Friday, April 24, 2015

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80

AP Residential Junior College, Vijayapuri South, Nagarjuna Sagar is going to celebrate Ruby Jubilee on 31st and and 1st at Sagar. On this occasion, a memoir:
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80 లో చదువుకున్నాను. ఆ కళాశాల నా జీవితాన్ని ఊహించని విధంగా మలుపుతిప్పింది.
నేను 1972 నుంచి 78 దాకా తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. తాడికొండ పాఠశాలలో నేను మొదటి బాచ్ స్టూడెంటుని. 78 లో పదవతరగతిలో నాకు రాష్ట్రంలో పదవరాంకు వచ్చింది. అప్పట్లో మొదటి పదిరాంకులు తెచ్చుకున్నవాళ్ళకి సాగర్ కి ఎంట్రన్సు టెస్టు రాయనక్కర్లేకుండానే ప్రవేశం దొరికేది. పైగా కోరుకున్న బ్రాంచిలో కూడా సీటు దొరికేది. ఆ రోజుల్లో రాంకులు తెచ్చుకున్న విద్యార్థులంతా అయితే ఎం.పి.సి నో లేదా బి.పి.సి నో తీసుకునేవాళ్ళు. కాని నేను సి.యి.సి తీసుకున్నాను. ఆ రోజుల్లో అదొక పెద్ద సంచలనం. నేను సి.యి.సి కోరుకుంటున్నాని ఎలా తెలిసిందో గాని, నేను కాలేజికి వెళ్ళేటప్పటికే ఒక సెలబ్రిటిగా మారిపోయాను. కొన్నాళ్ళ పాటు ప్రతి ఒక్కరికీ నన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది.
మొదటిసంవత్సరంలో సాగర్ నాలో మానసికంగా చాలా కలవరం కలిగించింది. ఆ కలవరానికి చాలానే కారణాలున్నాయి.
మొదటిది, తాడికొండలో ఉన్నప్పుడు మేమంతా తీరప్రాంత జిల్లాలకు చెందినవాళ్ళం కావడంతో అదంతా ఒక పరిమిత ప్రపంచంకిందనే లెక్క. కాని సాగర్ లో మొదటిసారి మేం రాష్ట్రం నలుమూలలనుంచీ వచ్చిన విద్యార్థుల్ని చూడవలసివచ్చింది. ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదువుకుని వచ్చిన విద్యార్థుల్ని చూడగానే చాలా బెరుగ్గానూ,సిగ్గుగానూ ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు చాలా సహజంగా మాట్లాడేవాళ్ళు. మేం పదవతరగతి దాకా తెలుగుమీడియం లో చదువుకున్నాం. ఇంగ్లీషులో మాట్లాడటం అలవాటులేకపోగా, మా హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఇంగ్లీషులో మాట్లాడటం అపరాధమనే భావనకూడా మాలో కలిగించినందువల్ల మాకు, ముఖ్యంగా నాకు ఇంగ్లీషులో ఒక్క ముక్కకూడా నోరు తిరిగేది కాదు. పైగా ఇంగ్లీషు క్లాసు కామన్ గా ఉండటంతో అన్ని గ్రూపులవాళ్ళూ కలిసేవారు. వాళ్ళందరిమధ్య నోరుతెరవాలంటే చాలా సంకోచంగా ఉండేది. కాని మా ఇంగ్లీషు లెక్చెరర్ బి.ఎల్. నరసింహంగారు నేను రెండవ సంవత్సరం చివరిలో ఉండగా నేను ఇంగ్లీషులో బాగా పట్టు సాధించానని మెచ్చుకున్నారు. అది నా జీవితంలో నేను పొందిన గొప్ప ప్రశంసల్లో ఒకటి.
ఇక కలవరం కలిగించిన కారణాల్లో రెండవది, తాడికొండలో మాకూ, మా ఉపాధ్యాయులకీ మధ్య మానసికంగా ఎంతో గాడానుబంధం ఉండేది. మేం వాళ్ళను ప్రేమించేవాళ్ళం, మా తల్లిదండ్రులతో సమానంగా చూసుకునేవాళ్ళం. కాని సాగర్ జూనియర్ కళాశాల అయినందువల్ల,తాడికొండ స్థాయిలో మానసికానుబంధం బలపడలేదు. చాలాకాలం పాటు ఆ వెలితి అట్లానే ఉండేది. కాని ఆ శూన్యాన్ని పూరించిన మనిషి అప్పటి మా లోకోపేరెంట్ భద్రయ్యగారు. ఆయన మా ఇకనమిక్స్ లెక్చెరర్. నన్ను చాలా అభిమానించారు. నేను రెసిడెన్షియల్ పాటర్న్ నుంచి వచ్చిన విద్యార్థిననీ తక్కినవాళ్ళకి ఒక మోడల్ గా ఉండాలనీ అనేవారు. ఆ కళాశాలలో నేను రెండేళ్ళపాటు చదవగలిగానంటే అందుకు ఆయన చూపించిన వాత్స్లల్యమే కారణం.
మూడవదీ, బహుశా నా జీవితాన్ని సమూలంగా మార్చివేసిందీ ఒక విషయముంది. అదేమంటే నా మొదటిసంవత్సరం పరీక్షా ఫలితాలు రాగానే అందులో నాకు తెలుగులో 36, ఇకనమిక్స్ లో 36 మార్కులు రావడం. ఆ రెండు సబ్జెక్టులూ నాకెంతో ఇష్టమైనవి. అయినా నాకంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. భద్రయ్యగారు రీకౌంటింగ్ పెట్టిద్దామన్నారుగానీ ఎందుకు పెట్టించలేదో ఇప్పుడు గుర్తు రావడం లేదు.
కాని ఆ సంఘటనతో నాకు చదువుమీదనే ఆసక్తి పోయింది. ఏమైతేనేం, సివిల్ సర్వీసుకి వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో సి.ఇ.సి తీసుకున్న నేను నా మొదటిసంవత్సరం ఫలితాల వల్ల మొత్తం కెరీర్ మీదనే దృష్టి వదిలేసాను. నా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక నేను సిల్వర్ జూబిలీ కాలేజికి వెళ్ళకపోవడానికీ, ఎక్కడో నామమాత్రంగా బి.ఏ లో చేరడానికీ, ఆ తర్వాత ఆ చదువు కూడా మధ్యలో ఆపేసి టెలిపోన్స్ డిపార్ట్మెంట్ లోఉద్యోగంలో చేరిపోవడానికీ ఆ మొదటిసంవత్సరం అనుభవమే కారణం.
సాగర్ జీవితం నాలో కలిగించిన మరొక కలవరం, సాధారణంగా ఆ వయసు కలిగించే కలవరం. పదహారు, పదిహేడేళ్ళ అడాలసెంటు పిల్లవాడి మనసు చాలా లేతగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనిపిస్తుంది, ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించినవాళ్ళకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. తాడికొండ జీవితం నుంచి సాగర్ జీవితానికి వచ్చేటప్పటికి నాకు తెలీకుండానే నా మనసులో వికసించిన కొత్త కలవరాన్ని నేనొక పట్టాన అర్థం చేసుకోలేకపోయాను. ఆ కలవరంలో అక్కడ నా మొదటిసంవత్సరంలో నాకు తోడుగా ఒకరిద్దరు సీనియర్లు నిలబడకపోలేదు.
కాని ఆ కాలమంతటా నన్ను నిజంగా ఆదరించిందీ, అక్కునచేర్చుకున్నదీ సాహిత్యమేనని చెప్పాలి. రైట్ బాంకు బ్రాంచి లైబ్రరీలో అందుబాటులో ఉన్న తెలుగుసాహిత్యమంతా చదివినాప్పుడు. చలం, బుచ్చిబాబు, శరత్ ల కథలు, నవలలతో పాటు సంజీవదేవ్, ఆచంట జానకిరాం వంటివారి రచనలు కూడా నాకు తోడుగా నిలబడ్డాయి.
ముఖ్యంగా ఆ రోజుల్లో నాలో రేకెత్తిన ఎన్నో ప్రశ్నలు మా అక్కకి ఉత్తరాలు రాసేను. ఆమె ఎంతో ఓపిగ్గా, ప్రేమగా నాకు జవాబులు రాసేది. ఆమె రాసిన ఉత్తరాలే లేకపోయుంటే ఆ అయోమయంలో నేనెటుజారిపోయిఉండేవాణ్ణో నాకే తెలియదు.
బహుశా నా రెండవసంవత్సరమంతా నేను చదువు మీంచి దృష్టి సాహిత్యం మీదకు తిప్పిఉంటానని ఇప్పుడు అర్థమవుతున్నది. నా సాహిత్యజీవితానికి నిజమైన పునాదులు అప్పుడే పడ్డాయనుకుంటాను. నేను రెండవసంవత్సరంలో ఉండగానే ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి కథలపోటీకి ఒక కథ రాసిపంపించాను. దానికి రాష్ట్రస్థాయిలో మొదటిబహుమతి వచ్చింది. ఆ కథ మా అన్నయ్య పేరుమీద ప్రచురితమయ్యింది. కాని ఆ సంఘటన నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. నా కర్తవ్యం సివిల్ సెర్వంట్ గా గడపడం కాదనీ, ఒక కవిని కావడమనీ,రచయితని కావడమనీ నాలోపల్లోపల నేను బలంగా నమ్మడం మొదలుపెట్టాను.
సాగర్ జీవితం నాలో కలిగించిన కలవరంతో పాటు నాకొక కొత్త జీవితానికి కూడా దారిచూపించిందని చెప్పాను కదా. ఆ జీవితం నాలో కలిగించిన కొత్త చైతన్యం గురించి కూడా రెండుమూడు మాటలు చెప్పాలి.
సాగర్ చుట్టూ ఉండే లాండ్ స్కేప్ లో ఏదో ఒక గంభీరసౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అ రిజర్వాయర్. దూరంగా ఆనకట్ట, సాయంకాలం కాగానే ఆ జలాశయంలో ప్రతిఫలించే దీపాలవెలుతురు. తంగెడు పూలూ, పొద్దున్నే రిజర్వాయర్ మీచి వీచే శుభ్రపవనాలూ నాలో కవిని తట్టిలేపాయి. ఆ రోజులంతటా నేను డైరీలు రాయడం మొదలుపెట్టాను. ప్రతి రోజూ నాలో కలిగే భావాల్ని 'భావవీచిక 'పేరిట రాసుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రాతలు నన్ను నాకు చాలా సన్నిహితుణ్ణి చేసాయి. తాడికొండలో నాకు లభించి సాగర్ లో శూన్యంగా మారిన చోటేదో దాన్ని నా భావాలతో నింపుకోవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నాకు తెలియకుండానే నేనొక రొమాంటిసిస్టుగా మారడం మొదలుపెట్టాను.
జీవితానికి దూరంగా, కలలప్రపంచంలో మాత్రమే జీవించేవాడు రొమాంటిసిస్టు. అందుకే ఆ రోజుల్లో నాకు చాల ఇష్టమైన కవిత వేదుల రాసిన 'దీపావళినాడు '. 'దినములు పరస్పర ప్రతిధ్వనులుకాగ,ఇరువదైదేండ్లు నా బతుకిట్టె గడిచె, ఈ రహోదు:ఖ వీధులందు నేనెరుగ సఖుల అడుగుజాడలీసరికి కూడ ' ఎన్ని సార్లు చదివి ఉంటానీ వాక్యాన్ని!
ఆ రోజుల్లోనే ఒకసారి సెలవులనుంచి కాలేజీకి తిరిగివస్తూ గుంటూరు బస్ స్టాండ్లో 'అసమర్థుని జీవయాత్ర ' కొని చదివాను. ఆ పుస్తకం నన్ను పూర్తిగా నిశ్చేష్టుణ్ణి చేసింది.
కాని ఆ అగమ్యంలో మళ్ళా మా అక్క ఉత్తరాలే నాకు దారిచూపించాయి. ఆమె రాసిందికదా: కళ జీవితం కాదు, జీవితం కళగా మారాలని. గొప్ప కళాకారుడు తన శక్తినంతా కళగా మార్చుకుని తన జీవితాన్ని అశాంతితో నింపుకుంటాడనీ, అలాకాక తాను జీవించవలసిన రోజువారీజీవితాన్ని కూడా ఎంతో సౌందర్యవంతంగా జీవించగలగడమే నిజమైన కళ అనీ ఆమె రాసింది. అక్కడితో ఆగకుండా నాకు 'సౌందర్య ' అనే కలం పేరు కూడా పెట్టింది.
ఈ ప్రపంచంనుంచి దూరంగా పోవాలనే కలలొకవైపూ, ఈ ప్రపంచంలోనే బాధ్యతో జీవించాలనే ఆమె మాటలు మరొకవైపూ నాలో గొప్ప సంఘర్షణ రేకెత్తించాయి.
ఆ రోజుల్లోనే మా కాలేజీకి శ్రీనివాసరెడ్డిగారు ప్రిన్సిపాలుగా వచ్చారు. అత్యంత నిజాయితీపరుడు, సత్యసంధుడు. పూర్తిగాంధేయవాది. ఆయనవల్లా, ఆయనమాటలవల్లా నాలో గాంధీజీ పట్ల కొత్త కుతూహలం రేకెత్తింది. ఒకసారి ఆయన కాలేజీలో గాంధీక్విజ్ నిర్వహించాలనుకుని ఆ బాధ్యత నాకప్పగించారు. నిజాయితీగా ఆలోచించడం, నిజాయితీగా బతకడం అనే రెండు గొప్ప విలువల్ని ఆయన చాలా సరైన సమయంలో నాకు నూరిపోసారని చెప్పాలి. బహుశా సాగర్ జీవితం నాకు అందించిన అతి గొప్ప ఉపాదానమదే.
చాలా రోజుల తర్వాత చుక్కారామయ్యగారూ, నేనూ ఒకేవేదిక మీద మాట్లాడుతున్నప్పుడు రామయ్యగారు గురుకుల విద్యావ్యవస్థ గురించి చెప్తూ 'గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల గురించి ఏం చెప్పుకోగలిగినా చెప్పుకోలేకపోయినా వాళ్ళు విలువలకోసం బతుకుతారని మాత్రం చెప్పగలం 'అంటూ, 'అందుకు ఉదాహరణ ఇదిగో మా వీరభద్రుడే ' అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు శ్రీనివాసరెడ్డిగారే మదిలో మెదిలారు.
ఇన్నాళ్ళ తరువాత సాగర్ కళాశాల గురించి తలుచుకున్నప్పుడు నాకు రెండు విరుద్ధాంశాలు గుర్తొస్తూ ఉన్నాయి. నా చదువుకీ, ఉద్యోగానికీ సంబంధించిన కెరీర్ కి ఆ కళాశాల నాకేమీ సహకరించలేకపోయింది. కాని అక్కడ నాకెదురైన ఆ అనుభవాలే తటస్థించకపోయిఉంటే నేనొక రచయితగా మారిఉండేవాణ్ణా, జీవితంలో విలువలకి కట్టుబడి ఉండటం అన్నిటికన్నా ముఖ్యమని నమ్మి ఉండేవాణ్ణా అన్నది చెప్పలేను.

No comments:

Post a Comment

Total Pageviews