Friday, April 10, 2015

కొన్ని కవితలు

1) కళ్ళకిగంతలు కట్టుకుని ఒకరినొకరు మనసుతో
పట్టుకుంటూ మీరాడుకున్నంతకాలం ఆడుకున్నాక
ఆమె హఠాత్తుగా నీ చూపులు విదిలించుకుంటూ
నా మత్తు వదిలిపోయింది,తక్కింది నీ ఇష్టమంది.
ముదురుపసుపులో ముంచి తేల్చిన శరత్సంధ్య.
నిన్నుసుసంపన్నం చేసిన నిన్నకాలం, మొన్న
కాలం నేడు నువ్వు వదిలించుకోలేని ఋణదాతలు.
ఏప్రిల్ కాదు*, అక్టోబరు ఒక క్రూరమైన నెల.
ఇద్దరూ కలిసి ఒకేకలకంటూండగా ముందెవరికి
మెలకువవచ్చేస్తుందో, వాళ్ళు అదృష్టవంతులు.
పీల్చుకున్నంత పీల్చుకుని తుమ్మెద ఎగిరిపోయాక
అక్కడ పడివుండేది పువ్వుకాదు,ఒట్టిమరక.
*April is the cruelest month...
-T.S.Eliot ( The Waste Land: The Burial of the Dead)

2) ప్రేమపరితప్తులైన సమయాల్లో, కళ్ళల్లో కన్నీటిపొరలు
పేరుకుంటున్నప్పుడు, గొంతు గద్గదమయ్యేవేళల్లో
నిలవనివ్వని రక్తవేగోధృతి ముందు మీరొకరినొకరిని
పరికించుకుంటూ దేహాల్ని దాటి చూడాలనుకుంటారు
ఒకరికొకరు దూరంగా ఉండవలసివచ్చినప్పుడు, తీవ్ర
వియోగదు:ఖం త్వరితంగా కాల్చేస్తున్నప్పుడు, ఇది
నాకు అవసరమా అనుకుంటారు.మెలిపడ్డ మనసుల్ని
విప్పి మామూలు మనుగడ సాగించాలనుకుంటారు
కొన్ని క్షణాల్లో స్వర్గలోకపు అంచుల్ని తాకుతుంటారు
మరికొన్నివేళల్లో నేలకుజారిపోతారు, బహుశా ప్రేమ
సంతృప్తులైనప్పుడు మీరు కోరుకోవలసింది స్వర్గంకాదు,
భూమి కాదు; ఆ రెంటినీ సమంగా నిభాయించడం

3) నీ నేత్రాలు నన్ను వెన్నాడుతున్నాయి, కల్లోలిత
నగరజలాల్లో ఈదులాడుతున్నా నన్ను వదలని
గేలం కొక్కెం. గుండెను గీరుతున్న ఆ ముల్లు
నా లోపలకీ చొచ్చుకుని పైకిలాగి పారేస్తే బాగుణ్ణు
పైకెగరేసిన గాలిపటంలా నీ నేత్రాలు నన్ను గాల్లో
తేల్చి కిందకు లాగుతున్నాయి, రోజంతా ఎక్కడ
పనిచేస్తున్నా తల్లిధ్యాస బిడ్డల్ని వదలనట్టు, ఎన్ని
వ్యాపకాల్లో మునిగినా నన్నిట్టే తేల్చేసే చూపులు
అర్థరాత్రి మహానగరం నిద్రలో మాటుమణిగినవేళ,
పున్నాగపూల సౌరభం సామ్రాజ్యం సాగించినట్టు
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన నా మనోగుల్మంమీద
నీ నేత్రాలు తుమ్మెదలై వాలి తేనెలాగుతున్నాయి.

4) ఆలోచిస్తున్నాను,నిన్ను వదిలిపెట్టగలనేమోగాని
నువ్వు నా దేహంలో కుట్టిపెట్టిన సూర్యకాంతినెట్లా
వదులుకోగలను?తోటనుంచి బయటకు రాగలనేమో
కాని మనసుమీద పడ్డ పరాగధూళి దులపలేను
అప్పుడు మరేధ్యాసాలేకుండా గంపలకొద్దీ చైత్రకాంతి
పోగుచేసుకుంటూ గడిపాం,ఆకాశం కొమ్మ ఎక్కడ
వంచినా రాగాలరవ్వలు రాలిపడ్డ కాలం,బాల్యం
యవ్వనం రెండూ ఒక్కసారే వర్షించిన అద్భుతం.
చిన్నప్పుడు విన్న చీమా, గొల్లభామలకథ. ఐనా
ఒక చీమలాగా జీవించడం నాకు చాతకాలేదు
ఉన్నట్టుండి తుపాను తలుపులు మూసేసినప్పుడు
సూర్యకాంతి మిగిలేది గొల్లభామకు, చీమకు కాదు.

5) And I will sing of that second realm,
where the soul of man is cleansed..
Dante : The Divine Comedy ( Purgatory:4-5)
ఇంతదాకా మీరొకరినొకరు ఇష్టపడ్డారు, వెర్రి
పడ్డారు, ఇప్పుడు పరస్పరం ప్రేమించుకునే
సీమలోకి ప్రయాణం మొదలుపెట్టారు,అనంత
కాంతి,ఆకాశపు నీలిమవైపు రెక్కలు చాపారు

ఇష్టం ప్రేమగా మారే కాలం పువ్వు పిందెగా
మారే వేళలాంటిది, సమ్మోహనీయ సౌరభం
స్థానంలో ఇప్పుడెంతో వగరు,ఊరికే కన్నీళ్ళు
జలజలపొరలినట్టు తొడిమచుట్టూ జీడిచార
కడు దుర్భరసమయం. మేసినంత పచ్చదనం
మేసి గొంగళిపురుగొక గూడుగా మారిపోతున్నది
ఆకలిమాత్రమే తెలిసిన ఇంద్రియప్రపంచమిట్లా
ఆదమరిచినిద్రిస్తేగాని ఆనందపు రెక్కలు తేలవు

6) కాఫ్కాకథలోలాగా ఇన్నాళ్ళూ నువ్వొక ద్వారం
ముందు నిల్చున్నావు, తెరిచిఉందో, మూసి
వుందో, నీకోసమో, మరెవరికోసమో,అడుగు
పెట్టవచ్చో,అడగరాదో తేల్చుకోలేకోలేకపోయావు

ఇంతకాలం ద్వారం ముందే తచ్చాడినా గోడ
గురించే ఆలోచించావు. ఇన్నాళ్ళూ ఆ తలుపు
నీ కోసమే తెరిచిఉందని అది మూసేసాకనే
తెలుసుకున్నావు, అచ్చం కాఫ్కాకథలోలానే.
కాని కాఫ్కా చూడని ముగింపు నీ కథలో.
బయట తలుపు మూసెయ్యగానే హఠాత్తుగా
నీలో ఒక తలుపు తెరుచుకుంది. అక్కడ గోడ
లేదు,గోడులేదు,ద్వారంలేదు,దౌవారికుడులేడు.

7) భగవంతుడు నీ కోసం తలుపు తెరిచిపట్టుకున్నాడు
నువ్వేమిటింకా మనుషులమధ్యే తప్పిపోతున్నావు
ఆమె ముఖం అటు తిప్పగానే కృష్ణపక్షం మొదలు
ఇక శరత్కాలచంద్రుడితో సంభాషించే వ్యవధి ఎక్కడ?

యాభయ్యేళ్ళ నీ జీవితం రెండుమాటల్లోకి కుదిస్తే-
ఒక సంకోచం, ఒక వ్యాకోచం: వెరసి ఒక హృదయ
స్పందనం.నీ గుండెతాళం చెవులు మరెవరి చేతుల్లోనో
పెట్టేసాక నీ ఇంటిగుమ్మంముందు నీకే తప్పని ప్రతీక్ష.

పూలు, పడవ, వెన్నెల, వేణువు: సుమధురశబ్దం
ప్రతిఒక్కటీనిన్ను రాచిరంపానపెడుతున్నది.తెలిమంచు
తెరలమధ్య తీరా విమానమొకటి నీకోసం వాలే వేళకి
నువ్వొక బాలికతో ఇసుకలో మేడ కట్టుకుంటున్నావు.
8) కాకినాడలో ఈరోజు ఇస్మాయిల్ మిత్రమండలి ఆయన్ని స్మరించుకుంటూ రేణుక అయోల 'లోపలిస్వరం ' కవితాసంకలనానికీ, రెంటాల శ్రీవెంకటేశ్వరరావుగారి 'లోపలకి ' విమర్శకీ పురస్కారం అందచేస్తున్న సందర్భంగా:
ఆయన కొన్నాళ్ళు మనమధ్య జీవించాడు, అధిక
భాగం మౌనంగానే గడిపాడు, అప్పుడప్పుడూ ఏదో
మనతో పంచుకోవాలనుకునేవాడేమో ,మాట్లాడటానికి
గొంతు సవరించుకోగానే గుండె చేతుల్లోకి ఊడిపడేది

డ్రాయింగ్ రూము చుట్టూ నిశ్శబ్దం సముద్రం లాగా
మోహరించేది.అప్పుడాయన యుద్ధం గురించో,
మృత్యువు గురించో, యూరోపియన్ తత్త్వశాస్త్రం
గురించో మాట్లాడతాడని ఎందుకో మనకొక ఉత్కంఠ

ఇంతకీ ఆయనేమి మాట్లాడేడు? మనకేమి గుర్తుంది?
కోతలుకోసి కుప్పనూర్చినపంటపొలాలమీద పిచికలు.
సమృద్ధినిండిన వాటి కూజితాలు ,వాకలపూడి
బీచిలో ఇప్పటికీ పూర్తికాని ఒక నత్తప్రణయయాత్ర
10) ప్రేమానుభవం సాంద్రమయ్యేకొద్దీ ఏం జరుగుతుంది?
నీతో నువ్వు మాట్లాడుకోవడం మొదలుపెడతావు,
వాదించుకుంటావు, నీతోనువ్వు గొడవపడతావు,
నీ ప్రశ్నలకి నీకు నచ్చే జవాబులే కోరుకుంటావు.
నిన్ను నువ్వు సముదాయించుకుంటావు, కానీ
ఊరడిల్లాలనుకోవు, ఒప్పించుకుంటావు, కానీ
తప్పించుకోవాలనుకోవు,నీ హృదయం పువ్వు
లాంటిదే, ఏం లాభం, ముందు తాకేది ముల్లే.
బహుశా ప్రేమానుభవంకూడా ఒక ధ్యానానుభవం,
ప్రశాంతమైన ఆ ఒక్క క్షణంకోసం అంతులేని
అశాంతి. నిన్ను నువ్వెలానూ చేరుకుంటావు,
కానీ మధ్యలో నిన్ను నువ్వు దాటిపోకతప్పదు
11) మన కాలం వీరుడు మండేలా. ఆయన ఈ భూమ్మీద జీవించినకాలంలో మనం కూడా ఉన్నామన్నది గొప్ప గర్వకారణం. 1991 లో మండేలా భారతదేశానికి వచ్చినప్పుడు నేను రాసిన కవితని ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ రోజు ఎంత ప్రియమైన రోజు
ఈ రోజు ఎంత ప్రియమైన రోజు
ఈ రోజు నువ్వు నా దేశానికి వచ్చావు.
పళ్ళతో, పువ్వుల్తో, నవ్వుల్తో, నాట్యాల్తో నీకు మావాళ్ళు స్వాగతం పలుకుతారు
చిట్లిన వీపుతో, వంగిన నడుంతో, బరువెక్కిన వదనంతో
దూరం నుంచే మేమంతా
మా పొలాల్లోంచి,వీథుల్లోంచి,
నీ రాక గురించి కుతూహలంగా, గర్వంగా, ధైర్యంగా తలుచుకుంటాం.
ఈ రోజు నువ్వు భారతదేశానికి వచ్చావని
దక్షిణాఫ్రికా సంతోషపడుతుంది.
ఈ రోజు నువ్వు భారతదేశానికి వచ్చావని
ప్రపంచం కళ్ళప్పగించుకుని చూస్తుంది
ఈ రోజు నువ్వు భారతదేశానికి వచ్చావని
అమెరికా వగైరా అణురాజ్యక్షిపణులన్నీ అసహనంగా కుములుతుంటాయి.
1915 లో బొంబాయి ఓడరేవులో
మోహన్ దాస్ గాంధి దిగినప్పుడు
ఆయన చేతుల్లొ స్వాతంత్ర్య సందేశాన్ని పంపింది దక్షిణాఫ్రికా
ఇన్నేళ్ళు పట్టింది
మళ్ళీ స్వేచ్ఛాసందేశం వినడానికి ఈ దేశానికి.
ఈ రోజు నిజంగా ప్రియమైన రోజు
కంపిస్తున్న అడుగుల్తో నువ్వు నా నేలమీద అడుగుపెట్టావు
దురాధిక్యతని సహించని వినమ్రశిరస్సుతో.
ఇరవైఏడేళ్ళపాటు జైల్లో వున్నావన్న ఒకేఒక్క ఆశ్చర్యం తప్ప
మా ప్రభుత్వాధినేతలకు నువ్వు మరేమీ కావు
జైళ్ళు నిర్మించడమే తప్ప జైళ్ళు తెలియని వాళ్ళకి
ఈ రెండు రోజులూ నువ్వొక గర్వకారణమైన బందీవి.
మరకలేకుండా తళతళ మెరిసే డ్రాయింగ్ రూం బల్లలపైన మోచేతులు ఆనించి
నీతో సంభాషించే అదృష్టం నోచుకున్న ఆ గాడిదలకు నువ్వేమీ అర్థం కావు.
నువ్వు ఆ గదుల్లోంచి బయటకు రాగానే
ప్రకాశమంతమైన నీ నేత్రాల మహాశయపు ధగధగలూ కదిలిపోతాయి.
నువ్వు చూసిన దేశం నా దేశం కాదు
నీకు నా అసలైన దేశాన్ని చూపించాలని ఉంది.
ఉక్కలో, చెమటతో, కిక్కిరిసిన బస్సుటాపుపైన కణకణలాడే ఎండలో
రైతులమధ్య కూలీలమధ్య దళారీలమధ్య కిక్కిరిసిన ధూళిలో
నిన్ను నా ఊరికి తీసుకువెళ్ళాలని ఉంది.
పండినవీ, పండనవీ, అయినా నా కెంతో ప్రియమైనవీ, అన్నంపెట్టేవీ
నా ఊరిపొలాలకు అడ్డంపడి నిన్ను తీసుకు వెళ్ళాలని ఉంది.
లేగకూనలు, తూనీగలు, తెల్లమబ్బులు తారట్లాడుతుంటే
బావిగట్టు పైన చిందే నవ్వుల చిలకరింపుల్లో మెరిసే పాదాల వెంబడి
సన్నని కాలిబాటమీంచే నా ఇంటితోవ పట్టాలని ఉంది.
వానకు తడుస్తున్న ఇంటిచూరు కింద
కట్టెలపొయ్యిలో పొగ వూదుతో మా అమ్మ
నువ్వొస్తే తన సొంత అన్న వచ్చినట్టుగా సంతోషిస్తుంది.
బక్కచిక్కినవి నీ దేశంలోలాగే నా దేశంలోనివీ ఆవులు, గేదెలు, మేకలు
వాటిని చూస్తూ నువ్వు ఎంత ఆదరంగా పరవశిస్తావో చూడాలని ఉంది.
తాటాకు ఇళ్ళ గుడిసెలు, నిట్రాతి గూళ్ళు, కోపురుగడ్డి వాసలు
పేడ అలికిన అరుగులు, ఎర్రమట్టి మిద్దెలు
ఆ ఇళ్ళని చూడగానే 'నా ఆఫ్రికా 'అంటూ అరుస్తావేమోనని ఆశగా ఉలిక్కిపడతాను.
దేవుడులాంటిఒక మనిషిని మీ మధ్యకి తెచ్చానర్రా అని మా వాళ్ళకి చెప్పబోతే
'ఇతను మాలాంటి మనిషే, రైతు, కూలీ, కమ్యూనిష్టు 'అంటారు మా వాళ్ళు.
12) ప్రేమవ్యవహారం చిత్రంగా ఉంటుంది, అప్పుడు
మీరెంతో నిరర్థకంగా కాలం గడిపేస్తారు, ఊరికే
మాట్లాడుకుంటారు, ఊరికే పోట్లాడుకుంటారు
అయినా ఎంతో సార్థకంగా జీవించామనుకుంటారు

ఇంతలో మీలో ఎవరో ఒకర్నొక తలపు తొలుస్తుంది
జీవితం సార్థకంగా జీవించాలని కోరికపుడుతుంది
మీ పరిచయాలు,ఫోన్లు,పనిగంటలు పదిలంగా
చూసుకోదగ్గవనిపిస్తాయి, ప్రలోభనీయమవుతాయి.
అప్పుడు ప్రేమ ఒక్కటే నిరర్థకమనిపిస్తుంది,మీ
స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నదనిపిస్తుంది,సాధూ,
ప్రేమని వదిలిపెట్టాక జీవించడానికి మరేమీలేదు
కలచెదిరిపోయాక నిద్రకీ, మెలకువకీ తేడా లేదు.

ఆదివారం ఆదిత్య మాట్లాడుతూ 'తోమాస్ ట్రాన్స్ త్రోమర్ పోయాడు చూడండి, కవితాప్రసాద్ తో పాటే 'అన్నాడు. నాకు గుండెకి పోయే రక్తనాళాలు ఒక్కసారీగా ఖాళీ అయిపోయినట్టనిపించింది.
ఎక్కడి స్వీడన్, ఎక్కడి దక్కన్! కాని గత రెండుమూడేళ్ళుగా ట్రాన్స్ ట్రోమర్ మా జీవితంలో ఒక భాగమైపోయాడు. 2011 లో ఆయన కవిత్వానికి నోబెల్ ప్రైజు వచ్చినప్పుడు కవితాప్రసాద్ నన్నడిగాడు,ఆయన పేరు విన్నారా అని. అప్పటికే నా దగ్గర రాబర్ట్ బ్లై అనువాదం చేసిన 'Half Finished Heaven(2001) ఉందంటే ఆశ్చర్యపోయాడు. కాని ఆ పుస్తకంలోకి నా కన్నా ముందు అతడే ప్రయాణించగలిగాడు. ఉత్తరసముద్రం ఈదుకుంటూ మరీ స్వీడన్ పోయివచ్చినట్టు.
'ట్రాన్స్ ట్రోమర్ గుర్తొచ్చినప్పుడల్లా కవితా ప్రసాద్ గుర్తొస్తాడు'. ఈ మాట ఆదిత్యనే అన్నాడు. ట్రాన్స్ ట్రోమర్ ని కవితాప్రసాద్ అర్థం చేసుకున్న తీరులోనే ఒక మెలకువ ఉంది. We stole milk from the cosmos and survived అని ట్రాన్స్ ట్రోమర్ అన్న వాక్యాన్ని తలుచుకుంటూ, stole అని అనకుండా ఉంటే బాగుండేది అన్నాను.'తప్పేముంది? గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతం దొంగిలించే కదా తెచ్చాడు 'అన్నాడు కవితాప్రసాద్.కవిత్వ భాష అట్లాంటిది, సహృదయుడి చేతుల్లో పడగానే స్వీడిష్ తెలుగుగా మారిపోతుంది.
ట్రాన్స్ ట్రోమర్ ది ఒక నవ్య భాష. ఆయన జీవితకాలం పాటు రాసిన కవిత్వమంతా పట్టుమని 226 పేజీలు మటుకే. కాని ఒక విమర్శకుడు అన్నట్లుగా ఆయన transformed everyday into astonishment.
ఇక్కడ మూడుకవితలు అనువాదం చేసాను,మచ్చుకి.
ఆయన కవిత్వంలో, ఈ కవితల్లో కూడా, కనవచ్చే రూపకాలు, సంగీత ప్రస్తావనలు, బైబిల్ ప్రస్తావనలు ఒక్కొక్కటీ ఒక్కొక్కగ్రంథంగా వివరించవలసింత లోతైనవి.
1
రాగ గమకం
ఒక శోకదినం తర్వాత. హేడెన్ కృతులు వాయిస్తూ
నా చేతుల్లో ఒకింత వెచ్చదనం అనుభూతిచెందాను.
సిద్ధంగా ఉన్న మీటలు, తంత్రుల్ని దయగా మీటుతున్న
అంగుళులు, ఆకుపచ్చని ఉజ్వల సంగీతం,పూర్ణనిశ్శబ్దం.
ఆ స్వరప్రస్తారం మనకి స్వతంత్రం సాధ్యమనేచెప్తున్నది
ఇప్పుడెవరూ ఎక్కడా రాజుకి పన్నుకట్టనక్కరలేదు.
నా సంగీతమయవస్త్రం జేబుల్లో చేతులు పెట్టుకుని
జరుగుతున్నదంతా స్థిరంగా చూస్తున్నట్లే ప్రవర్తిస్తున్నాను.
నేను సంగీతపతాకని ఎగరేసాను: దాని సందేశం:
'మేము లోంగిపోవడం లేదు, కాని మాకు శాంతికావాలి '
సంగీతమంటే ఏటవాలు అంచుమీద నిలబడ్డ గాజుగృహం
శిలలు ఎగురుతున్నాయి, శిలలు దొర్లుతున్నాయి,
ఆ శిలలు ఆ ఇంట్లోంచే నేరుగా దూసుకొస్తున్నాయి,
అయినా ఆ గాజుగోడలు అన్నివేపులా భద్రంగానే ఉన్నాయి
(వివరణలు: హేడెన్ (1732-1809), జర్మన్ సంగీతకారుడు, ఎవరూ ఎవరికీ పన్నుకట్టనక్కర్లేదు అనేది బైబిల్ (మత్తయి సువార్త: 22:15-22) ప్రస్తావన)
2
వెర్మీర్
అది సురక్షిత ప్రపంచం కాదు, చప్పుడు మొదలయ్యేదక్కణ్ణుంచే. గోడకి అవతలి పక్క
మద్యం దుకాణం, నవ్వులు, గొడవలు, కన్నీళ్ళు, పళ్ళుపటపటలు,గడియారం చప్పుళ్ళు
ఇక పిచ్చిబావమరది ఒకడు, హంతకుడు, వాణ్ణి
చూస్తేనే అందరికీ భయం.
పెద్ద పేలుడు, అత్యవసరసేవలందించేవాళ్ళు నెమ్మదిగా దిగారు, దూరంగా పడవలు ముందుకు కదిలాయి, జేబుల్లోంచి చిల్లిపడ్డట్టు కారిపోతున్న డబ్బు,
పురమాయింపుల మీద పురమాయింపులు
విప్పారిన నోళ్ళు తెరుచుకుని పాటలపుష్పాలు, ముంచుకొస్తున్న యుద్ధాన్ని గుర్తు చేస్తూ వాటిస్వేదం.
ఇక అక్కడ నేరుగా ఆ గోడలోపల, లోపల ధారాళంగా గాలివీచే స్టూడియో
అక్క్డడ క్షణాలకి కూడాయుగాలపాటు జీవించడానికి అనుమతిదొరుకుతుంది.
'సంగీత పాఠం ', ' నీలిరంగుదుస్తుల్లో ఉత్తరం చదువుతున్నమహిళ '-ఇట్లాంటి పేరుగల వర్ణచిత్రాలు.
ఆమె ఎనిమిది నెలల గర్భిణి,లోపల రెండు గుండెలు స్పందిస్తున్నాయి,
ఆమె వెనక గోడమీద ఒక అజ్ఞాతతీర పటం.
ఊపిరి పీల్చు. గుర్తుపట్టలేని నీలివస్త్ర మొకటి కుర్చీకి కట్టిపెట్టారు. శరవేగంతో బంగారు ములుకులెక్కణ్ణుంచో వచ్చిపడుతున్నాయి, మరుక్షణం అక్కడంతా నిశ్శబ్దం, ఎన్నాళ్ళబట్టో నిశ్శ్బ్దం తప్ప మరేమీలేదన్నట్టు.
చెవుల్లో రొద, బహుశా లోతుల్లోంచికావచ్చు లేదా ఎత్తుమీంచేనా కావచ్చు
అది గోడకి అవతలి వేపు ఒత్తిడి
ఆ ఒత్తిడికి ప్రతి ఒక్క యథార్థమూ గాల్లోంచి తేలుకుంటూ వచ్చి
కుంచెగీతల్ని బలపరుస్తున్నది.
గోడల గుండా ప్రయాణిస్తే మనుషులు గాయపడతారు, జబ్బుపడతారు
కానిమరో దారిలేదు
ఉన్నదంతా ఒకటే ప్రపంచం. ఇప్పుడిక గోడల సంగతి.
గోడలు నీలో ఒక భాగం.
ఈ సంగతి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒకరి విషయమూ ఇంతే
ఒక్క పిల్లల విషయంలో తప్ప.
పిల్లల ప్రపంచంలో గోడల్లేవు.
ఆకాశం ధారాళంగా గోడకి అడ్డంగా పరుచుకుంది
శూన్యం వైపుతిరిగి ప్రార్థన.
కాని ఆ శూన్యమేదొ మనవేపు తిరిగి
గుసగుసలాడుతున్నది:
'నేను ఖాళీగా లేను, తెరుచుకునే ఉన్నాన' ంటున్నది.
(వివరణలు: వెర్మీర్ (1632-1675) డచ్ చిత్రకారుడు. ఇళ్ళల్లోపలి జీవితాన్ని అనితరసాధ్యమైన వెలుగునీడల్తో చిత్రించినవాడు. ఈ ఒక్క కవితమీద మనం కొన్ని రోజుల పాటు మాట్లాడుకోవచ్చు. కాదు, ఇప్పుడే మాట్లాడుకోవాలనుకుంటేwww.jstor.org/stable/40146880 చూడవచ్చు)
3
కోకిల
ఇంటికి ఉత్తరంవేపు యూకలిప్టస్ చెట్టుమీద కూచుని కోకిల కూస్తూ ఉంది. ఆ స్వరం ఎంత బలంగా ఉందంటే నేను మొదట్లో ఎవరో గాయకుడు కోకిలని అనుకరిస్తున్నాడేమో అనుకున్నాను.కాని ఆ పిట్టని చూసి ఆశ్చర్యపోయాను. అట్లా కూస్తున్నప్పుడల్లా దాని తలాతోకా బోరుపంపు హేండిల్లాగా పైకీ కిందకీ ఊగుతున్నాయి.ఇంకప్పుడది లేచి గొణుక్కుంటూ ఇంటిమీంచి ఎగురుతూ పశ్చిమానికి సుదూరానికి తరలిపోయింది. ..వేసవి ముసలిదవుతోంది, ప్రతి ఒక్కటీ ఒక నిట్టూర్పుగా చిట్లిపోతోంది.కోకిల మళ్ళాఉష్ణమండలదేశాలకు తరలిపోయింది.స్వీడన్ తో దానికింక పనిలేదు.ఇంక ఎక్కువరోజులుండదిక్కడ.అసలు దానిది ఆఫ్రికా.ఇంక నాకు ప్రయాణాలంటే మక్కువ తగ్గిపోయింది.కాని ప్రయాణాలే నన్ను పలకరిస్తున్నాయి.రోజులు గడిచేకొద్దీ నేను మరింత మూలకి జరుగుతున్నాను, చెట్ల కాండాలు లావెక్కుతున్నాయి, నాకు కళ్ళద్దాలతో పనిపడుతోంది.ఇంకా మనం మోసుకుపోలేనివి ఎన్నో జరుగుతున్నాయి. అయినా వాటిని చూసి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.లివింగ్ స్టోన్ కళేబరాన్ని సుసీ, చుమా ఆఫ్రికా పొడుగుతా మోసుకుపోయినట్టు ఈ ఆలోచనలు నన్ను కూడా అంతే విధేయంగా మోసుకుపోతాయి.
(వివరణలు: డేవిడ్ లివింగ్ స్టన్ (1813-1873) ఆఫ్రికా తలుపులు తెరిచిన తొలి అన్వేషకుల్లో ఒకడు, స్కాటిష్ మతప్రబోధకుడు. ఆయన జాంబియాలో మరణించినప్పుడు అతడి అనుచరులు సుసీ,చుమా ఆ కళేబరాన్ని సముద్రతీరందాక మోసుకుంటూపోయారు. వాళ్ళు లివింగ్ స్టన్ కళేబరాన్ని మోసుకుపోయినట్టు తన ఊహలు తనని కూడా అంతే విధేయంగా మోసుకుపోతాయనడం ట్రాన్స్ ట్రొమర్ కి మాత్రమే సాధ్యమైన మెటఫర్)


నిన్న ట్రాన్స్ ట్రోమర్ కవితలు మూడు అనువదించాక ఆ అనువాదం ఒక సవాలుగా తోచింది. తెలుగు కవిత్వాన్ని యుగాలుగా మన కవులు శబ్దాడంబరంతో బరువెక్కించేసారు. అందుకనే కవిత్వంలో నిశ్శబ్దం గురించి ఇస్మాయిల్ గారు అంతగా కొట్టుకుపోయేడు. బయటి కవిత్వాన్ని తెలుగు చెయ్యాలంటే, పాబ్లో నెరూడానో, నజీం హిక్మత్ నో అనువదించినంత సులభంగా రిల్కనో, మచాడోనో,చీనా జపనీయ కవుల్నో అనువదించలేం.
అందుకని ఈ పొద్దున్నే మళ్ళా ట్రాన్స్ ట్రోమర్ కవిత మరొకటి వాగాడంబరం లేని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించాను. ట్రాన్స్ ట్రోమర్ కవిత్వంలో సంగీతకారుల గురించిన ప్రస్తావనలూ, వారి సంగీతాన్ని కవిత్వంద్వారా ప్రశంసించే ప్రయత్నం కనిపిస్తాయి, హేడెన్ మీద రాసిన కవిత నిన్న అనువదించాను. ఆయనకు ఎంతో ప్రకాస్తి సముపార్జించిన The Grief Gondola వాగ్నర్ మీద రాసిన కవిత. ట్రాన్స్ ట్రోమర్ కి ఆస్ట్రియా సంగీతకారుడు ఫ్రాంజ్ షూబర్ట్ సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన సంగీతాన్ని మాటల్తో, అది కూడా నిశ్శబ్దం నింపుకున్న మాటల్తో వర్ణించే ప్రయత్నం చేసిన Shubertina కవితకి నేను ప్రయత్నించిన అనువాదం ఇదిగో, ఇలా ఉంది.
షూబర్టీయం
నూయార్క్ కి బయట,ఎనభై లక్షల మనుషులు జీవిస్తున్న ఇళ్ళన్నటినీ ఒక్క చూపులో ఒడిసిపట్టుకునేటంత ఎత్తుమీంచి.
ఆ నగరమక్కడ ఒక కాంతిప్రవాహం, ఏటవాలుగా కనిపిస్తున్న నక్షత్రమండలం.
ఆ నక్షత్రసముదాయం మధ్య బల్లలమీద జరుపుతున్న కాఫీ కప్పులు, గవాక్షాల్లోంచి
పెద్దపెద్దదుకాణాల యాచన,ఆనవాలు కూడా మిగలని వస్తువుల సుడిగాలి.
అంతస్తులమీద అంతస్తులు, నిశ్శబ్దంగా మూసుకుపోయే ఎలివేటర్ల తలుపులు
మూడుసార్లు బీగాలు బిగించిన తలుపుల వెనక స్థిరంగా హెచ్చుతున్న కంఠధ్వని.
భూగర్భ మార్గాల్లో కార్లలో ముందుకు తూలుతున్న దేహాలు, సంచలిస్తున్న పాతాళ స్మశానాలు.
లెక్కలమాటకేం గాని -నాకు తెలుసు- ఈ క్షణాన అక్కడ కిందన ఏదో ఒక గదిలో ఎవరో షూబర్ట్ ని సాధన చేస్తుంటారు, తక్కినప్రపంచమంతటికన్నా అతడికి ఆ స్వరాలే ఎంతో యథార్థం.
2
ఒక్క చెట్టుకూడా లేని మానవమేధా క్షేత్ర విస్తారమైదానాలు పిడికిటి ప్రమాణానికి కుంచించుకునేదాకా చుట్టలుచుట్టుకుపోయాయి.
ఈ చైత్రంలో ఆ పక్షి అదే పట్టణంలో, అదే పెరటితోటలో అదే చూరుకింద కిండటేడాది గూటికే మళ్ళా తిరిగివస్తున్నది.
ఆమె ఆఫ్రికాఖండం నుంచి భూమధ్యరేఖమీదుగా ఆరువారాల పాటు రెండు ఖండాలు దాటి ఈ అపారభూక్షేత్రమ్మీది ఈ బిందువుకే మరలివస్తున్నది.
వియన్నాకి చెందిన ఆ లావుపాటి యువకుడు, సూదిబెజ్జంలోంచి నదుల్ని ప్రవహింపచేసినవాడు,ఒక జీవితకాలం పాటు అయిదు తంత్రుల సంగీత వాద్యకారులకోసం కొన్ని చిహ్నాలు, సంకేతాలు పోగుచేస్తూనే గడిపాడు,రాత్రికాగానే కళ్ళద్దాలతోనే నిద్రపోయేవాడు, మిత్రులని 'పుట్టగొడుగ ' ని పిలిచేవాళ్ళు
తెల్లవారగానే క్రమంతప్పకుండా తన సంగీతంబల్లముందు నిలబడేవాడు.
అప్పుడేంచేసేవాడో గాని కాగితాలమీద విచిత్రంగా వెయ్యికాళ్ళ జెర్రులు పాకడం మొదలుపెట్టేవి.
3.
అయిదు తంత్రుల వాద్యాలు వినిపిస్తున్నాయి, కాళ్ళకింద నేలలొత్తలు పడుతుంటే నునువెచ్చని అడవిదారిన ఇంటిబాట పడతాను.
ఇంకా పుట్టని శిశువులాగా మెలికెలు తిరిగి, కళ్ళుమూసుకుని, భారరహితంగా భవిష్యత్తులోకి దొర్లిపోతాను, ఇంతలో హటాత్తుగా మొక్కలు కూడా ఆలోచిస్తున్నాయని తడుతుంది.
4
ఈ భూమిలోకి జారిపోకుండా బతకాలంటే ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా బతకాలి!
పట్టణాన్ని పట్టుకు వేలాడుతున్న హిమరాశులపట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి.
అవ్యక్తవాగ్దానాలపట్ల,అంగీకారమందహాసాలపట్ల ఎంత మెలకువగా ఉండాలి, ఆ టెలిగ్రాం మనకోసం కాదనీ, లోపలనుంచి ఆ గొడ్డలిపెట్టు మనమీద పడబోదని మనమెంత నమ్మాలి.
ఉక్కుతుమ్మెదల ప్రవాహం మూడింతలయ్యే నగరమార్గాలమీద మన రథచక్రాల్ని మనమెంత నమ్ముకోవాలి.
కాని అవేవీ మన నమ్మకాన్ని చూరగొనేటంత విలువైనవి కావు.
అంతకన్నా విలువైనదాన్ని దేన్నో నమ్ముకోవచ్చనే ఆ పంచతంత్రీ వాద్యాలు మనకి చెప్తున్నాయి, రోడ్డు మీద మనతో పాటు అవి కూడా నాలుగడుగులు కలిసి నడుస్తాయి.
మెట్లమీద బల్బు ఆర్పేసాక, పక్కనున్న గోడమీద అలవాటుగా చెయ్యానించి ఆ చీకట్లో దారి వెతుకున్నంత సహజంగా.
5
అప్పుడు మనం పియానో ముందు కూచుని నాలుగు స్వరాల ఎఫ్ మైనర్ పలికించబోతాం, ఒకే శకటానికి ఇద్దరు చోదకుల్లాగా అదొకింత హాస్యాస్పదంగా ఉంటుంది.
మన చేతులు సంగీతస్వరాల తూనికరాళ్ళుగా మారిపోయి
మనని భీతావహుల్ని చేస్తున్న రాగసమతౌల్యాన్ని సరిదిద్దబోతున్నామా అన్నట్టుంటుంది
అక్కడ రాగమూ, విరాగమూ ఒక్కలానే ఉంటాయి.
'ఆ సంగీతం వీరోచితం ' అంటుంది అన్నీ.నిజమే.
కాని కార్యశూరుల్ని కించిందసూయతో చూసేవాళ్ళూ, తాము స్వయంగా హంతకులు కాలేనందుకు లోపల్లోపల తమని తాము ఈసడించుకునేవాళ్ళూ
వాళ్ళకి ఆ సంగీతంలో చోటు లేదు.
తోటిమనుషుల్ని అమ్మేవాళ్ళూ, కొనేవాళ్ళూ, ప్రతి ఒక్క మనిషినీ కొనుగోలుచెయ్యగలమని నమ్మేవాళ్ళూ
వాళ్ళకక్కడ చోటులేదు.
అది వాళ్ళ సంగీతం కాదు.
ఎన్ని గమకాలు తిరిగినా తెంపులేని రాగధార, ఒక్కొక్కప్పుడు ఉదాత్తం, సప్రకాశం,ఒక్కొక్కప్పుడు ముతక, ప్రచండం, కొన్నిసార్లు నత్తనడక, కొన్నిసార్లు ఉక్కు తీగె.
ఇప్పుడు ఈ క్షణాన మనలోతుల్లో
నిబ్బరంగా పైకిపాకుతున్న
కూనిరాగం.


No comments:

Post a Comment

Total Pageviews