Thursday, April 16, 2015

చెరువైపోయిన గుండె, వసంతసేన

చెరువైపోయిన గుండె
చిన్నప్పుడే తొమ్మిదేళ్ళకో, పదేళ్ళకో పెళ్ళయ్యి
పుట్టింటినుంచి దూరంగా వచ్చేసిన జీవితం నీది
చూడాలనిపించినప్పుడల్లా చూట్టానికి
పోవాలనిపించినప్పుడల్లా పోడానికి
వీల్లేనంత దూరం.
పెళ్ళిపల్లకీ ఎక్కినప్పుడు
ఒట్టి ఆట అనుకున్నావు
తోరణాలు,సన్నాయి
మరొక పండగేమో అనుకున్నావు
రెణ్ణాళ్ళు గడిస్తే మీ ఊరువెళ్ళిపోతావనీ
బొమ్మలపెళ్ళి ఆడుకుంటావనే అనుకున్నావు
చూస్తూండగానే
గడిచిపోయాయి ఏళ్ళు, దశాబ్దాలు.
నీ మొగుడికి పిల్లల్ని కన్నట్టు
నీ దేహాన్ని ఈ లోకానికొక పాన్పు చేసి
ప్రణాళికలు కంటున్నావు.
నీవికాని భాష, నేల, గాలి
నీవనుకుంటూనే బతుకు వెళ్ళదీస్తున్నావు
గుర్తుందా, నీ చిన్నప్పుడు కాకరపాడు సంతలో
ఒక కోదుయువతి కళ్ళనీళ్ళుపెట్టుకున్నప్పుడు
మీ నాన్న చెప్పాడు నీతో
ఆమె పుట్టింటివాళ్ళు కనబడ్డారని.
దిసమొల పిల్లవాడు వీథిలో
బూరావూదుకుంటునట్టు కోకిలపిలుపు,
ఆకాశాన్ని వడగట్టి చైత్రమాసపువాన
రాత్రంతా పిండిన పూలతావి.
నీ స్వజనం, నీ స్వగ్రామం, నీ స్వదేశం
నీ ఇంటి తలుపు తడుతున్నారు
నీ గుండె చెరువైపోయింది.

2) వసంతసేన

From loneliness we extract life's faint sweetness
And distill it into poetry

-Kaneko Mitsuharu (Song of Loneliness)
నీ జీవితం మూడవజాము గడుస్తుండగా
నువ్వు చూస్తూ ఉండగానే ఒక స్త్రీ
బయటకి వెళ్ళిపోయింది.
ప్రేమించడం, మరీ తీవ్రంగా ప్రేమించడం తప్ప
నువ్వు మరే నేరమూ చెయ్యలేదు.
నీ హృదయాన్ని మృదువుగా తన హృదయంనుంచి తప్పించి
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నప్పుడు
నువ్వు మౌనంగా ఉండిపోయావు, అది
వేడుకుంటే ఆగేది కాదని నీకు ముందే తెలుసు.
అప్పుడు, ఆ క్షణాల నిశ్శబ్దం కూడా
ప్రేమవరదానమేనని తెలుసుకో.
మళ్ళా ఒక ఏప్రిల్ వచ్చినప్పుడల్లా
మృచ్ఛకటికనాటకం మరొకసారి చదువుకున్నట్టే అనిపిస్తుంది.
నువ్వు చారుదత్తుడివే
నీ హృదయమంతా కుమ్మరించావు
కాని నువ్వు కూడా పొందావన్నదే నిన్ను నిలవనివ్వని వేదన
ఎక్కణ్ణుంచి వస్తుందో కోకిల
సరసులాంటి నీ తెల్లవారుజాములో
అల్లరిపిల్లవాడిలాగా ఒక జ్ఞాపకం విసుర్తుంది
ఇక వలయాలు, వలయాలుగా మనసుచిట్లిపోతుంది.
దేన్నైనా భరించవచ్చుగాని
ప్రేమ ముగిసిపోయిందనే తలపు భరించడం కష్టం.
అది జీవన్మృతి.
అప్పుడప్పుడు కోకిల
ఎక్కణ్ణుంచో కరిచితెచ్చి ఒక గింజ రాలుస్తుంది
ఇక మిలమిల్లాడే చైత్రమాసపు ఆకుపచ్చని వెలుతురు
బాటమీద పాటలాగా రాలిపడే పసుపుపూలవాన
నీ ప్రేమపూర్వశైశవం గుర్తు తెచ్చుకో,
అప్పుడెవరున్నారంటుంది.
అదేమి చిత్రమో కాని, నదీస్నానంలో
మునకలేసినట్టు ప్రేమలో మునిగినప్పుడు
వెచ్చగానే ఉంటుంది,
కాని ప్రేమనుంచి విడివడ్డప్పుడు, అదొక గమ్మత్తైన అనుభవం,
తిమ్మిరినుంచి బయటపడ్డట్టు
జీవితం మరింత ప్రేమించదగ్గదిగా గోచరిస్తుంది
చుట్టూ ఉన్న చెట్లని, మనుషుల్ని, వస్తువుల్నీ
పేరుపేరునా పోల్చుకోవడం మొదలుపెడతావు
రాత్రి నిద్రలో మొదటిజాము గడిచాక
ఒక స్త్రీ వెళ్ళిపోతూ కనిపించింది నీకు
ఎందుకు వెళ్ళిపోతున్నావని అడగాలనుకున్నావు
ప్రాధేయపడాలనుకున్నావు
మాట పెగల్లేదు.
రెండవజాము, మూడవజాము
మరొక ఇద్దరు స్త్రీలట్లానే వెళ్ళిపోయారు
కాని నాల్గవజాము, సరసులాంటి తెల్లవారుజామున
ఒక తెలినీలి ఊహ కనిపించగానే
దిగ్గున లేచి కూచున్నావు,
చేయిపట్టుకున్నావు, పాదాలకు చుట్టుకుపోయావు
ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు
నిన్ను మాత్రం వదులుకోలేనన్నావు
ఒంటరివయ్యావనుకున్నప్పుడు కూడా
ఒక వసంతసేన నిన్నంటిపెట్టుకునే ఉంది
రాత్రంతా కురిసిన పూలవాన,తీపిగాలి
నిన్ను దగ్గరగా లాక్కుంటున్న కోకిల.

3) 
మధ్యాహ్నం ఎండ వాలు తిరిగినప్పుడు
సందులో ఎవరో పిలిచినట్టు-
కాకరపాడుసంతలో నేను కనిపించకపోతే
'చంటీ ' అని మా నాన్నగారు
పిలుస్తున్నారా,
పంటనూర్పు కళ్ళందగ్గర నిలబడి
బస్తాలు బళ్ళకెక్కిస్తూ
మా ఊరి రైతులెవరో పలకరిస్తున్నారా
ఒక్క అడుగు వెనక్కి వేసాను
చిరపరిచితమైన ఆ పిలుపు
నిండుగా పూసిన మామిడిచెట్టుది
ఆ కొండలవరసకి అవతల
ఏదో ఊరేగింపు సాగుతున్నట్టు
బాజాలు,వీరణాలు,
విరజిమ్మిన సాంబ్రాణిపొగ.
ఏటికవతల ఎవరో వస్త్రాలు ఆరబెట్టుకుంటున్నట్టు
ఒకింతచల్లని, ఒకింత నునువెచ్చని
శుభ్రపరిమళం.
ప్రవాసంనుంచి స్వదేశానికి మళ్ళిన
పక్షిరెక్కలు రేపిన జ్ఞాపకాలదుమ్ము.
పండగముగిసిన తరువాత
ఊరువదిలి వచ్చేటప్పుడు
గొంతుకి అడ్డం పడ్డ బెంగ.
ఎప్పుడో కలిసిపాడుకున్న పాటలన్నీ
మళ్ళా ముంచెత్తినట్టు కొత్తపూత.
నిండుగాపూసిన మామిడిచెట్టుఎదట
ఏ ఒక్కరూ ఒంటరికారు.

No comments:

Post a Comment

Total Pageviews