was a Bumble bee
Tipsier with love than Shah Jahan.
.
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
.
ఆకాశమంతటా ఆవరించిన
మలిహేమంతపు ఎండలో
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
పండులో పుల్లదనంలాగా చలి.
పురాతన స్వప్నం తాజమహల్ ఎవరో
నిన్నరాత్రే భూమ్మీద ప్రతిష్ఠించినట్టుంది.
మెరిసిపోతున్న పాలరాతి గుమ్మటాలు
ధవళ అపరాహ్ణశోభలో.
సాగిలబడుతున్నారు దాని ఎదట
కొత్త ఆరాధకులు మరికొందరు.
నా ఎదట పచ్చికలో పుష్పం
దాని పరాగకేంద్రంలో ఒక భ్రమరం
పుష్పంకోసం భ్రమరం
భ్రమరంకోసం పుష్పం
వాటి మిలన పునర్మిలనాలతో
నా కళ్ళు పండుగ చేసుకున్నాయి.
మూగుతూనే ఉన్నారు మనుషులు
కెమేరాల్తో ఆ రమ్యమహల్ చుట్టూ
ఈ మధ్యాహ్నం నా ఎదట
దినాంతానికి రాలిపోయే
అజేయ పుష్పం. షాజహాన్ కన్నా
ప్రేమోన్మత్త భ్రమరం.

10) 
కవిత
ఫిబ్రవరి రాగానే మంకెనలు పూస్తాయనుకునేవాణ్ణి,కాదుమంకెనలు మొగ్గతొడుగుతూనే
ఒక మాఘమాసాన్ని సృష్టిస్తాయి.
నిండుగా పూసినమంకెనలచుట్టూ
నీలిపొరలు,ఊదారంగుధూళి-
నా బాల్యంలో పూర్తిగా వినలేకపోయిన
పాటలన్నీ మళ్ళా అక్కడ ప్రత్యక్షమవుతాయి.
నేను తిరిగిన కొండలదారుల్లో
రాలిన ఇప్పపూలు,నల్లజీడిచెట్లు,తపసిమాకులు-సంతనుంచి ఆవును పల్లెకు తీసుకుపోతున్న రైతులా
మాఘమాసం నన్ను నగరంనుంచి అడివికి తీసుకుపోతుంది.
ఇన్నేళ్ళుగా ఎంతో ప్రయత్నించాను
మరొక కొత్త దృశ్యమేదన్నా నన్ను ప్రలోభపరుస్తుందని వేచి చూసాను
నన్ను మైమరిపించగల ఒక మనిషి ఉనికికోసం
నా జీవితం సర్వం సమర్పించడానికి సిద్ధపడ్డాను
పూసినమంకెనచెట్లు కనబడగానే
ప్రపంచంనాకు నేర్పిన పాఠాలన్నీమర్చిపోతాను
రంగులెట్లా కలపాలో ఎంతసాధనచేసినా
రంగులపళ్ళెం ముందు నిలబడ్డప్పుడు తొట్రుపడ్డట్టే
మాఘమాసం ఎదట నేను మూగబోతాను.
వందేళ్ళ తరువాత ఒక పిపాసి
ఇప్పటి మనుషులు ద్వేషించుకోడందూషించుకోడంకాకుండా
మరేమన్నా చేసారా అని అనుకున్నప్పుడు
చినవీరభద్రుడు మంకెనల ఎదట 
మూర్ఛపోయాడని  కవిత గుసగుసలాడుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews